
నల్లని ప్రేమ … జంట హత్యలు
అది దేవుని రహస్య స్థావరం.. మౌనమీ ముఖాల చిత్ర తాడన … కలిసి విడిపోయి .. విడిపోయి కలిసే దీర్ఘ పతనం మరేం చెబుతుంది.. అలా కొత్తగా ఆగిపోవడానికి ఏదో సర్దుకోవాలని.. ఇంటికి తీసుకు వెళ్ళింది… వర్షం .. రాత్రి కి ఉండిపొమ్మని…చీకటిని వదిలేసిన వాడిని … తెలియని మహా ఘర్ష మెత్తగా రాలగొట్టిన తీర్ధ దీపం కడిగే అంటు రాతలు .. నల్లబారి.. బండగా ఉండిపోయిన ఊపిరి కొసల్లో స్వాధీన రార్జ కేంద్రం. ఒక చోటి నుంచి ఇంకొక చోటికి దూకే అనుమానాలు … చిత్ర సవ్వడి వడపోసిన బెంగ తో కంటికి కనపడని కథని లాగిపెట్టి .. మరింత తేరుకోలేని దీర్ఘ నిరుత్తర ముఖాన్ని తిప్పి తను తిప్పేసుకొన్న చీకటి .. యుగమంతా ఇలాగే ఉంది.. అనుకొన్నవాటి దగ్గరే ఏదీ ఆగిపోకూడదు. కొంచెం కల ముగ్గిన దీర్ఘ వాయువ్య సమాధిగా కొన్ని నిర్ణయాలు తలపడతాయి.
ఒక నిర్ణయం .. రెండు సమాధి పత్రాలు.. కిందా మీద పడి రాలుతున్న ఇల్లు … అక్కడ ఇక ఏ మాటలు లేవని దిద్దుకొంటూ … గుర్తు పట్టవా? అని… ఎవరు ఎవరిని అడుగుతారు.. విశ్వమంతా కదలని అనుయాయ వర్తనగా తిరగబడి.. కాస్త చోటు దొరకని నిద్ర దీపాల మధ్య చూపు తిప్పుకున్న నిరాశ గదిలో చల్లారిపోతుంది.
గది తలుపుకి రెండు సార్లు తన మునివేళ్ళు తాకినట్లుగా… బయటకొచ్చి చూస్తే ఓపెద్ద గాజు సీసా … దూరంగా సోఫా లో ఇమంది… ఏంటిది అన్నట్లు చూసాడు…నిరుపమ్ .
కొంచెం చల్లని మిశ్రమం తయారు చేస్తున్నప్పుడు… మరో బీకరు లోంచి అమాంతం ఎక్కువ భాస్వరం పడిపోయినట్లు.. అదో రకమైన ఆయువు ఎక్కువైనట్లు స్థిరమైన గట్టి శరీరం… స్త్రీత్వం తక్కువని అప్పుడప్పుడు నిరుపమ్ ఈసడించుకొంటాడు. ప్రతి రోజూ ఏదొక కొత్త ఉపద్రవం అతనికి తెస్తూనే ఉంటుంది. ఇమంది….
నిరుపమ్ ఒక సగటు భర్త … ఒకరిద్దరు అక్రమ ప్రేయసులు.. స్థిరమైన భార్య … మర్యాద .. మన్నన పైకి coatingలతో…. కొంచెం మందు … పకోడీ.. అలిసి ఇంటికి వచ్చాక… పెద్దగా మరే వివరాలు అడగకూడదు. నవ్వుతూ ఉండాలి .. అడిగింది వండాలి.
వాడే అందులో… పొగాగా చేసి లోపల బిగించేసాను. ఇంకా బాయ్ ఫ్రెండ్‌నే( ముగిసిన కథని మళ్ళీ తెరవాలని ) … నీ మొగుడికి నీ న్యూడ్ వీడియో షేర్ చేసేస్తాను అంటూ.. నసగడం మొదలు పెట్టాడు.. వెధవ .. నెలల నుంచి టార్చుర్ … అయినా భరించా … నా శవాన్ని అనుభవిస్తాడట… నాపైకి ఎక్కి తలగడ పెట్టి నొక్కేయాలనుకొన్నప్పుడు తప్ప లేదు.
నీకివన్నీ అర్ధం కావులే.. ఇదొక పాతాళ ఊబి … దిగాలని చూడకు .. తాళాలు లేని నిజంతో ముసిరిన సరాసరి గాల్పు కమ్మి .. నేను ఆ కథనే వదిలిపెట్టేసాను…
నిరుపమ్ కి లోపల ఓ చిన్న భయం మొదలైంది.. ఆ మాటలు గుర్తొచ్చి..
అంటే మంత్రగాడు.. ఇక్కడే ఎక్కడో … ఈ సిటీ లోనే తిరుగుతున్నాడు.. వాడికి తీవ్ర కాంక్ష ఇమంది అంటే … ఆమె శరీర గట్టితనమంటే.. తను ఏం చెప్పిన బానిసలా తలొంచి చేస్తాడు. అది నిరుపమ్ కి ఓ రోజు కోపం లో ఇమందే చెప్పింది.
ఇదిగో నీ కోసం నవ్వుతాను… ఇది పైన వేసుకొన్న ఓవర్ కోట్ అంతే … తీసానంటే .. నాకంటే గ్లామరస్ గా ఎవరూ ఉండరు. గంధపు చెట్టుని చుట్టుకొన్న పాములన్ని ఒకేసారి బుసకొట్టినట్లు.. గంధకపు బిళంలో మాంసం కాలుతున్న వాసనా ఒళ్ళంతా కమ్మేసినట్లు… ఇమంది.
ఆ అర్ధరాత్రి వాడు చెమటతో తడిచి కూలిపోయాక .. తన దేహ నిందలని కడుక్కొని… విసిగిన నవ్వుని కాల్చుకున్న ముసురుని జల్లెడ పట్టి … వెన్నుని పొడుగ్గా సాగదీసాక …
ఇదంతా కాదు… నన్ను … కొంచెం వారణాశి తీసుకుపోతావా? అంది ఇమంది .
మృత్యు సరోవరం లోంచి వరాన్ని పొందిన జాము ఒక నిద్రని గుప్పెట పట్టి… గుడి ముందు పేర్చి… ఇదే తనని ఒప్పుకొంటూ … శ్వాస రక్షని నువ్వే తీసుకొని .. నాలోపల ఉండిపోగలవా? అని అడిగినట్లు ఉలిక్కిపడుతూ… సమర్పించడానికి .. వదిలివెళ్ళి పోవడానికి ఇంతకుమించి ఇంకేం లేదని కబురిని సృష్టికి ఇస్తూ… కొంచెం శిధిల ఖర్మ… వారణాశి.
కాలుతున్న శవాలు… సగం చంపేయబడ్డ గంగ .. అంతేగా … అన్నాడు. వికారపు నల్ల కొరడాని మానవ అశుద్ధంలోంచి తీసి ..వీపుపైనా కొట్టినట్లు…
ఇమంది బాత్రూం లోకి పరుగుపెట్టి .. టాప్ ఓపెన్ చేసి గుక్క పెట్టి ఏడ్చింది.. వాడు మంచం పై గుర్రు పెట్టాడు.
………………………………
ఎందుకు మరో రోజు మనపై ఏ అనుమతి లేకుండానే కమ్ముకు పోతుంది.. శరీరంలో కుదిర్చిన అనునయ సారాల నిద్ర పాదుని ఊది.. కొంచెం కలబడని ముసురు తో వేళ్ళాడుతూ … ఆ చోటులో దిక్కుని మార్చుకున్న దీపం మరో పరిమళ విషయం తో దీర్ఘ చలన మూర్తిని కౌగలించుకొంటుంది. అప్పుడంతా వాళ్ళ మధ్య మళ్ళీ పుట్టిన చీకటి కారుతూ జన్మ ని వారి చేసే నిద్ర కన్నీరు తో పోలిక లేని విశ్వ నగరపు మొదటి గుమ్మము తలకి కొట్టుకొని అన్ని ఆనవాళ్ల ని కుప్ప పోసాక … ఆ కుర్చీలూ జ్ఞాన దేవుని నిజ రూప దర్శనం జరిగినందుకు కంగారుపడతాం. అలా ఎలా పిల్చేయగలమని తను కొంత సిగ్గు కలిపిన బరువుతో తల వంచుకొన్నప్పుడు… నవ్వు కనిపించినట్లుగా నాకు అనుమానం.. అడిగితే చెప్పదని తెలుసు.
కొన్ని ఆగిపోవాలని… మరిన్ని మారిపోవాలని… కొంచెం అడుగుని ఆచితూచి వేసుకొంటూ పోవాలని… ఐనా ఇంకేదో శక్తి ఇదేమి వినదు. కనీసం కన్నుని కూడా సరి చెయ్యదు. ఊల పెడుతున్న సంక్షోభం మెదిలే గుట్టు కొంచెం తలని పొంచి కాటు వేస్తుంది. ఇదంతా అలవాటు కావాలనే … అడవులు.. కొండ కోణాలు తిరగ మనేది.. నీకు తెల్సిందే సర్వస్వం అనుకుంటే … తెలియనిది దాడి చేసి నిన్ను ముక్కలు చేస్తుంది. పరస్పరం మన ఉనికి ని మనం… మనం చేతిలో పెట్టిన ఇంకొకడు.. తినగా మిగిలిందే మనమెక్కడ సిగ్గులేకుండా నాక్కుకొంటున్నాం. ఆరా తీసుకొంటూ పోతే అడుగు పెట్టడానికి కూడా ఆయాసపడే స్థలమే నీకు ఓ మూల మిగలొచ్చు… కానీ ఆ మూల నువ్వు కనుక్కొని వెళ్ళేలోపు నువ్వుగా మిగులుతావా? ఈ పెద్దా ప్రశ్నని ఎవరూ ముందే తలుచుకోరు.
ఒక నెమలి తో ఇమంది గదిలోకి వచ్చిన నిరుపమ్.. వాడి కళ్ళలో ఏదో కనుక్కొన్న వికారపుఁ నవ్వు… అదేమీ అలసట కాదు…కొంచెం తగ్గి మోసం చెయ్యడం కాదు… ఏదో పోను పోను ముంచే ప్రయత్నం చేసే వాడిలా .. ఆ నెమలిని చూస్తుంటే….. లక్షల వాన ప్రమిధలని ఒళ్ళంతా పూసుకొని.. వేల సూర్యోదయాల రశ్మిని రోజూ తాగి తన పింఛాల రంగు మార్చుకొని … నాట్యమాడే నైపుణ్యం .. ఎవరు చూసిన … చూడకున్న … ఉందని తెలుస్తూనే ఉంది. సాధకి గుర్తుందిగా … తనే …. ఇంతకు ముందు కురిసిన ఏడు రంగుల వర్షం లో తడుస్తూ .. ఆ కొండ వెనుక … కార్ ఆగిపోతే .. బయటకొస్తూ చూసాను. అలా పాత ప్రేమికుడు చూడకూడదట … నెమలిగా మారి పోయింది.. అదంతా వేల పాములు తిరిగే చోటు.. అందుకే నాతో తీసుకొచ్చా.. అన్నాడు.
వింటూన్న ఇమందికి … ఎర్రగా ఒళ్ళంతా కందిపోయింది.. తన లోపలి కాంక్షకి ఎవరో నిలువెత్తు అద్దం పెట్టి చూపిస్తున్నట్లు… నిన్న రాత్రి ఏదో విషయం లో అతని కాళ్ళు పట్టుకొని బతిమాలడం.. రెప్పల కింద తడిచిన సిగ్గుని .. చిలికి బట్ట కప్పి ఆరబెట్టిన చోట .. పులిసిన వాసన.
పెద్ద మడుగులో ఈదుతున్నప్పుడు … సడన్ గా ఓ పాములా గుట్టని చూసినట్లు… దేహ దీపం లాక్కొన్న చిత్ర నీలపు దొంతర్ల ఉపేక్ష గజ గజ వణికినట్లు.. ఏదీ తెలుసుకోలేని ఆయుస్సుని వాళ్ళు కడిగి దూరం చేసుకొన్న మురిసిపాటుతో పడిపోయినట్లు… అంతా మసక భూమిలో సామ్య శిఖరం ఎగిరి దూకినట్లు…
ఇమంది suitcase సర్దేస్తుంది.. లోపల వాడికి ఓ బరువు తగ్గిపోతుందిలే అనుకొంటున్నాడా అంటే ఊహించడం కష్టం. ప్రతి రాత్రి వాడికి మాంసం కాలడమూ కావాలి. అలా లేకపోయినా గింజుకొని… గింజుకొని అల్లాడిపోతాడు.
ఇప్పుడేమైందని .. అన్నాడు.
అదిప్పుడు నెమలి కాదు … సాధకి .. నా ఒంట్లో మంటలు బయలు దేరాయి.. ఇక ఏ మాత్రం టైం లేట్ చేసినా … ఆ మంట ఇంకా పెరిగితే .. నా ఒంటి మీద బట్టలు.. వేసినవి వేసినట్లుగా కాలిపోతాయి.. మొత్తం రోజంతా మంటని భరిస్తూ … బట్టలు లేకుండా తిరగాలి. నా వల్లకాదు .. నన్ను వెళ్ళనియ్యి. అని వేడుకొంది….. ఇప్పటికే ముక్కలై పోయాను… ఆ ముక్కలని వదలకుండా పిండేయడానికే ఇదంతా చేస్తున్నావ్.. నాకిక ఏ అనుమానం .. ఆశా లేకుండా అర్ధమైంది. ఇమంది
నాక్కొంచెం టైం ఇవ్వు.. ఏదైనా జూ కి ఇచ్చేసి వస్తాను. మళ్ళీ నిన్ను తప్ప ఇంకెవరిని ఎప్పుడూ తల తిప్పి కూడా చూడను.. ఇదే ఆఖరిసార ని చెంపలు వేసుకొన్నాడు….
ఇవ్వడానికి నెమలి కాదు.. సాధకి… రేపక్కడ ఆ వర్షం వస్తే.. ఆమె ని నువ్వు official గా మ్యారేజ్ చేసుకున్న ప్రూఫ్‌లతో తను గనక కోర్ట్ ఎక్కితే .. నిన్ను లోపలవేసి కుమ్ముతారు. నీతో పాటు సహకరించానని నన్నూ బొక్కలో వేస్తారు.
అదో పెద్ద కేసు ఎప్పటికీ వదిలించుకోలేనంత పెద్దది అవుతుంది.
…………………………………
గడ్డ కట్టిన మెదడులని… వెల్లకిలకి చెమట తో సన్నగిల్లిన నరాల్ని … కాస్త విసుగు పట్టేసిన మాటలని… మోసుకు తిరిగే ఆలోచనల బరువుని .. కథన రాశుల మధ్య ఊగిసలాడే మాంస చిత్రాల మెళకువలని … కొంచెం కొంచెంగా …నమిలేస్తూ.. దీర్ఘ వైధవ్య చీకటి చుట్టిన కోరికలని.. కాష్టం పై కరిగిస్తూ బార్లు.. ఒక సాయుధ యుద్ధ ఒడంబడిక తర్వాత … అప్పటివరకు గాయపడ్డ దేహాలు కూలిపోయిన గుట్టల్లా జనాలు… కొన్ని అరుపులు… కొన్ని మత్తులు… కొన్ని ప్రకోప మూర్తుల ఊగిసలు.. కొన్ని మైకపు తిరుగుడు వృత్తాల సరిహద్దులు… అంతా కలిసి అయోమయం గడ్డ కట్టిన నిందలు… కోలాటాలు .. నవ్వులు… గొణుగుడు తీర్ధాల మొద్దు నిద్రలు…
మంత్రగాడు .. నిరుపమ్ .. ఓ బార్లో … మందు కొడుతున్నారు. నల్లని నూనెలో నెలలుగా కాగే తుమ్మ మొద్దులా ఉన్నాడు.. రక్త దీపం నూనె ఖాళీ అయిపోయి … ఒత్తి గుప్పున మండుతున్నట్లు కళ్లు… భయం నిషిద్ధ నగర చిత్రాన్ని పట్టుకొని దీర్ఘ చింతనకి మొహమాటపడ్డ జంతు కుమ్ములాటకి సిద్ధమయ్యేలా వాడి బలమైన శరీరం… ఆరున్నర అడుగుల ఎత్తు… అంతకు రెండింతలు తాగగల కెపాసిటీ… నిరుపమ్ calculations చాలా పక్కాగా ఉంటాయి.
అంత ఖర్చు పెడుతున్నాడంటే .. అంతకు వాటినుంచి పిండుతాడని వాడికి తెల్సు..వాడు హిమాలయాల్లో ఓ క్షుద్ర గురువుని పట్టుకొని… అతనికి ఓ బానిసలా సేవ చేసి .. మనసు గెల్చుకొని.. విద్యలన్నీ నేర్చుకొని … వాడినిక చంపేద్దాం అనే టైములో … అతనిని అక్కడనుంచి తెలివిగా తప్పించి … కొన్ని విద్యలు ఇమంది నేర్చు కొంది… ఇది చాలా రహస్యంగా … నిరుపమ్ ని కలవడానికి ముందు నేర్చుకొని… మంత్రగాడికి కూడా తెలియనివ్వ లేదు.
ఆ గురువు తనని రక్షించిన ఇమంది మీద పూర్తి నమ్మకం పెట్టుకోవడం మొదలు పెట్టాక .. అతను గురువునని మర్చిపోయి.. ఆమెని ఎక్కడంటే అక్కడ తడమడం మొదలుపెట్టాడు. అది తారాస్థాయికి తీసుకెళ్లి… నాకొక రెండేళ్లు గడువివ్వు… నా విద్యతో నేను తిరిగి యవ్వనవంతుడిగా మారిపోతాను. మనిద్దరం పెళ్లి చేసుకొందాం అని ఇమంది తో అన్నాడు. ఓ మంచి రోజు చూసి .. అతనిని చంపి అక్కడ నుంచి పారిపోయి వచ్చింది.
మంత్రగాడు వాళ్ళు అప్పటికి గంట నుంచి మాట్లాడుతున్న సంభాణకి ముగింపులా… కొంచెం లో వాయిస్ తో ( అతనికి మాత్రమే వినిపించేలా )… ఇప్పుడిక రెండే దార్లు… వాడిని సీసా లోంచి తీసి.. నెమలిని వాడికి ఇచ్చేయడం.. ఆమెని నెమలిగానే పెళ్లి చేసుకొని శోభనం గదిలోకి తీసుకెళ్లిన తక్షణం వాడికి వచ్చిన ఇప్పటి శక్తులతో ఆమె స్త్రీ గా మారుతుంది.. ఆ విద్య నాకు తెల్సు. .తక్షణం ఆమె అతనిని భర్తగా accept చెయ్యాలి.. లేదా అతను ఆమె భర్తగా ఉండి చంపి పోవడం నుంచి ఎవరూ ఆపలేరు. వాడీ విషయాన్ని .. ఏ మాత్రం కంగారు లేకుండా ఎంతో నిదానంగా చెప్పుకు పోతున్నాడు.
మరి రెండోది…. అన్నాడు నిరుపమ్ .
నెమలిని బతికుండగానే కప్పెట్టి .. ఆ మట్టి సీసాలో వేస్తే పొగ మనిషవుతాడు. వాడికి ఎనర్జీ రావడానికి ఓ గంట పడుతుంది.. ఈ లోపు వాడిని చంపి పాతేసి… మీ ఇద్దరూ ముందులా ఉండటం… ఈసారి మంత్రగాడి గొంతులో కర్కశం స్పష్టంగా వినిపిస్తోంది.
నిరుపమ్ .. వాడు ఏదీ ఓ పట్టానా నమ్మే .. సరిలే… అని సరిపెట్టుకొనే రకం కాదు.. మనిషిని వాడు చాలా ఘోరంగా అంచనా వేస్తాడు. నమ్మడం అనేదానికన్నా ముందు.. వాడు ఎన్నో లెవెల్స్ లో అలోచించి ఊ అంటాడు. తను వెనకటి రోజుల్లో దెబ్బతిన్న ఏ విషయాలని ఎప్పుడూ మర్చిపోడు. కొంచెం ఆగాక .. గొంతుని స్థిరంగా ఉంచి … నాకు మూడోది కావాలి…. అన్నాడు.
కొంచెం ఆగాక .. గొంతుని స్థిరంగా ఉంచి … మంత్రగాడు కాసేపు బ్లాంక్ అయ్యి … తలని బలంగా అటుఇటు ఊపి.. మరో గ్లాస్ గొంతులో పోసుకొని… మూడోదా? అదెలా … అన్నాడు. నార్మల్ గా వాడితో ఏది ఎవరూ negotiate చెయ్యరు.. వాడు ఏం చెబితే అదే.. లేదంటే వాడితో ఎంత ప్రమాదమో వాళ్ళకి తెల్సు. కానీ నిరుపమ్ అలా కాదు.. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా మొండి ధైర్యం..
వాడిని పొగగానే ఉండనియ్యి.. సాధకి నెమలి బొమ్మగా మారి … నేనెప్పుడూ పెదాల తడి చేసిన అమ్మాయిగా మారి నన్ను సుఖాల్లో ముంచాలి . ఇమంది నన్నెప్పుడూ నిలదీయని భార్యగా నాకు సేవలు చెయ్యాలి … అన్నాడు.
మంత్రగాడికి ఒక్కసారిగా షాక్ కి గురైనట్లుగా అయ్యే .. చీకటి కమ్మింది.
తన లోపలికన్నా నల్లని కౄరా ప్రపంచం నిరుపమ్ లో ఉందని వణికిపోయాడు.. వాడిని నచ్చచెప్పడానికి పోతే ఏం జరుగుతుందో అతనికి ట్లయింది కాదు.. నిరుపమ్ దగ్గర మంత్రగాడిని నాశనం చేయగల ప్లాన్ బి రెడీగానే ఉంటుందని వాడు బలంగా నమ్మాడు.
మంత్రగాడు పెద్ద నవ్వు నవ్వి ఓ పొగలా మాయమయ్యాడు.
…………….
ఇమంది .. తానొక ఛాయాదీపాన్ని చూపి .. సమాధిగా నమ్మించి బయపెట్టగలదు.. అయినా లోపలి శరీర దగ్ద వాంఛ .. ఒక బలమైన పురుష తాడన కోసం .. నిరుపమ్ ని ఎప్పటినుంచో భరిస్తూ వస్తుంది.. అది అతనికీ తెల్సు.. అందుకే ఓ బానిసలా ఆమె ని వాడు కొంటాడు..
నువ్వు నిరుపమ్ కాదు.. నాకు తెల్సు.. అంది. ఇమంది.. ఆమెని ఎప్పటికప్పుడు తక్కువుగా అంచనా వేసే దెబ్బ తింటున్న.. అతనిలోని మగ అహంకారం మాత్రం తను నా కాళ్ళ కిందే అని నమ్మేట్లు చేస్తుంది.
నిరుపమ్ లా మారిన మంత్రగాడు.. అదెలా అన్నాడు? వేడి వేడి మాంసాన్ని ఉడక బెట్టి విందుకు రెడీ చేస్తున్న రాబందులా… చూస్తూ….
నీ శరీరం నుంచి వచ్చే వాసన అది వెగటు పుట్టే వాసనా. అదే నిరుపమ్ నుంచైతే .. వాడు నన్ను ఎంత హింస పెట్టిన … వాడి వాంఛా పరిమళం … వాడి ఒళ్ళంతా నిండి ఉంటుంది.
నన్ను నువ్వు మోసం చెయ్యలేవు … అంది.
అప్పుడు ఆమె చూసిన చూపు.. ఒక విద్వoస నాలిక చెప్పుకొన్న కాళీకాలా ఉంది.
మంత్రగాడు తన రూపం లోకి వచ్చి… నిరుపమ్… తనకి ఇద్దరూ కావాలని అడిగిన విషయం చెప్పాడు. ఇద్దరితోనూ ఒకే టైములో కోరిక తీర్చుకోవాలని దాహం తో ఉన్నాడని… స్పష్టం చేశాడు.
కానీ … మంత్రగాడు ఆమె ఎలా ఆలోచిస్తుందన్న విషయం లో పూర్తిగా ఓడిపోయాడు… ఆమె కి ఏ విద్యలు వచ్చు అన్నది తెలియక పోయినా .. దెబ్బతిన్న తను ఎంత బలవంతురాలు లోపలినించి అన్నది అంచనా వెయ్యలేకపోయాడు.. మరు క్షణం దానికి తగ్గ మూల్యం చెల్లించాడు.
ఇమంది .. ఎర్రగా కందిపోయి.. సీసా తో ఓ గదిలోకి పరుగు పెడుతూ … అతనిపై తన చీరని విప్పి విసిరింది…. మరు క్షణం వాడు తేరుకొనే లోపే …. మంత్రగాడు శిలగా మారిపోయాడు.
కత్తి రెడీ చేసుకొని.. సీసా మూత తీసి .. అతను భర్తగా మారి… స్పృహ తప్పి పడి ఉన్నప్పుడే … కత్తితో కుళ్ళబొడిచి చంపేసి .. గంటలోపు వగర్చుకొంటూనే గొయ్యి తీసి పాతేసింది.
మంత్రగాడి బొమ్మని లోపల దాచి … నిరుపమ్ కోసం చూస్తుంది.
అంత నిర్మలతనీ పెదాలపైకి అద్ది … చూస్తున్న ఎదుట వాడిని మోసగించడం … ఆమె నేర్చుకొన్న మొదటి విద్య.. దానితోనే గురువునే మట్టుబెట్టింది.
………………………..
ఎవరు ఎవరిపై .. తమ తమ నటనలతో నెగ్గాలని చూస్తున్నారో… ఎలా గెల్చి వాంఛలని గుప్పెట్లో పెట్టుకొని ..మజా తీర్చుకోవాలనుకొంటున్నారో … అసలు వల్ల లోపల ఏం ఉందనేది ఊహించడం ఒకరికొకరికి కష్టమే.. అయినా వాళ్ళు దగ్గరగానే ఉన్నారు.
అతను వచ్చి రాగానే చేతిలో ఖరీదైన మందు బాటిల్ … balcony లో మందు సెటప్ చేసి … నాలిక తడుపుకొంటూ … అక్కడ బలాకానీ ఆరేసిన దుప్పటిని.. బలంగా నలిపి… ఆమె లోకి ఎర్రగ్గ చూసి … ఏదో బూతు మాట అనబోయేలోపు ఇమంది అతని నోరు మూసింది.. ఆమె నడుం కలుక్కుమనేలా దగ్గరకి లాక్కొన్నాడు . ఒక మత్తుని నల్లని ద్రవం లా మాటల్లోకి జార్చి.. ఇక దీని తర్వాత చూసుకో అన్నట్లు.. ఇక దూసుకు పోవడమే…
మరి … నాకిష్టమైన పకోడీ అన్నాడు. సీసాడు మత్తు ఊటలోంచి అప్పుడే ఒళ్ళంతా తడిచి బయటకొచ్చినట్లు చూసింది…. కొంచెం అతనిపైకి తూలింది…..
ఆమె చాలా రోమాంటిక్ గా తయారై వచ్చింది… వచ్చేసరికే గ్లాసులు నింపి ఉంచాడు.
నల్ల రంగు పల్చని నూలు చీర … లోపల ఇక అడ్డంగా ఉండేవేవీ వేసినట్లు లేదు.. కళ్ళకి పల్చని కాటుక కరిగి .. కళ్లు ఓ వింత నాదం తో… లేత గులాబీ లిప్‌స్టిక్.. జాస్మిన్ పరిమళం.. పెద్ద పొడవైన వదులు జుట్టులోంచి నిమ్మతొనలు మాగిన వాసన.. అదో రకమైన ఊగిసలా నడక….
విశ్వ నిజర్ణత కొంగు చాపి… మరో వాంఛా పేజీని తిరగరాసి.. కనబడని సమయ నిర్మాణం పై అడుగులని తుడిచి .. ఆ వెనక గమనించొకోమని… ఒక దీర్ఘ శ్వాస ముగ్గిన ఆయాస చూపుతో పలకరించి… తపించి రాలిన చెమటని తుడుచుకొంటూ……
అతను చూసి …. మురిసిపోయి… ఇద్దరూ తాగడం మొదలు పెట్టారు.. మధ్య మధ్య లో అతనికిష్టమైన జీడిపప్పు.. మాంసం కలిపి దోర దోరగా వేపిన పకోడీ.. నల్లని మాంసపు వాంఛలు తిరగబడి అరిచే రుచి … కిక్కు.. ఇమంది దాహ చూపులకి… గాల్లో లేచిపోతున్నట్లే … ఊగుతున్నాడు
మత్తు బాగా ఎక్కాక … నెమలి ఎక్కడా? అన్నాడు. ఇప్పుడెందుకు ? అంది ఇమంది..
అది చూస్తుండగానే మనం…… అని … మాట పూర్తి చేయకుండా ఆగి … వంకరగా నవ్వాడు.
………………………….
ఇమంది కసిగా నవ్వింది… ఆ నవ్వులో చాలా అర్ధాలు ఉన్నాయి.. వాడిలో ఒక తెలియని ఆందోళన.. ఒక్కసారిగా వాంతి వచ్చినట్లుగా………….. అర్ధమౌతూ ఉంది. అది కోపాన్ని మసకబారించే ఒక బలమైన ఎత్తుగడ…చిక్కుకున్న చావు ఎర… గందరగోళం…
నిరుపమ్ కోపంగా మీదికి రాబోయాడు…. ఏంటి నువ్వు చేసిన పని … అని అరుస్తూ….
ఇమంది నోటిలోంచి భళ్ళున రక్తం .. నిరుపమ్ ని సూటిగా చూసింది … వాడు వికృతంగా నవ్వగానే … ఆమె కి అర్థమైంది.. గ్లాసులు ఎందుకు ముందే నింపాడో… అక్కడే కూలిపోయింది.
అప్పుడే నెమలి ఎగురుకొంటూ బాల్కనీలోకి వచ్చింది. నిరుపమ్ ఒక్కసారిగా షాక్ కి గురై.. దేహమంతా నీరైనట్లు చూస్తూ .. ఒక దాహ తేరా తనని ముంచేస్తునట్లు చూస్తూ….
ఇమంది నెమలిగా ఉన్న సాదకి ని ఏం చెయ్యలేదు. ఆ నెమలి మాంసం తిన్నట్లుగా నిరుపమ్ ని భయపెట్టింది.. అంతే ….. అది ఆమె డైలీ వినోదం …. వికృత నిర్ధాక్షిణ్యం లోకి ఒలికిన తేనె రుచి….
ఇమంది … రోజు.. రోజుకి అతనిపై గెలుపు ఓ మగాడిగా ఏమాత్రమూ నచ్చడం లేదు.. అందుకే దానికి పుల్‌స్టాప్ పెట్టాలని .. విషం కలిపాడు.. మంత్రగాడి కోరికలన్నీ తీర్చి..సాదకిని ఓ సెక్స్ డాల్ గా మార్చుకొని సుఖ పడాలని నిర్ణయించుకొని ఇంటికి వచ్చాడు…. నిరుపమ్
ఇమంది … తన మొత్తం శరీర శక్తులన్నీ మూటగట్టుకొని… శ్వాస ఇంకొన్ని క్షణాలు ఇమ్మని సృష్టిని వేడుకొని… తను కొంగులో దాచుకున్న విషం పూసిన కత్తిని తీసుకొని… అతని గుండెలపై బలంగా అరుస్తూ పొడిచి … కిందపడి చనిపోయింది..
నిరుపమ్… ఆమె గుండెలపై పడి…. కుప్పకూలి పోయాడు.
మంత్రగాడు శిలగానే ఉండిపోయాడు.. నెమలి తిరిగి ఆ కొండలలోకి ఎగిరిపోయింది.
…………………………………….

