
నిద్ర జోలె .. మృత్యు వాకిలి
మహా విశ్వాస సృష్టి … కుడి పక్కగా ఒత్తిగిలినపుడు జారిన స్తన్య ధార సంగీతంగా … అలవోక ముద్రతో ఘనీభవ తాళ పంచకంగా .. పాట .. వదులైన దేహ రక్షా ముడుచుకొంటూ … నిశ్వాస బిళంలో పట్టు తప్పిన అడుగులని తిరిగి తెచ్చుకోలేని… బికారీ నడకతో … వైరాగ్య సన్నాహాల్లో ఎటు నుంచి ఎటు అని తెలియని …. భ్రమణ సంపదల అయోమయం ఉడక బెట్టిన వర్ణ లాల తీగలుగా జారీ.. నదులై ప్రవహించి… కథలే కలిసి పోయిన ఆశ్చర్యాలని చుట్టి.. వెల్లకిలైన జాగ్రత్తలని కడిగి ఆరబెట్టినప్పటి దీక్షలా అతను. ఎక్కడా మొదలైంది … మీ ప్రయాణమని అడిగితే .. అతను తీవ్ర ఉద్వేగం లోకి మారతాడు.. చుట్టూ ఉన్న పరిస్థితులని.. ఎదుటివారు తన మాటలని ఎంత గ్రహిస్తున్నారనే స్పృహ మర్చి.. ఓ తాదాత్మ్యం నిండిన ముఖంతో.. వారణాశి నుంచి మొదలైందని ఆహీరపు విశ్వ కుదుపు రువ్విన జ్ఞాన శీల ఒరిపిడితో రాజీలేని మృత్యువుని ముద్దాడుతూ విశ్వ నిద్రాణ హెచ్చరికని తరిమే సగం తీర్చిన శ్వాస తమకపు సమయ మూర్చన … వారణాశి
… తన పుట్టుక తనకి తెలియదని … ఊహ తెలిసాక తాను ఉన్నది అక్కడే.. అని అంటాడు. ఏవో కాష్టం దగ్గర చిన్న చిన్న పనులు… గుళ్ళ దగ్గర టాయిలెట్స్ క్లీన్ చేయడాలు చేసి … పొట్ట నింపుకోవడం..ఒక్కోసారి పడవల వాళ్ళతో కలిసి వెళ్లి చేపలు పట్టడం.. రోడ్లు క్లీన్ చెయ్యడం.. ఎవరికైనా సామాన్లు తెచ్చి పెట్టడం.. ఇలా ఎన్నో… అక్కడ .. ఇక్కడ అని లేదు. ఎక్కడైనా రాత్రయ్యేసరికి నిద్ర పోవడం..
ఓ రోజు ఓ గుడి మంటపంలో జ్వరం తో స్పృహ లేకుండా పడి ఉంటే .. ఓ బైరాగి వచ్చి ఏదో కాషాయం తాగించాడు.. సాయంత్రానికల్లా తగ్గి పోయింది. అతనిని వెదుకుతూ వెళ్లగా .. రాత్రి పొద్దుపోయాక .. కాస్త సందడికి దూరంగా ఉన్న మర్రి చెట్టు దగ్గర తుంబుర వాయిస్తూ పాడుతున్నడు. అతనితో కలిసి పాట ని అందుకున్నాడు.. ఆ బైరాగి ఆ పిల్లవాడి గొంతుకి .. ఆనంద పరవశుడయ్యాడు..గాలి చెమరించిన విశ్వ సాగులో అలలకి కన్నుని తిప్పిన సాఖీ దుఃఖాల మైకం ముంచేసే తిరుగుడు రాశుల మధ్య దేహ శిలాజ జన్మని కరిగించే అమృత నిర్ధార కంటి పోగుల అల్లిక ఆ గొంతు.. నువ్వు దీని కోసమే పుట్టావు … నాయన … అన్నాడు.
ఆ తెల్లవారుజామున … బైరాగి నిద్ర పాడు చెయ్యకుండా .. తాను కొంచెం దూరం లో గంగ వరకు వెళ్లి శృతి చేస్తూ పాడుతున్నడు.. అదీ సృష్టి మహా సంగమం లోంచి .. శక్తి తో పాటు .. వాన ఎలా కురుస్తుందని సాహిత్యం తో కూడిన పాట.. అతనికి అది ఎలా వచ్చిందో తెలియదు.. ఎక్కడో దూరంగా వారణాశి లేచి వింటున్నట్లు .. గుడి గంటలు.. శంఖః నాదాలు… పడవలు ఇంకా నిద్ర పోతూనే ఉన్నాయి. ఆ బైరాగి అది వింటున్నాడు..సప్తస్వర మాయ కదిలించిన కాష్టాల దీప ఒంపులో .. మహా నిర్యాణ వెలుగు కమ్మి.. మొత్తం వారణాశి విశ్వ కైంకర్య సమృధ్ధిలోకి జరిగి ఓలలాడుతూ..అదొక అనంతాన్ని తాకుతున్నట్లు…
అప్పుడే ఓ అద్భుతం జరిగింది.. ఆతర్వాత అవి అతనినుంచి అలా జరుగుతూనే వెళ్లాయి.. గంగా ప్రవాహం నుంచి ఓ కెరటం పైకి లేచి.. అతనిపైకి ఓ గొడుగులా మారి కొన్ని నిమిషాలు చల్లగా గొడుగు పట్టి పాట వింటున్నట్లు అలానే ఉంది.. ఆతర్వాత అతని పైకి వర్షంలా కురుస్తూ ఉంది…అతను తడుస్తూ మరింత ముగ్ధంగా పాడుతున్నాడు. దానికి సాక్షి అప్పటికి ఆ బైరాగి మాత్రమే.. వచ్చి ఆ పిల్లవాడి కాళ్ళ పై పడి …పిల్లవాడు కంగారు పడుతుంటే దగ్గరకి తీసుకొని .. ఇక పై ఇదే నీ ప్రయాణమని స్పష్టంగా చెప్పి అతనిని దీవించి . ఏదో నిర్ణయించుకున్న వాడిలా పిల్లవాడు ఎంత పిలుస్తున్న ఆగకుండా.. గంగ లోకి అలా నడుచుకుంటూ వెళ్లి ఆ ప్రవాహం లో కలిసిపోయాడు. ఆ తర్వాత బైరాగిగా మారి పాటతో దేశమంతా తిరుగుతూ.. ఇక్కడ మాత్రం ..ఈ గోదావరి ఒడ్డున మాత్రం .. లోపలి మాట విని .. కొద్దీ రోజులు ఆగాలనుకొన్నాడు.
…………………………….
జోలెలో ఒక తుంబుర తో నది ఒడ్డున నడుచుకొంటూ.. అతనొక సాగదీసిన ఆశ్చర్యం లా .. ఎప్పుడూ అప్పుడే స్నానం చేసినవాడిలా .. కదిలిక లేని వర్తమానాన్ని.. తన పాటతో.. మంచు నుంచి పాలని పుట్టిస్తూ… విశ్వ వాహి స్వరమేదో అతని పాటలో.. శ్వాస తమకపు కథ వండిన అడుగులుగా ,, ఆ కబురుని ఒకరి నుంచి మరొకరికి చెప్పుకొంటూ… అతనొచ్చి చాల రోజులయ్యాక ఊరు అతని ఉనికిని మాట్లాడటం మొదలుపెట్టింది…. జరిగిన చమత్కారం తెల్సుకొని.. బుగ్గలు నొక్కుకొంటూ.. కళ్ళు ఇంత చేసుకొని… వాళ్ళకి అలాంటి అదృష్టం దక్కాలని లోపలనే అనుకొంటూ……
బోర్లు వేసి వేసి .. చుక్క నీరు పడక అప్పులు పాలైన ఓ రైతుని నదిలోకి దూకడం ఆపి .. మహా ప్రార్ధి గా ఉన్న నీ తల్లితండ్రుల వరం నువ్వు… నీ మీద నీకు సంపూర్ణ అధికారం ఆనందం పొందడానికి మాత్రమే ఉంది… ఇలా అర్దాంతరంగా తెంచుకొంటే.. పైనున్న వాళ్ళ ఆత్మలు విచారం పొందుతాయి.. అతని పొలంలోకి వెళ్లి తుంబుర తో జానపదుల వాన పాటని అందుకోగానే.. ఊరి అమ్మవారు శాపగ్రస్తగా ఉన్న ఊరి బాగు కోసం .. ఎంత కనబడని యుద్ధం .. సృష్టి నిర్మాణితో చేసిందో చెప్పే పాట అది.
అతను ఎన్ని బోర్లయితే (మూడు బోర్లు.. ఒక దానిని నుంచి రాలేదని మరొకటి ) ఇప్పుడు అన్నింటినుంచి ఒకేసారి నీళ్లు .. నీళ్ళే నీళ్లు.. భూమి తడిచి పైకి లేచి ఆకాశాన్ని ముద్దు పెట్టుకొంటుందా ? అన్నంత ధార.. రైతు అతనిని వదలలేదు.. దైవ దర్శనంలా భావించాడు.. తన దగ్గర ఏమీ దాచుకోలేదు… ఊరంతా .. గడప గడపకి చెప్పాడు…ఆ పొలం లోనే ఓ గుడిసె అందంగా వేసి ఊరంతా చెబుతూనే ఉన్నాడు . బైరాగి అనుగ్రహించడమూ మొదలు పెట్టాడు.
అతను ఎవరి దగ్గర ఏదీ డబ్బు రూపంలో తీసుకొనే వాడు కాదు.. కేవలం ఆరోజుకి సరిపడే రెండు .. మూడు పళ్ళని తప్ప.. అతని మాటలు అంతగా లౌకికంతో ఉండేవి కావు.. వాళ్ళు అర్ధం చేసుకోవడం కష్టమైన.. అతనొక రైతు బంధువు అని తెలుసుకొన్నారు. అనేక సమస్యలు… డబ్బు తమకంతో దురాశ తో కూడిన ఆశలు కూడా సమస్య అనుకొని అతనిపై ఒత్తిడి తీసుకు రావడానికి ప్రయత్నించేవారు. కానీ ఏది న్యాయమో .. అవసరమో .. అంత మాత్రమే జరిగేది..
ఇది అర్ధం చేసుకున్న కొద్ది రోజుల్లోనే ఉన్నవాళ్లు రావడం తగ్గించి .. లేనివాళ్లు నమ్మడం మొదలు పెట్టారు.. అది ఏ మాత్రమూ సంకోచం లేని సంపూర్ణ నమ్మకం………….
………………………………..
అతనేదో తనకి తోచింది చెప్పడమూ మొదలుపెట్టాడు.. నమ్మకం అదొక జ్ఞాన పిపాసగా.. సృష్టి సమాలయంలో తొణికిసలాడే ఆనందాన్ని ఎలా పట్టుకోవాలో.. పరుగుని నిశ్చల స్థితి తో అప్పుడపుడు బతుకుని ఎలా గమనించాలో … సత్య సాధనలో ఉండే అపూర్వ స్థాయి మూర్ఛనలు.. మార్పు పట్ల కృతజ్ఞతో ఉండటం.. ఒక్కోసారి కనిపించేవాడు కాదు.. నది మధ్యలో ఉన్న ఎత్తైన కొండల్లో ఓ రోజు కనిపించాడని.. అక్కడ తిరిగేవి .. రెండు పడవలే .. ఆ రెంటి లోనూ ఆయన వెళ్లకుండా ఎలా కనిపించాడో… మళ్ళీ పది నిమిషాల్లోనే ఆ గుడిసె దగ్గర.. మానవ మాత్రుడికి పడవలో వచ్చి.. రోడ్డుపైన బండిని ఎక్కితే .. కనీసం మూడు గంటలు పడుతుంది. అసాధ్య సాధనలని .. ఎవరూ అంత తొందరగా ఒప్పుకోరు.. కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తున్న.. ఇంకేదో మైకం కమ్మి అలా అనుకున్నానని తృప్తి పడతారు. ఓ వేళ తెలుసుకొన్న అప్పటికి అది ఏ అందని ఎత్తుకు చేరుకొంటుంది.
ఓ పాడుబడ్డ గుడి దగ్గర .. లోపల దీపాలు వెలుగుతున్నాయి.. ఇంకెవరూ అక్కడ లేరు.. ఓ పూజారిని పిల్చి .. రోజూ పూజ చేసి దీపం వెలిగించామన్నాడట.. తను పుట్టిన బుద్ధి ఎరిగిన తర్వాత ఎప్పుడూ విననంత అద్భుతమైన పాట .. తుంబురా పై వాయిస్తున్నట్లుగా .. గర్భ గుడిలోంచి వినిపించoదట … ఆ పూజారికి … చాలా స్పష్టంగా .. శృతి శుద్ధంగా ….
అతను గర్భ గుడిలోకి వెళ్లి చూస్తే .. అత్యంత శుభ్రాంగా .. మూర్తులని పట్టు వస్త్రాలు .. పువ్వులతో అలంకరించి.. పరిమళం నిండి ఉందట.. అక్కడి దీపాల్లోకి చూసేసరికి.. అతనికి అనుమానం వచ్చి.. ఆ దీపం లోకి వేలు పెట్టి పరీక్షిస్తే … అది నీరని నూనె కాదని తెల్సింది. .. నీటితోనే కొంచెం కూడా తొణకని మంటతో ఆ దీపాలు వెలుగుతున్నాయని….
సృష్టి వైచిత్రిలో చికిత్సకి దొరకని ఆశ్చర్యం.
…………………………………….
విశ్వపు జాగృత సత్యం మన చుట్టూ ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది.. మనమే కన్ను మూసుకుని తిరుగుతూ ఉంటాం. స్మశానం అనంత సత్యం లోని మహా మూలుగు.. తడిమి నిద్ర మధ్యలో చూసుకొన్న మంట.. విశ్వ సంగీతానికి మనం కట్టిన రెండో అనుకృతి.. ఏదీ మహా సంబంధిగా ఉండి మనలని ఒక్క మాట కూడా చెప్పకుండా తప్పుకొని వెళ్ళిపోతుంది.. మనకేం తెలియదు.. జరిగాక ఏదో అనుకొని సరిపెట్టుకొంటామంతే….
ఓ రోజు అర్ధ రాత్రి కాటికాపరి లేపి .. బైరాగి ఒక పేరు చెప్పి ఆమె సమాధి ఎక్కడా? అని అడిగాడట .. అతను చెప్పాక .. అతనిని కూడా రావొద్దని.. తను మాత్రమే అక్కడ ఉండి.. తుంబుర వాయిస్తూ పాట చిత్ర మాలలా కట్టిన దేవుని పాదాల దర్శన.. ఒత్తిగిలిన బూడిద రాశుల్లో పది తిరుగుతూ గతి తప్పిన లయకారుడు మహా దుఃఖం.. విశ్వ నిర్ణయం జరిగాక ఒప్పుకునే తీరే రుణ సంబంధ జాలంలో పడి .. ఆయుస్సు సాధనకైనా తీర్పులో ఉడికే ఉనికి చప్పుడు.
మళ్ళీ తిరిగి వెళ్తున్నప్పుడు.. కాటికాపరితో.. ఆమె ఆత్మకి మోక్షం లభించాలంటే… నిద్ర కావాలి.. ఆమె తన రాత్రులన్నీ .. రోగిష్టి కొడుకుకి సేవ చేయడానికే ఖర్చు పెట్టిందని .. ఆమె నిద్ర తను ఉన్నప్పుడే పూర్తి కాకుండా చనిపోతే.. ఆత్మకి మోక్షం లభించదని.. ఆమె నిద్రని పూర్ణం చెయ్యడానికి నేనూ ఇలా నెల రోజుల పాటు వస్తాను.. నా పాట తో ఆమె పోగొట్టుకున్న నిద్రానంతా ఇచ్చి లెక్క సరి చేస్తాను .. అన్నాడట..
నువ్వు హాయిగా నిద్రపో అని చెప్పాడట… ఇక రోజూ ఇదేమి పట్టించుకోకని చెప్పి వెళ్లి పోయాడట.
…………………………….
ఒకనాడు ఒక భర్త తన కొత్త భార్య తో వచ్చాడు.. ఆమె కళ్ళు లోతుకు పోయి.. నల్లని వలయాలు.. పాలిపోయి.. ప్రాణాలన్నీ ఏ క్షణమైనా … ఆ కళ్ళలోంచి పోయేట్లుగా ఉంది. మృత్యువు బార్లా తెరిచిన విశ్వ మాయ కనిపిస్తూ .. సాధారణ మంత్రం దూళి కనిపించే చీకటి వరదలు.. శ్వాసని ముంచే కుదుపు దగ్గరగా కనిపిస్తూ.. ఒక భయం చుట్టిన చిత్ర ధార కాంతిలో పండి.. నిశ్వాస జాలం లో ముగ్గిన వరుస చప్పుడు కారిపోయాక ,, ఉండలేని కళ్ళే ఖాళీ మురిపాలతో ఎంత సమయం బిగించినా .. ఇంకేదో వెనక్కి లాగుతూ ..
అతను గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఒక ఓడిపోయిన అలసటతో కూడిన ఒప్పందం లో తనకి అనుకూలం కానీ షరతుని మరో గతి లేక ఒప్పుకున్నవాడిలా ఏడుస్తున్నాడు.
తన భార్య నిద్రపోయి అప్పటికి పది రోజులయ్యిందని.. విశ్వ నిర్ణయ సూచనా ఋతువులని లోపలనే పండించి.. కలలతో పోతపోసి.. జన్మ సాయంత్రంలోని ప్రమాణ సూత్రాలని కలిపి పట్టుకొన్న గోళపు పరాయి సాధ్యతని గడ్డకట్టిన అడుగులుగా తెల్సుకొని.. కొన్ని రస గదుల దేహ శ్రుతీయ మార్దవంలోని.. మృత్యు కౌగిలి .. తిరిగి పుడుతూ నిద్ర.
చాలా మంది డాక్టర్స్ … చాలా మందులు.. పూర్వీకుల నుంచి వచ్చింది.. తను సంపాదించి .. కడుపు కట్టుకొని దాచింది .. అన్నీ కరిగించేసినా.. డబ్బు.. కానీ రోగమల్లాగే ఉందని.. ఆమె మాట్లాడటమూ మానేసిందని.. మాట ఒక లోపలి సంగతి దగ్గరే ఆగిపోయింది..అదొక మంచి ధారలా పెనవేసుకున్న వంతెన .. అది ఉందీ అంటే ఉండటంగానే ఉంది.. లేదు అంటే మరి కనిపించదు. సమయంకృత సర్వ లయంలో కథన సంధి తెగిపోయిన ఘర్షణ ..
ఏ క్షణం తన నుంచి వెళ్లిపోతుందోనని భయంగా ఉందని…
బైరాగి ఏ మాత్రమూ విసుగు లేకుండా .. అసాధారణ ధ్యాన వివేచనతో విని .. లోపల ఊడుతున్న పెద్ద చప్పుడు కొండలని.. దొల్లించి దారి చేసుకొంటూ.. ఆమె చీకటి లోకి చూసి.. చిన్న నవ్వు నవ్వి.. ఒక ఓదార్పు ఖర స్పర్శని ఆమె తలపై ఉంచి.. ఓ చిన్న దారం ఆమె చేతికి కట్టి …
ఎదురుగా ఉన్నా మర్రి చెట్టు చూపించి .. అక్కడే చిన్న గుడిసె వేసుకొని .. తనతో పాటు కొద్ది రోజులు ఉండాలని.. చెప్పాడు.
…………………………………………
అందరూ నిద్ర పోయాక .. సమయ మహా ద్రవం .. మంచుతో కలిసి గడ్డ కట్టి.. విశ్రాంతి పండే దీప నడకలని వెనక్కి చేర్చి.. కొంచెం విసుగు.. కోపపు మాటలు.. అలకలు.. మరునాటి భయాలు.. కష్టాలు.. పరీక్షలు..అన్నీ ఆగిపోయి… ఓ మహా బిళంలో మాయం చేసే నిద్ర. అప్పుడే .. అటువంటి సమయంలోనే …ఆ పొలం లో తిరుగుతూ అర్ధ రాత్రి అతను తుంబుర వాయిస్తూ పాడుతూ ఉంటాడు.. ఎవరో వినాలన్న నిమిత్తం అతనికి ఎప్పుడూ లేదు. పాట నిశ్శబ్ద సృష్టి నిద్రని కలలోకి జోకొడుతూ .. చిత్ర వశీకరణ ఒంచిన మహా సవ్యత దిగబడ్డ మృత్యు వ్యూహం లో ఊపిరాడక గిల గిలలాడే క్షణం …నిండిన ఒక కథన ఒప్పంద పుప్పుడి బీకరు .. పాట….
ఆమె విని.. ఒక్కసారిగా ఆనందంతో లేచి … అతని వెంట .. వింటూ తిరుగుతుంది.. తనలోంచి చిన్న హెచ్చరిక.. ఒక సంజ్ఞ అయినా చెయ్యకుండా వెళ్లిపోయిన నిద్ర అతని పాటల జోలెలో ఉందని నమ్మి అనుసరిస్తుందా ? అడిగినా చెప్పడానికి ఆమె నోరు తెరవడం లేదు.
సన్యాసి గమనించని వాడిలా తనలో తాను పాడుకొంటున్నాడు. అతను పాట ఆపి.. కేవలం తుంబుర వాయిస్తూ ఆమెని చూసాడు.. ఆమె పాట అందుకొంది… అది ప్రేమ గురించిన జ్ఞాపకపు పాట .. పరాశ్రిత విడి కళశాలలో పండిన శ్వాస మునకలు ఆ కిందికి చేరుతూ .. గట్టు చెదిరిన విశ్వాస పోలికలు అతనిని కళ్లలోంచి లాగుతూ ఇదే అని తెలియని కథా నిడివి..
ఆమె భర్త దగ్గరకి రాబోతే .. సైగ తోనే బైరాగి అతనిని ఆపి.. ఆమె ని ఓ మట్టి దిబ్బపై కూర్చోబెట్టి పాటని వింటూనే ఉన్నాడు.. అతని కంటి నుంచి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి.. ఎవరు తల్లీ నువ్వు? అన్నాడు. అనునయ సన్నాహం మోగిన వివిధ దశలపై ఒత్తిని జోడించి తాగే నిద్ర సంధిని బిగువుగా .. తోడుపెట్టిన నిద్ర గోడలు బీటలు తీసాక .. ఈ పాటని.. నీ ప్రేమ ఉనికిని.. సమయ ఖాళీలలోని చిత్ర ఆంచిత తిరుగుబాటుతో కలవరపడి దుఃఖ ముద్దగా ఉన్న నువ్వెవరు?
ఆమె సమాధానం చెప్పలేదు.
ఆమె నిద్ర రహిత నిశ్శబ్ద చేతనల ప్రవాహంలా కనిపిస్తూ.. శంఖ పూర్ణిమాలోని తెల్ల సొన ల వానలా .. ఒక అనాది శిలాజ మూర్తి శకలంలా
……………………………
రాత్రిలో .. ఎన్నో జన్మ మోతలు.. తిరిగి చేరుకొనే మలుపులో .. అలజడినిసాగదీసే కెరటాల ముంపుకి జారగిలబడి… సగం వర్ష పోలికలకి దొరకని నిద్ర ఔషదాలు మండుతూ .. దీర్ఘ ముక్కలని ముడిపెట్టే దీవికి రెండో రేవుని కాల్చిన చితి పత్రంలో ఇంకా లేని దానికోసమే..
ఇంకో రోజు .. ఆమె నది కి అర్ధ రాత్రి వెళ్లడం గమనించి సన్యాసి అనుసరించాడు.. ఆమె ఎప్పుడు పడవని ఎక్కిందో తెలియదు.. అతనిని చూసి ఎక్కమని సైగ చేసింది.. అందులో సృష్టి మొత్తం ఏకమై పిలిచేటంత నమ్మకం.. మృత్యు అనుయాయిగా వద్దునుకొన్న చిత్ర బజారులో కథకై తిరుగుతూ .. కొలిచిన ఖాళీ ఇల్లు .. తడి మెట్ల పై జారే పాట.
అది ఎవరి పడవో తెలియదు .. నడిపే వారు లేకుండానే వెళ్తూ ఉంది….ఆమె పాడుతూ ఉంది.. చీర జాతరలు బిగించిన తెరచాపల ఘోషని గాలి అలలు దారి మళ్ళించాక ఇంకేం కనబడని నైవేద్య తీర్ధం ఊరికినే ముడిపడి ఊపిరిని కాపాడుకుని సగం మత్తుని కౌగలించి.. ఆమె పాడుతూ ఉంది…
తుంబురని ఆయన మీటుతూ ఉన్నాడు.. ఆమె ఆ తుంబురని అడిగింది..
అతనిచ్చాడు. జ్ఞాన విలాపం పై తడిమి పట్టుకొన్న కొండల మధ్య నిద్ర తప్పిన శిక్షకుడి మైదానంలో పడి ఓలలాడే .. సాధ్య విరోధి చిత్ర మోడులపై చిగుళ్ళని చూసి .. మిటకరించిన కళ్ళతో ఆవలించాక ఎవరో విసిగి దూరం జరిగారు.
అది కాసేపు .మురళిగా.. మరి కాసేపు పియానో లా … మరి కొంత సేపు తబలాలా సౌండ్స్.. అదొక సంపూర్ణ సంగీతం .. మృత్యువుని కదిలించి పెట్టే సదా అవ్యయంలో మునిగీ తేలుతూ.. సవివర దారి రసాయనాలు కళ్ళలోకి నిండి.. ఇనుమడించే సృష్టి నుదిటిని కాల్చే స్మశానంలో తిరిగి వేలాడే కొసలతో .. పండిన విల విలలా కదిలే ఆయుస్సుని దట్టించి కనపడ్డాక ఘటన .. సంగీతం.
ఆ తరవాత ఆమె చాలా సేపు గుక్కపెట్టి ఏడ్చింది.. దానిలో నిద్రని మించిన ముద్రలు.. నడకలు.. ప్రవేశ సగాలు .. ఉలికిత నీటి పంటలు.. ఏ మాత్రమూ వడ్డించని మృత్యు దూర పరిమళమూ…
……………………………………
.మూడో రోజు రాత్రి.. అదే సమాధి ముందు.. మళ్ళీ పాట .. సన్యాసి నోట మాట లేకుండా ఉండిపోయాడు. ఎవరు తల్లీ నువ్వు? అన్నాడు. విభ్రమల దట్టతని నులుముతూ .. రంగు తిరగని మోతాదుల మూర్తిని కాచి రక్షించి … నేవైద్య మహా వ్యూహం లో పడి పడి రాలే నున్నని శ్వాసాలని దండ కడుతూ ఇగిరిపోతూన్న విశ్వ నిర్జన .. ఆగి వెనక్కి చూసి సంబరపడుతూ.. ఏదీ లేదో అదే కావాలనే సమపాళ్ళ ముఖాముఖీ ఆర్ధనలూ….
ఆమె నిస్సహాయంగా చూసి .. అదే తెలియడం లేదు… చాలా నెలల తర్వాత ఆమె గొంతు మళ్ళీ పుట్టింది. హిమ గంగ తేనె సొనల పుట్టింట్లో తల స్నానం చేసి .. ఎంగిలి పడ్డ ఊపిరి మధ్యలోని.. శృతి దొరికించుకొన్న తుంబురలా… ఆమె మాట.
అపస్మారకంలో ఉన్న నన్ను .. మా భావ కాపాడుకోవడానికి దారి లేక పెళ్లి చేసుకొన్నాడు.. ఏనాడూ భర్తలా నా మీద.. నా శరీరం మీద… ఏ అజమాయిషీ చూపించలేదు.. ఒక తండ్రిలా కాపాడుతున్నాడు… అంది.
బైరాగి ఆమెని అలా చల్లగా చూసి..సృష్టి ప్రతీ కదిలికకి … నిద్ర ఉలిక్కిపాటుకి .. కార్య కారణాలు స్పష్టంగా ఉంటాయి .. మనమే వాటిని పట్టుకోవడం లో కంగారు పడతాం…అన్నాడు
…………………………………….
సుమారు మూడు సంవత్త్సరాల క్రితం .. గతం మనం అనేక సార్లు నడిచి చేరుకోవాల్సిన జ్ఞాన స్థలం.. పెద్ద పెద్ద అడుగులతో నిండిన నిద్ర వర్తులాలు చుట్టుకుని .. నిండుగా పండిన శుద్ధ భూమి గొంతులోకి వినిపించే .. సమయ గారడీ..
ఆమె డిగ్రీ ఫైనల్ ఇర్లో ఉన్నప్పుడు తండ్రి హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు.. అది ఏమాత్రమూ ఊహించిందే కాదు.. అతనెప్పుడూ ఏం జరుగుతుంది తన లోపల అనేది పంచుకోక పోవడం.. ఆ చీకటి ఆందోళనలై తానే మోసి .. పైకి నటిస్తూ….
ఆయన చావు తర్వాత అర్ధమైంది .. అతని ఎన్ని అప్పులని మేనేజ్ చేస్తూ బిజినెస్ చేసి ఫామిలీని నెట్టుకొచ్చింది.. చాలామంది మధ్య తరగతి businessman లానే నున్నగా పైన రోజూ రుద్దుతూ.. ఇస్త్రీ నలగని బట్టలు.. చల్లగా మంత్రించిన AC గదుల్లో ఊపుకున్న తూఫాన్లని దాచి పెట్టి తలుపు తాత్కాలికంగా బిగించిన .. ఎప్పుడో పగలకా మానదు.
ఆమె అప్పుడప్పుడు తనకి నచ్చినప్పుడు పాడుతూ ఉండేది.. ఆమె తండ్రికి ఆ పాట అంటేనే ఇష్టం.. శాపిత గంభీర శృతి కాదని వేలాడుతున్న నివేశ స్తనాధార ముకిలించిన మోహ మూర్తిని కౌగలించుకొని .. ఇంకేం దొరకని చకిత మోడులు ని పాతుతూ.. పాట
చనిపోయే ముందు రోజు రాత్రి అతను ఆమెని ఓ పాట పాడమని అడిగాడు.. ఆమెకి మూడ్ లేదని పాడలేదు.. ఉదయానికి అతను .. వినిపించని లోకాలకి వెళ్ళిపోయాడు. సృష్టి తీర్మానాలు అర్ధం కావు.. విసిగిన ముఖాలనీ తిరగతోడిన అటు జరగడానికి లేని శబ్ద శిఖరం ఊగించిన తీరుతో ఒత్తుకొన్న సాఫల్య మూర్తి .. త్రిరేపక ఉన్మయం లో పడి కొట్టుకొంటూ.. మరి రాదు.
ఆ తర్వాత ఆమె ప్రతి రాత్రి అదే టైంకి పాడుతూనే ఉంది.
అందరూ ఒత్తిడి తేవడం మొదలుపెట్టారు.. ఒక్కొక్కటీ అమ్మి తీరుస్తూ అన్ని ఖాళీ అయిపోయాక .. ఇంటి బయట కాలు పెట్టడం రాని అమ్మ ఓ రోజు స్లీపింగ్ పిల్స్ మింగి … శాశ్వతంగా నిద్రపోయింది. ముందు క్యాలెండర్లు.. వెనక్కి రాణి గతి చక్ర నిదర్శనాలు.. కట్టి బిగించుకొన్న శిలా విలాపం స్వేద స్తంభనలపై బొట్టుని దిద్ది .. రాత్రి ఉనికిని మోసే దీప పోతలు ఉరి బిగించి.. రోజూ నిద్ర మధ్యలో కాష్టం కాలుతున్నప్పుడు.. ఆమె నిద్రపోయింది.
చిన్న ఉద్యోగం దొరికింది.. నౌకర్లు లేరు.. కాలి నడకలు … మత్తు గోళాలు.. నొప్పి పట్టుకొన్న చూపు నిందలు.. వంటింట్లో చాలా సీసాలు ఖాళీగానే.. ఇస్త్రీలు.. నైల్ పోలిష్లు.. ఎయె బ్రౌలు .. హెయిర్ dye లు అంటూ ఏమీ లేవు. ఏ బంధువుల పలరింపులూ లేవు.. వాళ్ళ ఇంట్లో కార్యాలకి పిలుపులూ లేవు.
పాట దూరమయ్యింది.. అతి కష్టం మీద కడుపు కేవలం నిండుతూ ఉంది. ఒంటరి పోరుకి విసిగిన నిద్ర గరుకుగా మారుతుంది.
……………………………
ఓ రోజు పనిలో పడి కాస్త లేటయ్యేసరికి ఆఫీస్ లో ఎవరూ లేరు..
కానీ pantry లోంచి అద్భుతమైన గొంతుతో పాట … ఆమె వెదుక్కొంటూ వెళ్ళింది.
లౌకిక దిగారింపులన్నీ చిదిమేస్తూ.. కలహిత మాంస భాగాలన్నీ పులకిస్తూ.. కంటిలోకి జ్ఞాన సమల్లాత ఒరిగి … ఒక్క చిన్న శృతి దోషం లేని పాట..
ఆఫీస్ బాయ్ చంద్ర … పౌర్ణమిని కొవ్వెత్తిలా చేసి వెలిగిస్తే ఎలా ఉంటుందో అలా అతని ముఖం పై వెలుగు.. పూర్తి ధ్యాన ముద్రలో మునిగి పాడుతున్నాడు. ఆమె అలా వింటూ శిలలా ఉండిపోయింది.. అర్ధరాత్రయింది.. ఒక్కసారిగా ఉలిక్కిపడి టైం చూసింది..
అప్పుడే అతను చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు.. చెమట .. సిగ్గులతో తడిచి పోయాడు.. ఏదో లైట్ చెయ్యడానికి నవ్వాలనుకొన్నాడు.. కానీ ఏదీ చెయ్యకుండా శిలలా ఉండిపోయాడు.
ఆమె అతని కాళ్ళ పై సాష్టాంగ పడింది.. అతనలా మాట లేకుండా ఉండిపోయాడు.
అదొక సమయ బంధన మాయ .. చిత్ర విద్యుత్తుని మోసం చేసీ చెయ్యక ముందే పరవశపు గుర్తులని భద్రంగా ఆత్మ దారుల్లో నాటుతూ…. వికర్షించే సాధారణ ముడుపులు తీరక ముందే…
ఫ్రెండ్ missed కాల్స్ ఓ ఇరవై.. చంద్ర కంగారు పడ్డాడు.. అంతలోనే తేరుకొని … మీ ఫ్రెండ్ వచ్చేలోపు ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోతాలెండి .. మీరేం కంగారు పడకండి.. అన్నాడు
స్నేహితురాలు కారు తో వచ్చింది..
చంద్ర అప్పటికే అన్నట్టుగానే …చాటుగా తప్పించుకుని వెళ్ళిపోయాడు..
ఎందుకు నిద్ర పట్టేసిందో .. ఎవరూ తనని చూడక పోవడం వలన… అని … అబద్దమాడి.. వచ్చినందుకు థాంక్స్ చెబుతూ కారులో కూర్చొంది . ఆ ఫ్రెండ్ మాత్రం కొంచెం అనుమానంగా చూస్తూ ఉంది.
ఆఫీస్ డే అండ్ నైట్ సెక్యూరిటీ తో ఉండే బిల్డింగ్ లాక్ కాదు కాబట్టి అతను ఏదో రకంగా తప్పించోకోగలిగాడు. ఆమె వెళ్లి పోయింది..
కానీ ఆ పాట ఆమె ని వెంటాడుతూనే ఉంది.
మరుపు.. మహా నిద్ర సందర్భం లోంచి పక్కకి లాగుతూ .. జ్ఞాన కలల వదులుతో పండిన విశ్వ తపనతో పడి లేవదీసుకొన్న సాక్షి .. మరింత గండాలని దాటుతూ క్షమ మోసిన ఆత్మ ధూళిని దులిపి చేర్చి పెట్టుకొన్న సగపు రాత్రుల గొంతు వేట.
…………………………………
అతను అందరూ ఆఫీసులో ఉన్నప్పుడు అంత గొప్ప కళాకారుడు కేవలం ఓ ఆఫీస్ బాయ్ అంతే… భూమి అట్టడుగు లోతుల్లో పండిన జ్ఞాన మోయింపు తోసుకొచ్చిన శిధిల గుహలో తాండవించే అపరిమిత ఎత్తుల్లో కదిలే … జాగ్రత్త చేసిన దిగులుతో మహిత ఆత్మల బరువు గోడల మధ్యలోనే తగలబడి … సాధన.. కళ్ళకి కనబడని అజ్ఞాత కళాకారులు ఎందరో..
………………………………….
ఆమె మళ్ళీ ఆ పాట కావాలంది.. అతను ఎందుకులెండి మేడం.. ఇవేవో పిచ్చి పాటలు.. నేనే రాసుకొని.. ట్యూన్ చేసుకొని నాకోసం పాడుకొనేవి.. అన్నాడు. కాని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా ఆ కళ్ళలో నిజాయితీ చూసి .. సరేనని ఎక్కడకి రావాలో చెప్పాడు.
చంద్ర ఓ చోటికి రమ్మని.. అవన్నీ కొండలు .. నిర్మానుష్యం.. సృష్టి నిశ్శబ్దంలో స్నానం చేసి .. ఒల్లారబెట్టుకొంటున్న కొండలు.. తలలు ఊపుతున్న చెట్లు..
అతను పాట అందుకొన్నాడు.. ఆమె వింటూ ఉంది…. వింటూనే ఉంది.. ఓ నది గట్టుపై కూర్చొని పాడుతున్నాడు… విశ్వం మొత్తాన్ని ఒడిసిపట్టి పిండుతున్న తేనె ధారలా ఆమె లోకి ఒలుకుతూ .. పాట. అది ముందు లేదు.. ఇప్పుడే పుట్టినట్లుగా…..
ఆఫీసులో గుసగుసలు మొదళ్లయ్యాయి .. అవి చంద్ర దగ్గరకి వెళ్ళాక .. అతను వణికి పోయాడు.. కంగారుతో కదిలి పోయాడు.. ఒకరిద్దరి దగ్గర ఏడ్చాడు.. అయినా అవి ఆగేవి కాదని తెలిసాక …ఇంట్లో మాట్లాడాడు…. ఆమె లెక్క చెయ్యలేదు.. నవ్వుకొని ఊరుకొంది.
కొద్ది రోజుల్లోనే లీవ్ పెట్టి వెళ్లి .. పెళ్లి చేసుకొని వచ్చాడు.. అదీ అందరికీ తెలిసిట్లు .. పెళ్లి కార్డు వాహట్సాప్ గ్రోపుల్లో షేర్ చేసాడు.
వెంటనే పాప.. భార్య కోరికలు. విలాసాలు.. అప్పులపాలై పోయాడు… వచ్చే జీతానికి … ఆమె కోరికలకు మధ్య… అతను వచ్చే లోపు చేసే పిచ్చి పిచ్చి షాప్పింగ్స్ .. Online ఆర్డర్స్ … వంట చెయ్యకుండా ప్యాకేజి ఫుడ్స్.. ఎన్ని చేసిన ప్రతి రోజు అతనితో గొడవ పడుతూనే ఉండేది..
ఆమె ఓ రోజు వదిలేసి .. ఎదురు బిల్డింగ్ వాచ్మాన్ తో వెళ్లిపోయింది … అదీ పాపని తీసుకొని… వెళ్లేముందు.. ఇరుగు పొరుగుకి అతనికి అక్రమ సంభందాలు ఉన్నాయని ప్రచారం చేసింది. ఓనర్ అతనిని వెంటనే ఇల్లు ఖాళీ చేసెయ్యమన్నాడు.
……………………………..
అతను ఆ తర్వాత చాలా రోజులు పాడకుండా ఉండిపోయాడు. శబ్ద ముద్రలు ఆరిపోయిన ఖాళీ శరీరం.. అతని కలలని … కళలని … అడుగు నుంచి లాగి మరీ వెళ్లిపోయింది
ఆమె ఎంతో అడిగింది.. అడగ్గా .. అడగ్గా … ఓ రోజు… పాట నా పాప లో ఉండిపోయింది అన్నాడు. బరువెక్కిన గొంతు.. కల అడ్డుపడ్డ మాట.. తీవ్ర నిరాశ మండిన నిద్ర.. కరకు స్త్రీ కాళ్లతో నలిపి చంపేసిన కళ… తిరిగి కోలుకోవడానికి ఏం లేదు…
ఉద్యోగం మానేసాడు.. ఫైనల్ అమౌంట్ కోసం ఓ రోజు వచ్చినప్పుడు మాట్లాడబోతే … నిద్రలు లేక పీక్కుపోయిన ముఖం … సన్నగా అయిపోయాడు.. పాప ఆమె దగ్గర చనిపోయిందని.. ఆమెని కూడా ప్రియుడు వదిలేసాక … రైల్వే ట్రాక్ పైన పడుకుందని.. కేవలం రెండు సంవత్సరాల క్యాలెండరు చిరిగే సరికే .. అతకడానికి వీలులేనన్ని ముక్కలుగా చిదిగి .. ఆశ్రిత వాకిలో దెయ్యం కూలబడింది.
పాప తన దగ్గర ఉన్నప్పుడు రోజుల్లో… సరిగా నిద్ర పోవడం లేదని.. డాక్టర్ల చుట్టూ తిరిగాక…
ఓ గుడికి వెళ్లి మొక్కుకొంటే… అక్కడొక సన్యాసి .. అతనిలోకి గంభీరంగా చూసి…
తండ్రి ఎంతోకొంత నిద్రని బిడ్డల కోసం ఇవ్వాలని చెప్పాడట… ముందు నమ్మక పోయిన .. అతనిచ్చిన్న విబూది బొట్టుపెట్టుకొన్నాక .. పాప నిద్ర పోవడం .. అతనికి మధ్య రాత్రిలో మెలుకవ రావడం జరిగేది… ఆ మాట ఎవరికీ చెప్పినా నమ్మరని తెల్సిన.. అదీ తనకి సత్యంగా కనిపించే సాక్ష్యాలు ఇస్తుంది.. నమ్మకుండా ఎలా ? అనుకొన్నాడు.
అన్ని కుదురుకొంటున్నప్పుడు .. ఉన్నట్లుండి ..ఊహకి కనీసం అందకుండా… భార్య లేచిపోయింది.
………………..
కూతురి ఖనన సమాధిని వెదుకుకొంటూ వెళ్లి.. రాత్రంతా అక్కడే పాడుతూ.. మాయ సేద్యం చేస్తున్న ఆత్మల విభ్రమ .. కదలని ఆశీస్సు చుట్టున్న దుఃఖం పై నుంచి పొగులుతూ .. స్పర్ధ విరామం లేని అనుకూలతని ఒడిసిపట్టి.. నాభిలోకి పంచిన విశ్వ మూర్చన ఎత్తుల్లో అతని పాట కురుస్తూ… విషిత వైరాగ్యాల నేల మీద మోగే గంటని తొడుక్కుంటూ ..పరిస్థితి నిద్రలేని కలిపి దులిపిన వానల కింద.. కాచి రక్షించే శ్వాస నీరాజన విశుద్ధి దర్శన.
నిద్రలేక అల్లాడుతున్న పాప ఆత్మని చూసి అదీ నీరు .. మంచు.. నల్ల పొగ.. దూరంగా గుమ్మాలు లేని మొండి ఇంటిలో .. ఒంటరి పాప .. నిద్ర కావాలని… శపిత విముఖంలోని చిత్ర దర్శినిగా…. తన జన్మ చివరివరకు ఉన్న నిద్రకి ఆమెకి ఇచ్చేసి వచ్చాడు.. ఆమె ఆత్మా తిరిగి కనిపించలేదు. అతనికే కొద్ది రోజులే.. అన్నాడు.
ఆమె నా ఒక్క రాత్రి నిద్రని తీసుకొని.. ఒక్క పాట వినిపించగలవా? అంది. అతనిని మూడు రోజులు వదలకుండా పట్టుకునే ఉన్నప్పుడు మూడో రోజు ఆమె నిద్రని తీసుకొని గాడంగా నిద్రపోయాడు. మర్నాడు ఆమె కాసేపు నిద్రపోయాక లేపి.. పాటని అందుకొన్నాడు.. తిరిగి అతనుపునర్జన్మ పొందిన కళాకారుడిని తెలుస్తూనే ఉంది.. పాట విశ్వ వీధిలో అసలైన విశుద్ధ మృత్యువుని అందుకునే మహా సంజీవ మంత్రంలా లోపలి చేరి కుంపటి వెలిగిస్తూ ఉంది..
……………………………………..
ఆమె ఏదో నిర్ణయించుకొంది.. ఒక రోజు ఆలోచించి.. అతని దగ్గరికి వెళ్లి.. అతనికి రుచిగా వండి.. స్నానం చేసి.. తయారై .. అతనిలోకి .. పాప ఆత్మ లోంచి కలిపినా ఓ వంతెన వలన .. అతనితో శారీరకంగా కలిసింది.. రసాయన పాటల వరమై శరీరమంతా అల్లుకున్న సద నిద్రలేని కమిలిస్తూ.. నిశిత వశీక సత్తువని తిప్పి పెట్టిన మూర్తులతో.. తన స్తన్య మందనని వెలిగించి నేల రాలి.. బొట్టై అతని చాతీకి అతుక్కొంటూ.. విశ్వ సాకారం మాటై మట్టిని కలిపే జ్ఞాన విపూర్ణత కదిలిన చీకటి ఆరబోసిన … తలుపుల కిందుగా … విసిగిన దేహ నిద్ర కొత్త కళలని వార్చి.. పొంగుగా లేచిన నిద్ర వారధిని తెగ్గొట్టి .. ఇంకాస్త మెల్లగా పొదిగిన కల రాశులలోకి విడివడి పెద్దదైన దుఃఖ నిరావతని జల్లాడ పట్టే పాట… కమిలిన వాళ్ళిద్దరి దేహాలలోంచి…
అతనికి పంటితో ఓ తియ్యటి గాటు పెట్టి.. తన బొటనవేలికి సూదితో గుచ్చి .. ఆ రక్తమందులో కలిపి తను లోపల కోరుకొంది. తన మొత్తం జన్మ నిద్రనంత అతనికి దారబోసి తను నిద్రని ఖాళి చేసుకొంది. అతనికి ఆపడం చేతకాదు.. అది రక్త ముద్ర చేసిన నిద్ర సంతకం.. అప్పటికే వద్దు వద్దు అంటూ కలరిస్తున్న .. మరో పక్క వరంగా వరించిన నిద్ర అతనిని ఆత్మ లోతుల్లోకి లాక్కెళుతున్న … ఇంకా ఏదో గొణుగుతూనే ఉన్నాడు.
…………………………………..
సన్యాసి చల్లగా నవ్వి .. భర్తని దగ్గరకి పిల్చి పాడమన్నాడు.. తుంబుర తో అతను శృతి కలుపుతున్న .. అదీ తన శక్తిని దాటి వెళ్ళిపోతుందని అర్థమౌతూ ఉంది.
అది మహా అద్భుతం ..ఆమె ఆ త్యాగం ఎంత మాత్రం నిరర్ధకం కాదని అర్ధమైంది. ఆ ఐక్యతను మాటగా చెప్పడానికి ఏం లేదు.. కదులుతున్న విశ్వ మూర్చన భ్రమణ విస్పురంగా దేహంలో నలిగి .. కొత్త దారిని పోసుకున్న మంచు బట్టలని తప్పించుకొంటోంది. ఇక దేనిని దేనితో వేరు చేయాలని కలవర పడ్డాడు…. సతమత మయ్యాడు….
………………………………….
ఈ కథ ఊరంతా తెలిసింది రెండో రోజుకి.. మూడో రోజుకి చాలా మందికి తెలిసింది.. ఏం పరిష్కరాలని…ఇస్తాడో చూడాలని కొంత మంది వచ్చారు.. ఆ రాత్రి నిద్రపోయాడు.. చంద్ర మహా నమ్మకం తో నిద్ర పోయాడు.. పచ్చి తలపోతల నిద్ర దీవెనలని తలచుకొని.. పాట ఆరబెట్టుకొని గడ్డ కట్టిన నదిపై మంచు తాగిన నెమలిలా … కొండలకి పెరుగు చిలికే సవ్వడిని అందించిన గాలిలా ముంచుకొస్తున్న పాటల అడుగున గస గస లాడుతూ … ఓ నమ్మకం చుట్టిన తీర్ధ మేళాలలుగా జారిన నిద్ర. ఆవహించిన గంభీర నదుల పొంగు.. సల సల లాడుతూ….
ఉదయం లేచేసరికి ఆమె గాఢ నిద్రలో ఉంది…. అతను స్నానము చేసి బయటకొచ్చేప్పటికీ ఆమె అలా. నిద్రలోనే ఉంది.. అతని ఆనందానికి అంతు లేదు.. కృతజ్ఞతతో అతను లోపలంతా బరువెక్కి పోయాడు… అతని ఆత్మలో తిరుగుతున్న పాట .. హిమాలయాల శిఖర అంచులని తాకుతున్నట్లుగా ఉంది. వివశ ఛాయల సరోవరంలో కన్నుని పుట్టే పచ్చి వాసన వింటున్నట్లుగా ఉంది.
పరుగున సన్యాసి దగ్గరకి పరుగు పెట్టాడు.. అతను లేడు తుంబుర ఉంది.. అతనది చేతుల్లోకి తీసుకొని పాడటం మొదలు పెట్టాడు.. ఆమె శృతి కలిపింది. అనాహమిత శృత సంశయంలో నమ్మకం ఏం చెబుతుంది.. అతనిOకోదో అనుకోని కదిలించుకొన్న మిశ్రమ ధార కన్నులో పండి .. నిఘామిత సంకేత ముడుపుని మోసే కృతజ్ఞత… విశ్వంలోకి సిందూర గొంతులు సమాధి సవరించి.. పొద్దు చుట్టని నియమిత జ్ఞాన ఘోష పడి లేవబోతూ .. ఎవరిని ఎప్పటికీ తల్చుకోవాలో సవరించైనా తుంబురాలోంచి కదిలే ప్రాణ జల .. వినగలిగితే ఆ సత్యాన్నే చెబుతుంది.
అలా రోజూ అక్కడే .. స్వామిజీ కోసం ఎదురు చూస్తూ … వాళ్లిద్దరూ పాడుతూ …
……………………………………..

