
మృత్యు ఛాయలు … శిలా ధార
విభ్రాంత శిల ఒక ఉనికిని తడిపే నిద్ర శంఖాల రేవు.. తనకై నేను చెప్పుకొన్న ఎదురు చూపుల స్నానాల మధ్యలోనే ప్రశ్నల లోలకం నిండి తిరుగుతూ .. ఆగి ఒద్దికగా ముడుచుకొంటూ … మంచు తుఫాన్ సీసాలోంచి కురిసినప్పుడు ..వరద బీకరులు దుప్పట్లో నసిలినప్పుడు… దోసిలి నిండుగా అలిసిన వాన గాలుల కొండని చిలుకుతూ చీకటి ఏడ్చినప్పుడు…అనగా అనగా కథలు ఊరి చివర చింత చెట్టు కింద మంట వేసుకొని చలి జోడింపుల సవరింత పట్టుని కాదని … కొత్త దిగులుతో నానిన చిత్ర దిగులుని చెక్కమని పదే పదే అడిగినప్పుడు …. ఇచ్చిన ఒడిగా నది బరువెక్కింది.
పొడుగ్గా సవరించిన ఈ ఖాళీ హాలులో ఏ మూలో నువ్వు కూర్చొని వెళ్లే ఉంటావని నేనింకా పాడుతూ ఉన్నాను . ఏదీ ఇక్కడ ముగిసిపోదని దీర్ఘ చెలమలో బిగిసిన నిద్ర కావెడలు … కలలని కుదిపి పునాది లేని కన్నుని తాగి గోడలకి గుచ్చిన అద్దం ముడుపులని దుల్లగొట్టి ఆ మూలకి కన్నుని సర్దిన మాటలతో ఊరేగి …సొమ్మసిల్లుతుంది. ఇది ఒక నిజం చెమరించిన స్తూపంగా ఒత్తిగిలి సంచయ తీరికని దాటి కొత్త చోటుని జోడిస్తూ అడుగుల్లో కలిపిన ముద్దుని అడుగుతుంది.
విళయసెగ దగ్గర చేసిందని … ఇల్లుని వాళ్ళకిచ్చి .. మట్టిని అంపకం చేసిన సమాధి మోడులో కదలాడుతూ పుట్టుక చెరి సగమై కమ్ముకొచ్చే దేహ కంకులని ఒలిచి ఉడకబెడతారు. శిలాజాలని రసాయన నిష్పత్తులతో చేరదీసిన గతిని మార్చి.. దేహమూర్తులుగా చెక్కుతారు. ఒక గుమ్మం భుజాన వేసుకొని శ్వాసని సాగదీసే రాత్రి జాతరలో పెద్ద కొండ ఆనవాళ్ళని కురిపించే చాటుమాటు రాతి ముక్కలని పిండి..బయలుదేరాను. ఇక్కడ మరో వెసులుబాటుని నేను ఎప్పటికీ కోరుకోనని తను నమ్మి…ఆ కొండ ముందు దీవి లాక్కుపోయిందని ఏడుస్తూ.. కదలని కథని తోడుగా ఉండనిమ్మంటారు. ఇది మరో తీరిక లేని మృత్యు స్వస్థతని తలచుకొని.. గుడిని తెరిచి పెద్ద అరుపుతో కూలబడతారు. మధ్యస్థ తీరిక వినిపించుకొని జ్ఞాన తెర వెనక మరో దేహం చెక్కుతూ.. కాస్త సమయమివ్వమని పల్చని నవ్వుని పలికించి పాటకి సన్నని పోలికని నానబెట్టి ఆ ఫోటో వేలాడదీసిన చోటే శిలని చెక్కి … ఇక రాడులే అంటారు.
ఆ గుడి మూల విరాట్టుని తీసుకుపోతూ .. తుఫాన్ వేళ .. అన్ని పడవలు భయంతో ఒడ్డుకి చేరుకుంటునప్పుడు బయలు దేరాడు… అతను విగ్రహాలు చెక్కడమే గాని… పడవ నడపడం ఎవరూ చూడలేదు. అతను మహా శిల్పి అనడం లో ఏ మాత్రమూ అనుమానం లేదు.. కాని ఏది చెక్కినా .. ఆ నమూనాలన్నీ పూర్తి అందంతో మెరవాలని అతని కోరిక .. అవి మాత్రమే అతను చెక్కుతాడు. ఈ తుఫాన్లో వెళ్లిన అతను ఎలా తిరిగి రాగలడనేది అర్ధం కావడం లేదు.. ఆ గుడిని పూజలు.. పూర్ణ కుంభం.. యజ్ఞాలతో మొదలుపెట్టిన దగ్గరనుంచి మంచి జరగలేదని మూసే ఉంచారు. సమయ దీపాల పదార్ధ దర్శన .. ముద్ద కట్టిన శ్వాస .. ఎగిరిపడి కలల నిద్ర తడి దుప్పటిలో ఒత్తిపెట్టి.. తన దీర్ఘ భుజాల అల్లికని దాటి.. పైకి చేరిన నిందలతో కదలని సాక్షి మరీ ముఖం తిప్పుకొని.. జార్చిన మహా కూపం లో ఓడిపోయే సత్య తీరాలు..
అదే దేవుడి మరో విగ్రహం అతినితో చెక్కించి ఊరు సంబరపడి మరో గుడి కట్టుకొంది.. కాని ఆ విగ్రహానికి కళ్ళు చెక్కకుండా ఈ విగ్రహం తీసుకొని ప్రాణాలకి తెగించి ఎటు పోతున్నాడో వాళ్ళకి అర్ధం కాలేదు. ఆ విస్మయం వాళ్ళకి అర్దమయ్యేలోపే…
……………………………..
అతనినెవరూ నిర్బంధించలేరు.. ఆ మాటకొస్తే అసలు ముట్టుకోలేరు. అలా అతని కాళ్లపై పడ్డ ఓ సంగీత కళాకారుడు .. ఏ భంగిమలో స్పర్శించాడో అలానే శిలగా మారిపోయాడు. ఆ క్షణం లో గడ్డ కట్టిన అతని భాద వర్ణనకి అందదు. తన గుండె తెగి.. ఎదురుగా మండుటెండలో శిలాస్తూపానికి వలాడుతున్నట్లు… అల్లాడి పోయాడు.
ఇలా ముందు లేదు.. కీడుని శంకిస్తూ ఆ గుడి మూసేసిన దగ్గర నుంచి.. అతను పెంచుకొనే ఓ కుక్కపిల్లని నిమిరినప్పుడు మొదటిసారి ఈ సంగతి అతనికీ తెల్సింది. అతని ఆలోచనల సమస్తమూ తను చెక్కే కొండల్లా గట్టిపడి.. గడ్డకట్టి.. ఊపిరికి అంటిన తాడు పేనుకొని.. విశ్వ నిందా సమస్తంగా తనపై విసిరినా శాపం ఎంత ప్రమాదమో తెల్సినా .. ఏం చెయ్యాలో తెలియని ఓ అసహాయత చుట్టేసాక .. భయం కమ్మిన విశ్వ నిందా సమర గతి సంధి పోల్చుకున్నా దేహమే ఊగిపోతూ….ఈ శాపం తన దేహమంతా తిరుగుతుందన్న ఒక నిర్ధాక్షిణ్య సత్యానికి వణికిపోయి.. తనని తను ఓ చట్రంలో బిగించుకుని … ఊరికి దూరంగా ఎక్కడో మనుష్య సంచారం లేనిచోట శిల్పాలు చెక్కుకొనే వాడు…ఈ శాపం తన దేహమంతా తిరుగుతుందన్న ఒక నిర్ధాక్షిణ్య సత్యానికి వణికిపోయి.. తనని తను ఓ చట్రంలో బిగించుకుని … ఊరికి దూరంగా ఎక్కడో మనుష్య సంచారం లేనిచోట శిల్పాలు చెక్కుకొనే వాడు. వీలైనంత ఎక్కువ మందికి తన శాపం గురించి తెలిసి జాగ్రత్త పడాలని ఎప్పటికప్పుడు అల్లాడేవాడు.
వైశామి అతని బంధువుల అమ్మాయి.. వరసని పెద్దలు సంబంధం కుదిర్చారు. ఈ విషయం అతను గమనించగానే.. ఆమెని ఆ తుఫాన్ రాత్రిలో స్వయంగా కలిసి ( బంధువులలో చూడకూడని వాడు ఇది చూసి ముందే అందరకీ ప్రచారం చేసాడు.. ) విషయం చెప్పి .. తన కళ సృష్టి మహా దర్శనల నుదిటి బొట్టని… అందమే దానికి పర్యాయ పదమని నమ్మి చెక్కేవాడు. తల్లితండ్రులు చూసిన సంబంధం.. ఏమీ అనలేదు.. కాని ఆమెని రహస్యంగా కలిసి.. ఆమె ముఖంలో ఏయే మార్పులు చేస్తే అందం మరింత పెరుగుతుందో చెప్పి వెళ్ళిపోయాడు..
ఆమె అప్పటి నుంచి శత విధాలా ప్రయత్నిస్తూనే ఉంది.. అతను పెళ్లిని వాయిదా వేస్తూనే ఉన్నాడు. ఆమెని ఈ వివాహం ఇష్టం లేదని చెప్పమన్నాడు. ఆమె ఒప్పుకోలేదు… నాకు అలా జరగదని చెప్పింది.. ఏడ్చింది.. ఆమెని భయపెట్టాలని చూసాడు. తన లోపల ఇష్టం .. అతనితో తను కోరుకొంటున్న క్షణాలకి చాలా బలమూ.. స్వచ్చత … అతీంద్రయత ఉన్నాయని… కాకూడని సృష్టి కూర్పులు తననేం చేయలేవని గుక్క పెట్టి ఏడ్చింది.. అతను తట్టుకోలేక పోయాడు. ఊపిరాడనంత గట్టిగా కౌగిలించుకొన్నాడు ..
ఆమె శిలగా మారిపోయింది. ఊపిరాడనంత గట్టిగా విశ్వ ఛాంకృతిలో దేహం ఓడిపోయినా కథగా నలిగిపోతూ.. శరీర గాయాల ముద్దగా శక్తిని సరి చేసి.. ఊగిపోయిన విస్వ ఖండిక చిరిగిపోయి.. ఇంకేదో అనాహ హక్తి హెచ్చరికని వినకుండా … తెలియని దారిని తవ్వి.. పునాది విసిరినా సమాధి అడుగున మూర్ఛిల్లిన చీకటి సరంజామా కూలబడి… ఏదీ మారదని.. తెలుసుకొన్న తడబాటుతో .. రాతి నిరూప మూర్తిగా ఉన్న ఆమెనీ
దానితో పాటు మూల విరాట్టు ని తీసుకొని పడవలో జాగ్రత్తగా పెట్టుకొని….అతను బయలు దేరాడు.
……………………
రాజు … చాలా రహస్యంగా ఏర్పాటు చేసిన అంతః పురంలో నిర్ధార కదలికలని వడపోసే మర్యాద ఛాయలు కలిసిన ముద్దలతో … గొంతు తడిచిన శ్వాస క్రీడల్లో పడి ముక్కలైన దీర్ఘ తలాల కన్నుని కాలుస్తూ.. ఇదంతా ఇలాగే ఉందనే అపవాదుల పంట ఎండిపోయాక .. గొంతు రాళంలో మధిర మరుగుతూ… కొన్ని వర్ణ చీకట్ల ఆవిరిగా కొప్పు చుట్టిన చీకటి విసుగుల తలపోత .. అంతః పురం…. రాణి విగ్రహం చెక్కడానికి అన్ని ఏర్పాట్లు ఆమె ఆంతరంగిక పరిచారిక చేస్తూ ఉంది… ఆమె సౌందర్యం అతనిని ముగ్ధుడిని చేస్తూ ఉంది.. ఆమె శరీర వర్ణంలో ఎక్కడ మడతలు పడ్డా కందిపోతున్న కుంకుమ గాయాల నిద్ర తానులూ … నిశ్వాస నీలం కన్నుని దీర్ఘమైన అలజడితో తిప్పుతూ.. గొంతులో .. మరేదో చందన తీపి పరిమళం నూరినట్లు..నిసీర్గ ఎత్తు నడకలా నవ్వుని చూసే కళ్ళలో వడపోసి.. వెళ్తూ వెనక్కి తిరిగి మెడ విరిచి చూసే కంటి పై ఆవిరి చూపు… ఇంకేదో భాషని తెలుసుకొనేలా పురుషుడిని సిద్ధం చేసాకా…
రాతిని సిద్ధం చేసుకొని .. భంగిమని చెప్పి.. విశ్వం నిండా కదిలే నిద్రాణ జలపాతాలు.. కురిసి పండిన చీకటి కొమ్మల వెంక నుంచి .. అటు తిరిగి చూసినపుడు కనిపించే జలపాతాల ముచ్చటని మోసుకొచ్చి కూర్చున్నట్లు.. భంగిమ.. రాణిని … అమ్మా మీరు ముసుగు తొలిగించమని అనగానే.. బంగారమూ.. పత్తి దారాలతో కలిపి నేసిన పై ముసుగుని నెమ్మదిగా తీసింది.. అతని లోపల తానెప్పుడూ ఊహించని ఓ చిత్రమైన పెను కదలిక .. కీడుని మోసుకొచ్చే బరువు.. ఇంకేదో ఊడి తన తలపై పెద్ద వేగంతో పడినట్లు.. చిట్లిన చూపుతో అలానే గడ్డ కట్టి.. ఆమెని చూస్తూ శిలలా ఉండిపోయాడు. మరో మాట అతని పెదాలపై ఆచూకీని వెతుకుతుంది…..
చాలా అందవికారంగా .. కన్ను .. ముక్కు.. ముఖమూ.. మెడ … ఏ భాగమూ సరిలేని అష్టావక్ర రూపం.. ఇది అతని ఏర్పరుచుకున్న కళా నియమాల .. స్త్రీ ఆటే తను బిగించుకొన్న కొన్ని లెక్కలకి.. ఉలి కదిపే తన వేలి కొసల కథకీ పూర్తి వ్యతిరేకం.. అతను స్పృహ కోల్పోయాడు.
రాజు దగ్గరకొచ్చి.. అదోలాంటి అహంకార తీరుని చుట్టుకొని .. శతాబ్దాల అగ్ని పర్వతం పగిలి.. అతని కళ్ళలో ఆ లావా గూడుకడుతున్నట్లు ముఖం పెట్టి.. అదేదో సహజ చలన దారిలో ఎదురైనా ఆగని విశ్వక తుఫాన్ల మధ్య గొలుసుకట్టు నవ్వుల తీగని బాగా ఉడికించి .. ఛాతీలోకి దూరుస్తున్నట్లు.. ఇదంతా వదిలెయ్యి అనే ఓ తేలికైనా .. గొంతు రాద్దాoతం వడపోసిన వాడిలా చూసి … పరిచారికని చూపించి… ఈమెలా చెక్కు.. అనగానే… అతనిలో అనేక ప్రశ్నలు.. అదెలా.. తానొక పరిచారికని చెక్కాలా ? ఇన్నేళ్ల అనుభవం తర్వాత.. ఎవరో అతని మీదకి పెద్ద రాయి కట్టి .. విర్రవీగే తలని కిందికి దించేస్తున్నట్లు.. ఏం చెప్పడానికి గొంతులో దిగబడ్డ మాట బయటకి రావడం లేదు.
రాజు అర్ధం చేసుకొన్నా వాడిలా .. క్షణాల్లో నీ సమస్యకి ఇదే పరిష్కరమన్నట్లు.. నువ్వు అడిగితేనే చేసాన్నట్లు.. అతని ముఖంలో కదలికల సంజ్ఞా భాష గుట్టు చప్పుడు కాకుండా తిరిగి.. చూపుకోసం రెప్పని ఎత్తే అంత వేగంగా … తన కత్తి తీసి .. రాణి గొంతు దగ్గర ఒక్క వేటు వేసాడు.. తల ఎగిరి అంత దూరంలో పడింది.. అక్కడున్న పంచభూతాలు సాక్షీకర వివశంతో కిందికి రాలి… శరీరం చుట్టుకొని ఉన్న నేనూ.. పరిచారిక .. రక్త ధారలా ఊపుని మింగేసిన మృత్యు దెయ్యం జుట్టు విరబోసుకొని మీదికి దూకినట్లు… చూడటమే.. మాట మహా అనర్ధమని స్పష్టం చేస్తూ….అరుపులూ … కేకలూ.. పరుగులూ.. అన్నీ కొంచెం కొంచెం తెలుస్తుండగా .. స్పృహ తప్పిన శిల్పిని ఎవరో మోసుకొని పక్క గదిలో మంచంపై పడుకోబెట్టి వెళ్లారు….
ఆ రాత్రి నిద్ర పోతున్నప్పుడు ఒక చప్పుడు.. ఓ నల్లని తెమిరింత .. ప్రాణ నాడిని బిగబట్టి.. కపాలంలో ఓ పెద్ద రాయిని ఎవడో దొల్లిస్తున్నట్లు.. కదలలేని చెమట కుంపటి బిగుతు ఊపిరిని పిండుతున్నట్లు… కన్ను తెరిస్తే ఎదురుగా రాణి తల … అతను నిలువెల్లా వణికిపోయాడు.. దుఃఖంతో నిండిపోయాడు. మాట తడుముకొని.. మంచుగడ్డలా మారిపోయాడు…..
అంతఃపుర రహస్యాలు నాకు తెలియవుగా ? అన్నాడు.. ఆమెతో .. మర్చిపోయిన మాటలని శూన్యం నుంచి తెచ్చుకొన్న వాడిలా… నిస్సహాయ తెర కాలాక…
ఆమె ఇక నేను కొంత సేపే.. నువ్వు ఎట్టి పరిస్థితిలోనూ ఆ విగ్రహం చెక్కవద్దు ..అంది.. తల మాట్లాడుతున్నది అలా ఉంచితే .. ఏం వింటున్నాడో అదీ మరీ .. సాధ్యం కాని మృత్యు విడ్డూరం తాండవంలా .. తనకేదో దగ్గర పడిందనే దానిని స్పష్టం చేస్తూ…..
అతను నిస్సహాయంగా చూసి … అప్పుడిక నాకు శిరచ్ఛేదమే.. అన్నాడు.. అప్పటికే అతని తల కొన్ని లక్షల సార్లు తెగి పడటం చూస్తూనే ఉన్నాడు….
నా మాటని కాదంటే .. వచ్చే జన్మలో నువ్వు శాపగ్రస్తుడవౌతావు అంది. ఆ రాజు భార్యనే.. ఆ మాత్రం దర్పం నా రక్తం లోనూ బతికే ఉంది.. ఉంటుంది… ఉండాలి కూడా.. అదేదో శాసనాన్నిఅతని నుదిటిపై ఏడు జన్మలకోసమూ తనే రాసేసినట్లు..
అతను ఆమె కాళ్ళపై పడ్డాడు. కాని ఆమె కనికరించక ముందే కలలోంచి బయటపడ్డాడు.
కల .. మృత్యు జాగార తీరికని దాటి హెచ్చరించే నిద్రాణ తీర్పుల వాకిలి.. తెర తియ్యన ధైర్య వచన దీర్ఘత తడుముకొంటూ లిపి సర్దుబాటుని కొలిచే .. నిద్ర చప్పుడుల నాలికని తురిమి.. ఆ పక్క ఎర్రని సంచీలో పొగని మూటకట్టే కంగారుని.. ఊరేగించి.. తలల ఓగూర్పు మడత పడి.. సరి చెయ్యని తలుపు మెడల కత్తెర విరిగి… కిటికీలలోంచి లాగిన కాళ్ళు..
…………………………….
రాజు తల్చుకొన్నాక పరిచారిక రాణిగా మారింది.. అదొక అంతః పుర రహస్యమని అతనికీ బాగా తెల్సు.. ఆమె శరీరం అతనిని ముందు పరిచారికగా సేవిస్తే.. ఇప్పుడు రాణిగా .. పనిలో పెద్ద మార్పులేదు. అలంకరణ .. పగటి పనిలో తప్ప.. విగ్రహం చెక్కుతున్నప్పుడు .. అలవాటు లేని ఠీవినీ … దర్పాన్ని ఆ నుంచోవడంలో నేర్చుకొంటూ … అది క్రమ క్రమంగా ఆమె రక్తంలో ఇంకుతూ …
ఆమె భర్త రాజాస్తానం లో ఇంటికి తన భార్యకై రోజులుగా రానందుకు ఆరా తీస్తే… క్షణమైనా న్యాయాన్యాలు ఆలోచించకుండా…అతని ఆందోళనని అర్ధం చేసుకోకుండా ఆమె ముందే అతని తల ఖండించారు. చూస్తున్న ఆ కళ్ళలో ఏం నడుస్తుందో కొంచెం కూడా ఊహించ లేం .. అది ఎంత పెద్ద వినాశనాన్ని ఎర్రగా రాస్తుందో… అది మరింత స్పష్టంగా చూడడానికి అక్కడ ఎవరూ లేరు. ఆమె లోపల శ్వాస చనిపోయినట్లుగా వణికి పోయింది.. మాట తడబడింది.. కేక మరో చిరునామా లేక వెనక్కి ఆమె లోకే వెళ్లిపోయింది.
రాజు లెక్కలని సరి చెయ్యడంలో అంతగా సమయం తీసుకోకుండా… పిల్లలు ఉన్నారా? అన్నాడు.. ఆమె ఏడుస్తూ తల అడ్డంగా ఊపింది.. ఏం చేస్తావో తెలియదు.. ఇంకెవరూ నిన్ను వెదుక్కొంటూ ఇక్కడకి రాకూడదు… అన్నాడు. అతని కంఠం కంగు మంది ఆమె చెవిలో… ఇంత స్పష్టంగా తన పైకి దూకే క్రౌర్యానికి ఎవరూ బదులివ్వని స్మశానం ఆ రాజ్యం.
ఆమెని రాణి చేస్తానని రాజు అభయమిచ్చాడు.. ఆమె నవ్వి ఒప్పుకొని.. నగలని రోజూ అలంకరించుకోవడం.. ఇష్టమొచ్చినట్లు తినడం.. మధిరని వదలకుండా తాగడం.. కొన్ని అలంకరణ రసాయనాలు ఎక్కువ వాడటం .. కొద్దిరోజుల్లోనే అందవికారంగా మారుతూ వచ్చింది… శృతి మించిన సృష్టి సొగసుల పుట్టుక తేట తెల్లమవుతూ.
చివరకి అతను చెక్కుతున్న విగ్రహం లో అందం తగ్గడం భరించలేక రాజుకి పిర్యాదు చేసింది.. తను తననే స్పృహ లేకుండా రోజూ మార్చి చెక్కుకొని.. నస్రిత గొంతు గరగని ముట్టించే చూపుని పిండి… నాలిక తిమ్మిర్లపై చీకటి పాచిని కడుగుతూ.. దులిపిన మాటని కంట్లోకి తోసి…
ఓ పక్క విగ్రహ ప్రతిష్ట రోజు దగ్గరకొస్తుంటే.. ఏంటా ఈ పరిస్థితని అల్లాడిపోయాడు.
శిల్పి పిలిచి .. రాజు అసహన దేహ భాష అతనికీ చదవడం అలవాటైన వాడు.. తను మాత్రం.. ఏదొక ఆధారం లేకుండా ఎప్పుడూ చెక్కలేదు.. అలా చెక్కడమూ రాదూ… సృష్టిలో ఉన్నదీ ఉన్నట్లు… ఏమాత్రమూ తేడా లేకుండా తిరిగి నమూనాలని తయారు చేయడమే అతనికీ తెల్సిన విద్య. ఆంతరంగికంగా .. అలవాటు లేని అనునయం తో…
ముందులానే విగ్రహం చెక్కగలవా ఆమె లేకుండా? అని అడిగాడు.. అతనెంతో కోపాన్ని తొక్కి పెట్టిన తర్వాత వచ్చిన చల్లని గొంతు.. సౌమ్య నిరాకరణ చేసే పదును కత్తి పిడికిలి అతని గుప్పెట్లో నలుగుతుంది… చప్పుడు చేస్తుంది.. మాటని గుంజి.. తిప్పి.. విరిచి.. పగతో చూస్తుంది.
ఆమె ఉందిగా ? అన్నాడు.. అమాయకంగా.. అతనంతే ఆలోచించక ముందే లోపల ఏం ఉందో స్పష్టంగా చెప్పేస్తాడు.. రాతి నుంచి శిల్పం కోసం.. అవసరం లేని రాయి ఊడదీసినట్లు…
ఆ రాత్రి పరిచారిక మధిర మత్తులో తూగుతూ.. సేవికతో కాళ్ళు వత్తించు కొంటున్నప్పుడు … ఆహార పళ్ళాన్ని.. రుచి సరిగా లేదని వంటవాడిపై విసురు తున్నప్పుడు..
మర్నాటికల్లా ఓ చెక్కపెట్టెలో… మొండెమూ.. తల వేరు వేరుగా ఆమె.. రాజు కత్తి నుంచి ఆ రాత్రంతా రక్తం కారుతూనే … యుద్ధ సమయం లో ఓడిపోతున్నప్పుడు … రాజులకి సొంతమైన స్త్రీ శరీరాలు శత్రు చేతికి చిక్కకుండా తప్పించుకొనే.. రహస్య మార్గం గుండా … కొంతమంది నమ్మిన భటులు .. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని.. అతి కష్టం మీద లాక్కొంటూ … గబ్బిలాలు.. ఇరుకు.. చీకటి .. బురద.. అంతః పుర రహస్యాలు… పాముల్లా పేనుకొని.. జలగల్లా పట్టుకొని… పీడిస్తుంటే స్మశానానికి చేర్చారు… భయాన్ని శ్వాసగా వదిలి చతికిల పడ్డారు.
స్మశానం లో అంత్యక్రియలు.. శిల్పిని పిలిపించి రాజు చూడమన్నాడు.. ఉన్మాద సాయుజ్యం లోని రుజువు.. తల పండిన నిద్ర సానుగతాల జిగురు ఊపిరిలో చిక్కబడి.. తలవని నిద్ర గురి తప్పించుకున్న అలసట కాసుకొని.. పొట్టపేగులు ఎవరో చెయ్యి దోపి కెలుకుతున్నట్లు..
చితి మంటలు ఒక్కసారిగా పెరిగాయి… విశ్వం మొత్తంలో ఉన్న చీకటి తప్పిదాలన్నీ ఒక్క చోటకే వచ్చి పేరుకొని కాలుతున్నట్లు.. ఇంత ఎత్తుకి మంట లెగుస్తూ…
శిల్పి ఒక్క ఉదుటన అందులోకి దూకేసాడు.. ముందు నుంచి అనుకున్నాడా.. అప్పటికప్పు అనుకున్నాడా… అతని మస్తిష్కన్ని ముక్కలు చేసి చూసినా కనుక్కోలేం.. అది భయమో ..బాధో.. నిశ్శయ సానుభూతో.. ఇంకేదైనా సృష్టి రహస్య హెచ్చరికో.. ఏదో ఏదేదో…
………………..
అసలు రాణి ఒక్కప్పుడు అద్భుత సౌందర్యవతి..
అంతః పురంలోకి వచ్చినా ఓ పులి మచ్చల పాముని చూసి ముచ్చటపడి… ఆ చర్మం తో ఉన్ని వస్త్రంపై అందమైన చిహ్నాలు చేయించుకొంది.. ఆ పాము ముందే చెప్పింది.. కలలో… ఇది నీకు తగదు.. నే వెళ్ళాలి వదిలేయమని మర్నాడు తన చర్మాన్ని చీల్చే నిపుణులు వస్తున్నారనగా మానవ గొంతుతో.. లేదా నువ్వు నా శాపానికి గురవుతావని.. అది నిస్సహాయ అరుపు కాదు.. తనకీ శాపమిచ్చిన గురువు ప్రాదేయమ్ తర్వాత ఇచ్చిన వరం.. కరకు గాలుల విరుపు చప్పుడు.. వడపోసిన నిద్ర నీరుతో కదిలే శాపితా గృహాల నిర్ణయ కదలిక….
అది కల కాబట్టి రాణి లెక్క చెయ్యలేదు.. లెక్క చెయ్యక పోవడం వాళ్ళ రక్తంలోనూ ఉండాలని ఆమె తండ్రి చిన్నప్పటినుంచీ చెప్పుకొంటూ వస్తున్నా వంశ గర్వం. తరతరాలుగా నరనరాల్లో కూరిన పొగరు.. కంపిత శరీర వికారంలో మోసుకు తెచ్చుకొన్న దాడి.. మాటని వినకపోవడం వాళ్ళ వచ్చే అధిక మర్యాద.. అదొక దారనే మోసగింపు కట్టిన బలమైన గోడలు.
పదమూడో రోజుకల్లా ఆమె రూపం పూర్తిగా మారిపోయింది. కొన్ని విషయాల దగ్గర సృష్టి స్పష్టంగానే ఉంటుంది.. తిరగ రాయడం ఎవరికీ వీలయ్యే సంగతి కాదు.. మహా ఐతే తెలుసుకోగలరేమో… ఆ మారుతున్న క్రమంలో.. తన అలంకారికులని నానా హింస పెట్టేది.. రాజ వైద్యులని పిలిచి కొత్త మందులు తయారుచేయ మనేది.. జ్యోతిస్కులు.. పండితులు చెప్పిన పూజలు .. హోమాలు చేసేది.. వెండి.. బంగారు జరీతో బట్టలు తయారుచేయించుకొనేది. ఏదీ ఆమె రూపాన్ని కాపాడలేదు.
రాజుకి మెప్పించడానికి అందమైన పనిమనుషలని అతని పడక గదికి పంపేది. అప్పుడూ దర్పాన్ని వదలక .. తన చెలికత్తెలల్నే శత్రవులుగా తయారు చేసుకొంది.. కాలితో తన్నేది… దుర్భాషలాడేది.. బూతులు తిట్టేది.. భయంతో వణికేటట్లు చేసేది. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో తెలియక చాలా మంది కొలువు వదిలి వెళ్ళిపోయేవారు.. కొంతమందిని తన అధికారం ఉపయోగించి ఖైదు చేయించేది. స్త్రీ లోపలి ప్రళయ అంధకారం..ఎక్కి తొక్కుతున్న మదం.. అన్నే కాలరాయాలనే కసి… వేడెక్కిన పిచ్చి.. దేనిని ఎక్కడి వరకు లాక్కుపోవాలో తెలియక….
రాజుకి విషయం తెలిసాక తన ఒకఅప్పటి అందంతో ఉన్న విగ్రహం ప్రతిష్ఠశించాలని.. లేదా అతని కామ రహస్యాలు బయటపెడతానని…బెదిరించడం మొదలు పెట్టింది…
రాజు అంతటి అసహనాన్ని దగ్గర నుంచి చూసి కూడా ఆమెకీ దైర్యం ఎక్కడనుంచి వచ్చిందనే శంక అనేక హత్యలకు… ఆమె ఊర్లో ఉన్న మొత్తం కుటుంబాన్ని మట్టుపెట్టాడు.. దగ్గర వరస బంధువులతో సహా.. ఆంతరంగిక అంతః పురానికి రావడం మానేసాడు. విగ్రహం మధ్యలోనే ఆగిపోవడానికి… ఓ రాత్రి ముక్కల ముక్కలు చేసి… సైనికాధికారిని శరీరం తో దగ్గర చేసుకొని… బంగారమిచ్చి… అంతర్గత పోరుతో.. ఓ రాత్రి అతనిని మధిరలో విషం కలిపి చంపించింది… ఆ రాత్రి అడివిలోకి పారిపోయింది.
స్త్రీ చేతిలో ఒక సామ్రాజ్యం … కొంచెం మాంసం.. ఓ మధిర కలిపిన ముద్దగా .. నల్లని విషపు గాలి ముసురుతో మూసుకు పోయి … కమ్ముకొచ్చిన చావుతో.. తరాల ఓ సామ్రాజ్య పఠనం కేవలం ఒక్క రాత్రిలో… మృత్యు పగుళ్లలో పాముల పుట్టలు లేచి..
………………….
రాజ్యాలు పోయి నగరాలుగా మారాక .. శిల్పి మళ్ళీ పుట్టాడు.. అతని యవ్వనమంతా వారణాశిలోనే … భస్మ ధూళి రాతి ముద్దలుగా మారి… ప్రతిమలై పూజింపబడుతూ… విశ్వ నిరాకార తోవని ఆయుస్సుతో కట్టి… నిద్ర విడువని మృత్యు వాకిలిలో తాండవ చమత్కృతి నీరాజన ముఖాల దేహ యజ్న వాటిక .. కాశీ … నది పూర్ణ గర్భంలోకి లక్షలాది కోట్ల కలశ ఊపిరులని తాగి.. తాగి … విసిగిన నిందతో .. రాజీ లేని కాల్చివేతలని కప్పుకొని.. నిశ్వాస రంగుల కీర్తి నిడివిని సాగదీసి .. పైకి చేరని నిద్రపలంలోఊడిపోయిన కాళ్ళ జడని మోసే రాతి కొండల నినిలువు ప్రవాహి.. వారణాశి..
అనేక శిల్పాలు తయారు చేసే విద్యలో ఆరితేరి … ఒక రోజు… అనాధ ఐనా అతనిని వెదుక్కొంటూ .. ఓ తోటి శిల్పి వచ్చాడు..అతని తల్లి అంత్య క్రియలకి కొంత సహాయం చెయ్యమని.. వాళ్ళ ఊరు వెళ్లి… అంత్యక్రియలు చెయ్యడంలో … అదే అతను పుట్టిన తర్వాత శవాన్ని చూడటం… కదలని రాతి విగ్రహానికి చివరగా కళ్ళని చెక్కక ముందు మూసినట్లు.. శ్వాస ధమనుల పొంగని నానబెట్టి.. శరీర చాయని కలిపి చుట్టే విశ్వాస రాళంలో ఊరేగే చిత్ర పంకిత దేహ మెరుపు ఇంకెంచుకొని… శపిత నిద్ర గళం లోకి ఉలి చప్పుడు పీల్చేసిన నిర్జీవ కంకణదారిలా ఆ శవం.నిలువెల్లా వణికి పోయాడు.. పూర్తి దేహం నిప్పై మండి… బూడిదగా ఎగిరే వరకు అలా చూస్తూనే ఉన్నాడు. దృష్టి అసంపూర్ణలోంచి శిలా ద్రవం లేచి అతని లోపలంతా నిండి గడ్డ కట్టి తానే శిలగా మారినట్లు.. శ్వాస ధనుస్సు ఎక్కుపెట్టాక.. కల దొరకని నిద్రచాటు బొమ్మ చెక్కుతావా నన్నని బతిమాలుతున్నట్లు… దూరం జరిగిన మహా ధూపం కమ్మేసిన వికారంతో కలబడే నిద్ర శంకాలని పూరిస్తూ..
ఓ కలశం లో కాటికాపరి చితాభస్మం వేసి ఇచ్చాడు.. అది తీసుకొని… ఆమె చివరి కోరిక గంగలో కలపడమేనని తెల్సి… అస్తి నిమజ్జనంలో పూర్తి చర్యలని గమనించాడు. మిత్రుడు.. ఏదో దేవి విగ్రహం చేయాల్సి ఉందని వెళ్ళిపోయాడు.. వెళ్లి పోవడం … ఉంది పోవడం రెండు వ్యతిరేక చర్యలు కావు.. ఒక్కటిగా ఎప్పటికీ ఉంది పోవు.. రాతి ముద్దలు దేహ సహకార జీరని వణికించి .. ముసిరినా ఉద్రేకంలోని కుంకుమ పాదుని కాలుస్తూ … స్వయం రసల్యత.. శిల్పి వారణాశిలోనే ఆగిపోయాడు.. వరుసగా మూడు రోజులు ఘాట్లో శవాలు కాలడం.. కావాల్సిన వాళ్ళు ఒక్కసారిగా కేక పెట్టినట్లు ఏడవడం ఇదే చూసేవాడు.. దుఃఖం ఎప్పుడూ ఒక లాగానే .. ఎంత తిరిగి రాణి భాద నైనా ఊడదీసుకొన్న నిద్ర కావేదాల బరువుగా సంచారం చేసిన జ్ఞప్తికి ముగింపు తాకిడిని జోడించి గంట మోగిస్తారు. శ్వాస చప్పుడు సర్దుకొని.. ఒకరినొకరు ఓదార్చుకొని పై మెట్లిక్కి వెళ్ళిపోతారు….
శవం కాలడంలో వచ్చే మంటలలోంచి అనేక తీరు తెలియని ఆకారాలు కనిపించేవి..వాటిని పూర్తిగా అర్ధం చేసుకొని రాయిపై చెక్కలనుకొనేవాడు… అలా నెలలు అక్కడే ఉండిపోయాడు… విశ్వపు మృత్యు రహస్యాన్ని.. నరక ద్వారం దగ్గర కుప్ప కూలిన పుణ్యాలని.. తీర్పు నివ్వని చట్టాల మధ్య తగలబడుతున్న చెమట రాశులు చల్లారి మెల్లగా శరీర బరువు పెరిగే వరకు చూస్తూ ఉంటావా?
అక్కడతనికి ఏ మాత్రమూ ఆదాయమూ లేక .. సత్రంలో భోజనం చేసి ఏదైనా పెద్ద చెట్టు కింద ముడుచుకొని పడుకునేవాడు. ఓరోజు ఓ స్వామిజీ తారసపడి… అతని భూమి పైకి వచ్చిన ఫలితం సిద్దించాలంటే ఎక్కడికి వెళ్లాలో చెప్పాడు. అరచేతిని, వేలి కొసలని… నుదిటినీ , కంటిలోని స్థిర గడువు చిత్రాలని చదివి.. సృష్టి ప్రతి సృష్టి చేసే మహా కల నీ స్వంతం.. ఓ చిరునామా ఇచ్చి .. అక్కడకు వెళ్లి ఈ ఉత్తరం ఇవ్వు … సమయం నిన్ను చరిత్రలో స్థిరపరుస్తుందని చెబుతాడు.
అతనికీ ఇప్పుడు ఆ గత జన్మ శాపం తగులుకొంది. .. కాని దీనికి కొన్ని రోజుల ముందు.. ఆ పాడుబడ్డ గుడిలో తను చెక్కిన విగ్రహం లో ఏం లోపం చేసానా అని.. చింతపడుతూ .. రోజూ పనయ్యాక .. రాత్రుళ్ళు అటు వెళ్లి .. చాలాసార్లు అక్కడే నిద్రపోయేవాడు. రక రకాలుగా ఆ విగ్రహాన్ని పరిశీలించేవాడు. ఎన్నోసార్లు ఆ విగ్రహానికి తన తలని బాదుకొన్నాడు.. రక్తంతో తడిచేది.
ఆ రోజు రాత్రి గుడి అంతా కాంతి .. గంటల శబ్దం.. పూజ జరుగుతున్నప్పటి పరిమళం.. గుడి చుట్టూ వర్షం.. మెరుపులు… కింద మంటపం.. గర్భగుడి నిండుగా పూలు.. ఫలహారాలు.. అవే చూస్తూ స్పృహ కోల్పోయి నిద్రలోకి వెళ్ళిపోయాడు.
కలలో దేవి ప్రత్యక్షమై … దేనికి నాయనా నీ ఆందోళన అంది.. ఆ గొంతు తను చిన్నప్పటి నుంచి తెల్సిన తన తల్లి గొంతులానే ఉంది. ఆ నవ్వు.. తన మొదటి శిల్పం పూర్తయినప్పుడు వచ్చిన తన నవ్వులానే వినిపించింది.
నా చేతల్లో ఏదైనా పొరపాటు జరిగిందా ? ఎందుకిలా.. తల్లి నీకు పూజ పునస్కారాలు లేకుండా .. అతని గొంతులో జీర పెనవేసుకొని.. దర్శ శిఖ కి వేలాది దీసిన శరీర వణుకులా దీర్ఘ శ్వాసల నిలువెత్తు మసక చలి గుండాల్లో కూరుకు పోయినట్లు భాద నిండి… బరువెక్కి.. అనుకొన్న దానిలో సగమైనా చెప్పక… లోపలికి బయటకి కూలి….
ఆమె నవ్వింది… వేల రంగుల కాగడాలతో నిండిన గుహ చర్యలా మధ్య సూర్య నిద్రని కలిపి ఆరబెట్టి… పుట్టిన భూమి కన్నుని గంటల తాడుకి కట్టిన మంగళ చప్పుడిలా….
నువ్వు నిజమైన కళాకారుడవైతే .. అందవికారంలోంచే … అందాన్ని సృష్టించాలి…నీ లోపలి మానసిక మధనలో నిజాయితీ లేదు. ఆకర్షణకి వ్యతిరేకమైందీ .. ఏదీ ఈ సృష్టిలో లేదు.. ఆ దర్శన నీకు అత్య అవసరం అంది.. అది మాత్రమే నీ కళని ఈ భూమి పై శాశ్వతం చేస్తుంది.. ఈ పై మెరుగుల కేవలం అందం కాదు. ఏది చూడలేవో అక్కడే కళారహస్యం దాక్కొని ఉంది. అంది
అతను నిద్రలోంచి లేచి… ఆ విగ్రహం.. తన కాబోయే భార్య విగ్రహం తీసుకొని .. ఆ తుఫాన్ రాత్రిలో పడవలో.. బయలు దేరిన చోటికే….
గత జన్మలో రాణి చెప్పిన దీవికి బయలుదేరాడు. అడివిలోంచి పారిపోయి ఆ దీవిని చేరి .. ఓ ముని కనికరం వలన …నిజమైన సృష్టి సౌందర్య అర్ధం తెలుసుకొని.. నిరంతర తపస్సుతోశాంతి నిండిన సాయుజ్యం పొందిన చోటది. విశ్వం నిండా మసిలిన రహస్య నిందల దేహ వాకిలి చేరబెట్టిన అపార్ధ నిందల పాపాలన్నీ చెదిరి పోయిన పునాదుల కిందనే … జ్ఞాన రక్షా వణికే కలల తానుని నేసి.. కాల్చి పెట్టుకొన్న సరుగుడు తోటల మధ్యనే సృష్టి తన శాంతి రహస్యాన్ని వండుతూ….
………………………
ప్రకృతి విద్వoషం లోని ప్రళయ లయల సౌందర్యం నిండిన కెరటాలని.. భయద గజ్జెలు అల్లాడిస్తూ చేసి విళయ కంకాళ నృత్యాన్ని .. విశ్వ నిర్జన పాదాల కిడా చీమల్లా నలిగి పోతున్న మనుషలని.. వాళ్ళ కలలని.. అత్యాశలని.. వేరుపడని కాసిని.. కౌర్యాన్ని.. చిదిమి.. తానేమిటో చూపిస్తున్న సృష్టి.. మృత్యువుకి దగ్గరగా ఎగురుతున్న పడవని.. అనేక జలచరాల అలజడిని.. దూరంగా దీవిలో .. విరిగి పడ్డ చెట్లు.. కొండలపై నుంచి రాళ్లు దొల్లుకొచ్చి చనిపోయిన క్రూరమృగాల కుళ్ళిన కళేభరాలని.. గట్టు దగ్గర ఓ తేరులా కుప్పపడి చనిపోయిన చేపల వాసన.. బోర్లించిన ఆయుస్సుతో గిలా గిలా కొట్టుకొన్న ఓ పెద్ద సొర చేప.. అంతా భీబత్సా ముగ్దత .. భూమి అడుగు పొరల్లోంచి చిమ్మే నిప్పుని.. కంపనని.. గాలి పీడన రాశుల కల్లోలాన్ని.. ఆకాశం మీదుగా మాయమౌతున్న నీటి ఆవిరి జోడింపులని… నిద్రాణ విశ్వరూపలాలల గుబులుని… కర్కశత్వాన్ని … పోటుని.. అతనికీ ఇప్పుడే తన కళతో చేరాల్సిన ఎత్తులు అర్ధమౌతున్నాయి. మృత్యు దేవతని సృజన లోపలి పొరల్లో ఉంచుకుని దర్శిస్తూ ఉలి నివ్వెరలతో చెక్కడాన్ని.. తన దేహమంతా నిండి పలకడాన్ని తెలుసుకొంటూ …. కళ్లన్నీ నీటితో నిండి మసకబారి తున్నాయి..
ఆ మొత్తం ప్రళయాన్ని పట్టుకోవడానికి ఆ దీవిలోని ఓ పెద్ద కొండని ఎంచుకొని.. చెక్కడం మొదలు పెట్టాడు.. ఎన్నో స్త్రీ సమూహాలు.. అందులో అన్ని వయసుల .. అందాల .. కొలతల స్త్రీలు.. మరో వేపు పురుషులు… వాళ్ళ ఖర్మ సందేహాలు .. వికారాలు… తల్లి గర్భం లో భయపెట్టే పిండ దశలు.. వంకరలు.. ఎత్తు పళ్ళు.. లావుగా నవ్వే స్త్రీ మూర్తులు.. పాలతో పండిన నిలువు చెట్లు.. మృతువు ముందు వేలాడుతున్న రోగులు.. నిశ్వాస సంభవ కీర్తనని జోడించి కదిలే పూనక మూర్తుల కల్లోల నిద్ర కథనాలపై కూర్చొని చాటిస్తున్న మతిమాటలు.. చిత్ర మైన నమ్మకాలు… వికృత రూప గ్రామా దేవతలు.. అరకొర సంతులీనాల దుఃఖం తోడుకునే రక్త బావులు.. గొంతు నులిమి కెరటాలు… గద్దించి రాల్చుకొన్న ఊపిరి మూటలు…
అతని చేతులు.. రాళ్ళ ధూళి దూరిపోయి మసకబారిన కళ్ళు.. కదిలి కదిలి శిధిలమైన భుజాలు.. ఉలి కి ప్రతి లిపిగా మారి ముక్కలు రాలిపోయిన చేతి వేళ్ళ కొసలు… పాద రక్షణ లేకుండా ఆ కొండలపై నడిచి నడిచి పుండు పడ్డ పాద రక్షణ లేకుండా ఆ కొండలపై నడిచి నడిచి పుండు పడ్డ అరిపాదాలు కలలోంచి లాక్కునే ప్రతి చిన్న విపత్తుని.. రంగుని.. గమనాన్ని.. శ్వాసని.. తెగింపునీ .. ఒడిసిపట్టి పిండి.. మనసుని చెక్కుతూ… తిండి లేక ఎండిపోయిన పొట్ట… అన్నీ అరిగిపోయాయి.. ముక్కలయ్యాయి.. రక్తం కారుతుంది.. ఒక్కోసారి దారలుగా.. అవి అతని కాబోయే భార్య విగ్రహాన్ని తాకగానే … ఆమె స్త్రీగా మారి అతని దగ్గరకి వచ్చింది.. అతని లోపల ఒక ఆనంద తాండవం.. సృష్టి పట్ల అపారమైన కృతజ్ఞత … నిండు కరుణ తో తనపైనా వర్షించే శాప రహిత ఆనవాళ్ల మేలుకొలుపు..
అతనిలో ఓ ఉన్మాద చర్యలా స్థిర నిర్ణయం కదులుతూ.. దిగులు.. శ్రమ బరువు.. అతీత జ్ఞప్తి లోని కలల పొడి కూరిన చూపు.. అతను ఆవేశం తో .. ఒక చిత్రం … తన రక్తమూ , కొన్ని పత్రాలు నూరిన రంగులతో గీసి.. మొత్తం కొండ ఆ కళతో ఎలా ఉండాలో ఆమెకి అర్ధం చేయించాడు..
ఆమె మనసులో చిత్రించి.. తన సమస్త అతిత్వ శక్తుల సారాన్ని చుట్టి ఆమె తలపై నుంచి పోస్తూ శతసహస్ర వర్ణ పిడుగులతో పండిన విశ్వ కీల మేల్కొన్న అజరామర కళని తీర్చుకున్న శ్వాసని పంపుతూ… ఆమె చెక్కడం మొదలు పెట్టింది… ఆ నాజూకు తనం అతనిని మించీ ఉంది.. అదే అన్నాడు.
ఆమె ఆనందం తో కౌగిలించుకొంది.. పరిపూర్ణత నిండుతూ … నాలోకి సంపూర్ణ కాంతి దాహంతో నిండే పుట్టుక .. చలాచలన దీక్షతో పండిన కానుకలనే వద్దని దాటేస్తూ .. ఉండిపోయిన సర్వ నిద్రా పరిచర్యల చీకటి పరుచుకొని.. ఊహకి అందని ఎత్తుగడ ఎప్పుడూ సృష్టిలో ఉండే ఉంటుంది. నిర్ఘాంతపోయి అలా చూస్తూ ఉండిపోయింది..
అతను శిలగా మారిపోయాడు..
……………………………………
ఊరి వాళ్ళు కొన్ని ఏళ్ళ తర్వాత ఆ దీవిని చేరారు.. ఆమె రాళ్లపై చెక్కిన శిల్పి కథని తెలుసుకొన్నారు.. అతనిని చెక్కిన అనేకం లోంచి ఓ విగ్రహాన్ని తీసుకొని అతనికీ అక్కడే ఓ గుడిని కట్టారు. కళ్లారా చూసి .. ఇక చాలు ఈ ఒంటరి తనమని తమతో రమ్మన్నారు.. ఆమె తల అడ్డంగా ఊపి అది తన మరణం తర్వాతే .. విశ్వం నిండా మసిలిన రహస్య నిందల దేహ వాకిలి చేరబెట్టిన అపార్ధ నిందల పాపాలన్నీ చెదిరి పోయిన పునాదుల కిందనే … జ్ఞాన రక్షా వణికే కలల తానుని నేసి.. కాల్చి పెట్టుకొన్న సరుగుడు తోటల మధ్యనే సృష్టి తన శాంతి రహస్యాన్ని వండుతూ తను ఒంటరి.. తన గతంతో లేవదీసుకొన్న నిద్ర గుబులుల మధ్య తను ఒంటరి… అతని ఆత్మ పాషాణ స్థితిని దాటి.. శ్వాసించే ఆయుస్సు చివరి ఉలి మెరుపై … లోకి కురుస్తూ… చెట్ల గాలి.. రాళ్ళ నిద్ర… పండిన కెరటాల అలసట.. రాత్రి కాగిన నీటి గోలెం .. అన్నింటిలోనూ తనే.. తను ఒక్కడు కాదు… ఈ రాతి రూపాలన్నింటిలోనూ తనే..
తనే .. ఈ రాళ్ళలో నిండిన తనే నా లోకం.. ఇక మరేం వద్దు.. మొత్తం కలల మాగాణీగా ఉండిపోయిన ఈ సర్వ రక్షా దీవి మాత్రమే నా శాశ్వత ఉనికి…ఆమె కళలోని సంపూర్ణ సమర్పణకి ముగ్దులై .. ఎంతో మంది శిల్పులు యెక్కడఁడెక్కడి నుంచో వచ్చి ఆ రాళ్ళ పై శిల్పాలు చెక్కుతూ ఆమెకి శిష్యులుగా మారిపోయే వారు.. తను ఒక్కడు కాదు… ఈ రాతి రూపాలన్నింటిలోనూ తనే.. వాళ్ళందిరిలో ఏక సూత్రతగా ఉండిపోయిన నిద్ర గంటల పరాయితనంతోనే గెలవాలని .. ఆమె వేళ్ళ మాధుర్యంతో పొంగే చిత్ర జ్వాలామా తీరుని కలిపి .. బొట్టుని అనేక నిత్యల మధ్య కడిగే అమరింత పగటిలో…
మీ ఊరిలో ఈ దేవీ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించండి .. అది గొప్ప పుణ్య క్షేత్రంగా మారుతుందని చెప్పింది.. ఆమెకి అది స్పష్టంగానే అర్ధమైంది… సృష్టి జవాబుని చదవడం అప్పుడే నేర్చుకొంటున్నట్లు .. నీరు బిగించిన చూపుతో… ఇంకొక ఆత్మ నివాళి చెప్పిన కబురులా.. అతని చేతులు పడినవన్నీ ఇక సజీవ సాయుజ్య రూపాలే…
వాళ్ళు వెళ్లిపోయారు… ఎంతైనా బతిమాలారు.. దేవతలా చూసుకొంటామన్నారు.. ఆమె నడిచిన చోటంతా ఓ దివ్య క్షేత్రంలా మార్చేస్తామన్నారు.. అతనికీ ఆమె ఉండే చోటనే గుడి కడతామన్నారు. యుగాలకి సరిపడేంత ప్రచారం ఆమె కళ కోసం చేస్తామన్నారు.. వృద్దులు.. చిన్న పిల్లలు.. రోగులు.. అప్పుడే పెళ్ళైన కొత్త జంట అందరూ వేడుకొన్నారు.. కాని ఆమె నిర్ణయం మార్చలేక పోయారు. ఆ నివాళి పాట ప్రతి క్షణం అక్కడ తనలోకి చేరి స్వాంతనని ఇస్తుందని.. అదే తన జీవ రక్షకి.. కలకీ .. కళకీ .. అవిధేయ పుట్టుకనీ.. కొంతమంది అర్ధం చేసుకొన్నారు.
దశాబ్దాలుగా ఆమె చెక్కుతూనే ఉంది..
వేల జనం దర్శిస్తునే ఉన్నారు.. ఎక్కడెక్కడికో ఆమెని పిలుస్తూనే ఉన్నారు.. ఆ గుడిని.. గంటని మోగిస్తూ వాళ్ళ ప్రేమ కథని తడి ఆరకుండా చెప్పుకొంటూనే ఉన్నారు.
ఎక్కడెక్కడ నుంచో జనం వచ్చి తరాల నుంచి తరాలకి జారుతూ … కథల నుంచి కథలని కలుపుకొంటూ …ఆ శిల్పాల కొండని దర్శిస్తూ … ఆ నమ్మలేని కథని నమ్మడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అక్కడకి చేరడానికి మరిన్ని సదుపాయాలు పెంచాలని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎప్పటికీ ఆగిపోయేది కాదనే నమ్మకం తో ఉన్నారు.
…………………………………..

