బాహ్య నిరాహుడు

                                                         బాహ్య నిరాహుడు

Download Free Ebook
Download Now

కౌగిలిలో శిధిలమైన ఆశ్రిత తత్తరపాటు కొత్త గుమ్మలని నించోబెడుతుంది. 

సృష్టి విరగదీసిన రాత్రి క్షణాలు విరిగిపడి … కలవరం లేని మగత మోతలతో కాపాడి పోయిన ఉప దేహాల కమురు వాసన గుప్పిన పుట్టుకగా నీరు చెదిరి … పలకరిస్తుంది.. అక్కడేం బాష కదలక వరాలు లేని దుఃఖం కింద కొండలని దాటుతుంది. నదుల సర్ప గుండాల పగతో వెల్లడి పాకుతూ .. సమయ చితి ఎండగట్టిన నిద్ర ధ్వని ఎర్రగా నిండిన కాళ్ళని కాల్చి పెట్టి శరీరం లోకి తొడుక్కుని సొమ్మసిల్లు తాయి .. ఇక్కడ ఎవరూ దీప ఎండలని సాగనంపరు.

అతనొక ఎదురు చూస్తున్నా భూమి రెండో సంతకంలోని నడక. తనకు తను తెల్సు.కాని ఆ గాథా ధ్వని అంతగా ఎవరిని నమ్మకంలోకి తీసుకోదు … అందుకే విశ్వ సంచారం మొదలు పెట్టాడు.. ఒక రొట్టెను అనేక రొట్టెలు చేసి పంచాడు.. అతనిని  నది దాటిస్తున్న పడవ చేపలతో నిండి పోయింది. అతను తను పురుడు పోసుకున్న స్థలానికి వెళ్లాలను కొన్నాడు. ఎవరినుంచి కొత్త మాటని తీసుకోవడానికి సిద్ధంగా లేడు.పడవ వెళ్తూనే ఉంది.. అరచేతిలో నీళ్ళని ఆకాశంలోకి విసిరి వానని సృష్టించి.. మసక బారిన వంతెనల పక్కాగా .. సముద్రాన్ని చీల్చి.. మధ్య గుబులులో కాళ్ళని ఉంచి నడవడం మొదలు పెట్టాడు. గాలి తూఫాన్ అవుతుంది.. విందులోకి వెలిగించిన లాంతురుగా మారుతూ విశ్వ ప్రోక్షణ చుట్టుకున్న నాలుగు దిక్కులలోనూ శబ్దాలు మాటలు కాలేక అటు వెళ్లిపోతాయి.

         పడవవాడికి ఆ రాత్రీ ఆ పొడుగు అంగీ మనిషి నిద్ర పోయాక .. నది తీవ్ర ప్రవాహంలో ఈదుకొంటూ.. ఒక నల్లని బలమైన మనిషి పడవ లో ఎక్కాడు. అదెలా సాధ్యమో అర్ధం కాక చూస్తున్నాడు. అతనా చెప్పాలని చూసి.. ఈ నీటి పాముల్ని తీసుకెళ్లి ఏం చేసుకొంటావ్? అన్నాడు. పడవవాడికి అవి నిజంగానే చేపలన్నీ  పాములుగా కనిపించాయి. వశపర్చుకొన్న చిత్ర మాయ ముందు ఓడిపోతూ .. ఒక శ్రమ దోసిలి ఆవిరై ఎగిరే చూపుల రహస్యం పట్టు చిక్కక .. వాదులాడని కెరటాలు.. అన్ని తీసేసుకొంటాయి. నది లోకి తోసేసాడు. గుక్కపెట్టి ఏడ్చాడు….

ఆ వచ్చిన నల్ల వాడు.. పెద్ద పెద్ద బలమైన చేపలతో పడవ నింపాడు. పొడవు అంగీ అతనిని ఎక్కడైనా దించెయ్యి .. అతను ప్రమాదం అన్నాడు.. తాను కణికట్టుతో పాముల్ని చేపలనీ మోసం చేసినవాడు .. ఇంకేదైనా చేయగలడని… అంగీ వాడి చేతులని పరిశీలనగా చూడమన్నాడు.. నరాలు ఉబ్బి ఎర్రగా భయంకరంగా ఉన్నాయి.. ఈ లోపు ఓ దీవి వచ్చింది.. అది క్రూర మృగాలు… మృత్యు కోరలతో ఉండే పాములు.. విషపు మొక్కలు .. నల్ల గాలులతో ఉండే ప్రమాదకర చోటు… చావు తిరిగి రాని మహా నిద్ర కల్లోలం … ఊహిండానికి లేక మస్తిష్కమంతా కమ్మేసిన చీకటి గుహల నిర్వేదం.  మనిషి ఏమాత్రమూ బ్రతక లేడు. నిద్రలోనే ఉన్నా అతనిని .. ఒక వెలుగు ముద్దలా .. కనీస బరువు కూడా లేకుండా తేలికగా … చిన్న ప్రతిఘటన .. శ్వాసలో ఏదైనా గడ్డ కట్టిన చల్లదనం ఏమీ లేవు. పడవలోంచి విసిరి వాళ్ళు తిరుగు ముఖం పట్టారు. సృష్టి వదిలించుకోవడాన్ని .. మాట తప్పడాన్ని..చీకటిని నాజుకొని నమలడాన్ని ..అలసత పరుగులు పెట్టె దూర చిత్ర బరువు కడగడాన్ని..  అనాయాసంగా  నేర్పేస్తుంది.

                                                                                                    ………………..

ఒడ్డు చేరేసరికి అతనిలో తీవ్రమైన అలజడి..  చేపలన్నీ  ఒక రాక్షసశక్తితో బలంగా పైకి లేచి నది లోకి దూకేసాయి .. ఆ నల్లని మనిషి … ఓ వాసనతో కూడిన పొగగా మారి ఆకాశంలోకి మాయమయ్యాడు.అతని అన్నీ రోజుల కష్టం వృధా అయింది.. ఒడ్డు దగ్గరకొచ్చి అతని భార్యా పిల్లలు నిరాశగా చూసారు.. అయినా ఆమె నవ్వి.. ఒక పరిష్కృతుడు వచ్చాడు.. ఆమె లో మొదటి సారి అతను అంతటి సంపూర్ణ విశ్వాసం.. ప్రశాంతత చూస్తున్నాడు.. మరో ప్రశ్న కూడా అతనినించి రాలేదు.. మిత్రుడా … అనే ఆ గొంతు మనలని వివశులని చేసి.. ఆకలిదప్పులు స్పృహ లేకుండా చేస్తుంది.. చేరుకొందాం పదండి. అంది ఆమె.  అక్కడ ఆ కొండ గుట్టపై మనం అతనిని కలుద్దాం అంది.

పడవవాడు అతనిని చూసి.. నిర్ఘాంతపోయి చూస్తున్నాడు.. పూర్ణ నిమేష ధ్వనితో పండిన ఆ గొంతు.. విశ్వ లీల మరేం కాదు..నా మాటే అన్నట్లు.. చిన్న తిరస్కరం.. చూపు.. కోపం.. నిలదీయడం ఏదీ లేదు.. పౌర్ణమిలోకి కొన్ని లక్షల కాగడాలని విసిరినట్లు ఆ నవ్వు.. కొన్ని వేల పిడుగులని మింగిన ఆ కళ్ళు.. ఏమాత్రమూ దుమ్ము కాదుగాని ఆ పాదాలు.. మాట చెప్పడానికి తప్ప మరి దేనికీ అంతగా ఉపయోగించని పెదాలు.

 అంత జనం లోంచి అంగీ వ్యక్తి అతనినే చూస్తూ.. పడవలో చేపలు అలాగే వదిలేసి వచ్చేసావెందుకు ? అన్నాడు. ఆ ప్రశ్న వెనక ఉన్న అర్ధం తనకి మాత్రమే తెలిసేలా .. తాను సిగ్గు పడేలాంటి ఏ మాటను అతను అనడాని అర్ధమౌతూ ఉండి.. అతనప్పటికే కృతజ్ఞత భారంతో నమస్కరం చేస్తున్నాడని అతనికే తెలియడం లేదు.

పడవవాడు పరుగున తిరిగి పడవ దగ్గరకి వెళ్ళాడు.. అవన్నీ అలాగే ఉన్నాయి. ఇంకా ఏవో కొత్త రంగులతో ఆ పడవ మెరుస్తుంది.. దూరంగా తను అతనిని వదిలి వచ్చి దీవి వేపు చూసాడు .. అతని ఊపిరి తీయడం కూడా మర్చి పోయేంత ఆశ్చర్యం, బంగారు వర్ణం తో మెరుస్తున్న అడుగుల ముద్రలు ఆ కెరటాలపై .. చూపు వెళ్లేంత దూరమూ కనిపిస్తున్నాయి. పడవలో అతను కూర్చున్న చోట అద్భుతమైన పరిమళం అంత చేపల వాసనలోనూ …

చాలా డబ్బు అమ్మిన దానితో వచ్చాక … ఇంటికి వచ్చీ భార్యకి ఇచ్చాడు. భోజనం చేసిన వెంటనే .. నేనాయనని చూడడానికి వెళ్తున్నా అన్నాడు. ఆమె తల ఊపింది.

                                                                                       ………………..

ఆయన వేగంగా ఏటో వెళ్తూ ఎదురొచ్చాడు. పడవవాడు ఆందోళనగా చూసాడు. దేవాలయం కూలబోతుంది …నాతో వస్తావా ఆపుదాం అన్నాడు.. చాలా పెద్ద గుడి … విశ్వపు మొత్తం సాంబ్రాణీ కొండలన్నీ అక్కడే కాలుతున్నాయా అనేంత … స్వర్ణమయ స్తంభాలు … చిత్రమైన రసన ఆకృతిలో గుమ్మాలు… గోపురం నిండా .. దశాబ్దాల చేతుల శ్రమ చెక్కిన అనేక మాయ ఉత్త్సవాలు.. అదే అలాగే భూమి తో పాటు శరథం అన్నంత నమ్మిక .. కాని కళ్ళముందే..

 అనేక ఎత్తైన స్తంభాలు విరిగి పడి ఓ గోపురం కూలబోతుంటే .. ఎదురు నిలబడి ఆకాశంలోకి చేతులు పెట్టి స్తోత్రం చేసాడు.. మొత్తం విశ్వాన్ని తన వేపుకి తిప్పుకోగల మహా విశ్వాసం.. ఏ మాత్రమూ జంకూ గొంకూ లేని నడక ఆ గుడిలోకి .. ఓ పక్క కూలుతుంటే..నా కాళ్ళు ఎప్పుడో ఆగిపోయాయి.. ఊరికినే లోపలి చూస్తూన్నంతే..  అంతా ఆగి పోయి ముందు లాగే మారిపోయింది.. అందులో ఉండే పూజారులు .. పూజారి కుటుంబాలు.. భక్తులు బయటకొచ్చి ఎవరు నువ్వు ? అన్నారు.

వాళ్ళ దేవుడుని మించి ఇతనెవరో వాళ్ళకి అర్ధం కాలేదు.. కాని సత్యం నమ్మకాన్ని వదలకుండా పట్టుకొని రుజువు చేస్తుంది.. ఎలా కాదనాలో …

అది తెలుసుకోవడానికే మీరూ .. నేను అందరమూ ప్రయత్నించాలి.. అన్నాడు. స్థిర మహా గుంజన మోగిన స్వర మోహక సంజీవని వర్ణ మెదిలిక .. సగం కాని వినాశ దారిలోని కల్మష నిదానం.

పడవవాడికి ఏం జరిగిందో అందరికీ చెబుతున్నాడు. ఆ దీవి లోంచి బతికి బట్ట కట్టడం అసాధ్యం.  రెండు రోజులు పడవ ప్రయాణం పట్టే దూరం ఎలా దాటాడు.. ముందు రోజునుంచే ఆ కొండ పై అతనేదో భోద చేస్తూనే ఉన్నాడు. ఇదంతా మన చుట్టూ రోజూ జరిగేంత మామూలు సంగతులు కావు.. విశ్వం వెనుక మరో జన్మ పొదివి చుట్టి నేరుగా ఇక్కడకి వదిలారా?

                                                                                    ……………………..

వేశ్యావాడలో( మాంస వ్యాపారం ) …………

చింకి నానిన చీరాల ఆమె శరీరం.. ముట్టుకొన్న కథ బోగణాల పట్టూ విడుపులు ఓడిపోయి.. నిశ్చయ ద్రుష్టి శక్తులు తవ్వుకొంటూ పోతున్న నినాదాలతో గాలి వర్తుల శరీరాల్ని పాతర వేసిన జిగురు శ్వాస. ఆమె అతనిలోకి మాట్లాడుతుంది. చిట్లిన స్థిర నిరాకరణతో….

నా కూతురు తీవ్రమైన పొత్తి కడుపు నొప్పితో బాధ పడుతోంది. ధర్మ ప్రకారం ఆ విటుడికి ఇంకా మూడు గంటల సమయం రంజింప చేయాల్సి ఉంది..కూతురిని గది లోంచి రమ్మని.. చాలా అందంగా నేను అలంకరించుకొని ..నా కూతురి నొప్పికి ఏడవడం.. ఓదార్చడం చెయ్యకుండా విటుడి దగ్గరకి వెళ్ళాను. చిట్లిన స్థిర నిరాకరణతో  మాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేర్పిన నీతి ఇదే .. ఇంకేం తెలియదు.. ఈ దేహపు వీలునామా నిండా వీర్యాలు గడ్డ కట్టిన వాంతులే ఉంటాయి.

విషయం తెలిసిన జనం నన్ను రాళ్లతో కొట్టారు.. వాళ్ళ నీతి శాస్త్రం లో అన్ని బూతు మాటలు ఎక్కడా రాసి ఉన్నాయో.. నేనే భరించలేనన్ని.. పరుగు పెడుతుంటే నా లోపలి ఆయాసం పగిలిపోయింది.

అప్పుడే  నా కూతురు తల పగిలి మతి స్థిమితం తప్పింది.. నువ్వు ఆ గాయాలని మాన్పి …మతిని సరి చేసావ్.. నీ గురించిన కృతజ్ఞత స్తుతిని చేసి … తనిక విశ్రాంతి తీసుకొంటానంది… అప్పుడే  నాకు ఇదంతా ఎక్కడో నచ్చడం లేదు.. కాని నమ్మాలని అనిపిస్తూ… కొంచెం నిద్ర పోయాను. ఆశ నల్లని ఇరుకుల్లో శ్వాసని అరగదీసి కొత్త ముఖం చెప్పుకొన్న కలని దుప్పటిలోకి చుడుతోంది.

పొద్దున్న లేచే చూసే సరికి .. ఉరి పోసుకొని ,,, దూలానికి వేలాడుతూ ఉంది. మెడ ఎముక విరిగి దీనంగా వేలాడుతూ .. ఎదపై కొంగైనా లేక .. రక్తపు మరకలతో..

నువ్వు ఆమెకి స్వస్థత చేకూర్చనంటే నిజమని నమ్మాను.. నీకు దాని అర్ధం .. మాంస గాయాన్ని మాన్పడమే అని మాత్రమే తెలుసని నేను అనుకోలేదు.. పిచ్చిదాన్ని.. నిన్ను ముందే నిలదీయాల్సింది.

కానీ నీకు స్త్రీ లోపలి విషయాలు అర్ధం చేసుకొనే తీరిక లేదు.. ఈ మాట నీకు చెప్పడానికి ఎంతో విచారిస్తూన్నాను. రాలి పోతున్న స్త్రీలు మా  ముందే ఉన్నారు.. నేను దీనికి మాత్రమే నియమింపబడ్డానని నా తల్లి నాకు చెప్పింది. మేము ఈ ఊరి చివర ఈ పనికి లేకపోతే … మీ కుటుంబాలు ఎంత మురికితో నిండుతాయో…  మాకు తెల్సు… ఇదంతా అర్ధం చేసుకోవాలని అనుకోకు.. ఎందుకంటే నీ నడక ఇక్కడే ఆగిపోతుంది.. ఇదంతా స్త్రీగా విశ్వ జాగృతిలో కనిపెట్టుకొన్న సమయ నిగ్రాణత ఒరిసిపోయి… యోనీ గంటల మాదక స్మరణ వ్యాకులపడ్డప్పటి దీపాలని ఊదేసి .. కన్ను నులుముకుని కాస్త ఓదార్పునే మరింత పొడుగ్గా సాగదీసి .. మా గొంతులు నిండిపోయాక.. ఈ దుఃఖాన్ని మీరు వినలేరు.. ఈ మాంసాన్ని మాత్రం కొనుక్కుని వెళ్లి పోండి ఇప్పుడే..

ఆమె విడిచి పెట్టిన మహా శ్వాస నేను ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు నన్ను పట్టుకొని వేధిస్తూనే ఉంటుంది. నీకిదేం అర్ధం కాదు.   

తీర్పుల కచేరీలో( కోర్ట్స్ )..

నీ భోదన విన్న తర్వాత .. దానికి ముందుకు ఒకేలా ఉంది. అదేమని నేనుసత్యాన్ని మేము ఏ గ్రంథ ప్రమాణంగా తీసుకోవాలి.. అలా ఎక్కడ రాయబడి లేదని … అతనే దేవుని కుమారుడిగా చెబితే నిరూపం కావాలి.. అది అసాధ్యమని   నువ్వు చెప్పావని వాళ్ళు అంటున్నారు.. వీరు వాళ్ళని వేలెత్తి చూపలేరు.. అందరూ వాళ్ళ వెనకే సర్దుకొని నిలబడి ఉంటారు. నువ్వు సూర్యుని వేపు చూసినంత మాత్రాన మాకు ఏ వంతెన కనిపించలేదు.. అదొక అనివార్య తేజస్సు.. కొంచెం దాచేయబడ్డ బెంగ .. క్షమా ఋణం మెరుస్తున్న మృత్యు శాల.

తీర్పు రాజు ప్రమాణాలతో ఉంటుంది.. రాజు … సంపూర్ణ ప్రమాణం.. దేహ ఖండిక లని తెగ్గొట్టి కలిపే మంత్రగాడు.. అతనికి అసాధ్యం లేదు.. ధర్మ ప్రమాణం వేరేగా ఉండదు. అతను ఎవరినీ విన్నక్కర లేదు.. అతనికన్నీ అలానే తెలిసిపోతాయి. మంచీ- చెడూ రెండూ కంటి ముందే అన్ని నిరూపణలతో జరుగుతాయి. నిన్ను నమ్మడానికి లేదు.. కనిపించని సత్యాన్ని నమ్మి .. మృత్యువు తర్వాత వచ్చే ఆకాశ నౌక నాకెందుకు.. ఆ స్వర్గ ద్వారాల వెనుక ఏముందో .. అది   తర్వాత విషయం.

 ఆకలి వేసినప్పుడు .. ఒక రొట్టె ముక్క అందించే పరిచారకుడు ఉంటే చాలదా ? ఇక్కడ కోసం…ఈ అమాయకత్వం  లోంచి నా శ్వాసని సమర్పించుకొంటాను.

 జైలులో( అమాయకులు) .

..పాపం నువ్వు కరుణించావని జైలు నించి బయటపడి ఇంటికి వెళ్లేసరికి… అతని శత్రువుకి ఈ మాట తెలిసి … అతని తల్లి ముందే కుమారుడని కత్తితో పొడిచి పారిపోయాడు. ఆ తల్లి కళ్ళని నమ్మలేక .. ఓ రాయి తో తన కళ్ళని చితక కొట్టుకొంది.. అప్పుడు ఆ తల్లి అంత పెద్దగా  అరిచింది తన బాధకి కాదు. ఇంకెవరినో  శపించే ఉంటుంది.

నీ వరం అతనికి .. అతని తల్లికి వరమా? శాపమా? ఇది నీకు తెల్సిన ఎప్పటికీ చెప్పవనీ తెల్సు.. నీ వెనక జనం రావడం లో రహస్యం ఎప్పటికి వస్తున్నా వాడికి అర్ధం కాదు.

ఇంట్లో సమానులన్ని చిందర వందర చేసాడు.. నూనె డబ్బాలు ఒలికి .. గాదె లో ధాన్యాన్ని తాగి.. ఆ పక్కనే వెళుతున్న పొయ్యి కౌగలించుకొన్నాక .. పెద్ద విస్ఫోటనా.. ఇంకెవరూ లోపలి అడుగు పెట్టాలన్న లేకుండా. లోపల ఉన్నదీ ఆ పేల్చిన వారు కాదు.. గాయాలతో మిగిలి అన్ని పోగుట్టుకొన్న వారు.  వాళ్ళకి ఇంకా ఏదీ అర్ధం కాకముందే బూతు కళ్ళతో గొంతు నొక్కేస్తారు.

పెళ్లి కూతురుగా ముస్తాబై  .. అమ్మ మెటికలు విరిచి మురిసిపోతూ .. కల్యాణ మంటపానికి నిమిషాలని లెక్కిస్తున్నప్పుడు  .. నీ మనుషులు ఆమెనీ ..ఆమె తల్లి ఒకే గదిలో… పందికొక్కులు దున్నేసిన నిండు పంటపొలం చేసి .. ఊపిరిని చివరి గుక్కగా నాకేసి… ఎవరో అడ్డం పడ్డ వారికడుపుల్లో గడ్డపారలు.. కళ్ళు పీకి గోడకేసి కొట్టారు.. జుట్టుని గొంతుకు ముడి తిప్పి గుమ్మానికి వేలాది దీసారు.

శిక్షాధికారి ముందు( పోలీస్ సిస్టం )..

భద్రత సరి లేదని… లేదా డబ్బు.. బంగారానికి ఆశపడి ఆ నేరస్తుడని జైలు నుంచి తప్పించారని.. ఇద్దరు ముగ్గురు అధికారులని ఉద్యోగం నుంచి తీసేసారు. ఎవరినుంచి ఎవరికీ ఈ భద్రత .. ఎవరు ఎవరిని రక్షించలేదని ఈ శిక్ష ప్రమాణాలు.. ఎవరి గొంతుని ఎవరు వినడానికి అడుగుతారు..

వాళ్ళ కుటుంబాలకి సొంత ఇల్లు కూడా లేవు.. అంతా వాళ్లదే ననే వెర్రి నమ్మకం…కాళ్ల కింద భూమి ఖాళీ అయినప్పుడే తెలుస్తుంది. గదుల్లో దాచుకున్న స్వర్గాలని ఏనుగులు రాత్రి రాత్రే తొక్కి నాశనం చేసాక …

రాజుకి తన కోటలో బలముంటుంది.. ప్రజలకీ జనం కలిసినప్పుడు వెచ్చగా ఉంటుంది… మరి అధికారులకి.. కాని అధికారం ఉన్నంతసేపు వాళ్ళకి ఆ కొవ్వు కళ్ళు మూసుకునేలా చేస్తూంది. ఎవరినీ తన మనిషి చేసుకోవాలనుకోరు.

రాజాశ్రయాల నుంచి రాత్రి కి రాత్రి ఖాళీ చేయించి బయటకి గెంటారు. చలిలో చంటి బిడ్డలనేసుకొని అడవుల దారి పట్టారు… వాళ్లకి కనీసం గుక్కెడు నీళ్లిచ్చే వారు లేరు. ప్రజల ఇళ్లలో వాళ్ళకి పిండాలు పెట్టారు. కథ ఎలాగూ మాసిపోతుంది.. అందులో ఎంతమంది అడివిలోంచి బయట పడతారు.. చలికి ఊపిరి గడ్డకట్టకుండా ఉంటుంది..

రాజుతో ఆలోచనల యుద్ధం ( యుద్ధ కాంక్ష )..

నిద్ర పట్టని శిధిల కాంక్షతో రాజ సింహాసనాలు.. భయం గుప్పెటలో కదిలే నీటి గాలులని దాటుకొని సందడి చెయ్యని అంతః పురాల్లో స్త్రీలు .. తమ గర్భాలని మూసుకొని ఆయాసపడుతున్నారు.. వినడానికి ఎవరూ లేరు … ఐనా బిడ్డలని బ్రతికించుకునే క్రమంలో వాళ్ళు గుడుల వెనక దాక్కునే ఉంటారు. ఆ బిడ్డ పెద్దయి..అదే తల్లిని తొక్కి రాజవుతాడు. నగరాలన్నీ దండోరాలతో నిండి .. ఏ కొత్త అతిధిని లోపలి రానివ్వరు.. ఎవరైనా వచ్చిన మట్టి దుప్పటి కింద దిబ్బలౌతారు. ఇంతకంటే ఇది మరోలా మారిపోదు. కథ కనబడక వెక్కి వెక్కి ఏడ్చిన తరాల కలవరంలో పాలన్నీ ఇంకిపోతాయి. మత్తంతా కరిగి .. దిశమొలల భయానక చిత్తడిలో దిగబడ్డప్పుడే .. వెనక నుంచి కత్తుల రధం …

సృష్టి మొదలవ్వడాన్ని ఎవరు చూసారో వారు కాగడాలతో ఆ నగరాన్ని అందిపుచ్చుకొని .. తడి పొడి రాళ్ళతో మెత్తిన నాలుగు మాటలతో కథలని కాదని గొడుగు పట్టిన విశ్వ నిద్రకి సరి చెయ్యని చీకటితో తడిపి అంతా అలుముకున్న చేదు మందుతో జన్మ మురిపంగా ఉండిపోయిన పునాదులు. కౌగిలిలో శిధిలమైన ఆశ్రిత తత్తరపాటు … చీకటి చెదరగొట్టిన క్రూరమృగాల అరుపు పెట్రేగి …చావు చివర నల్ల గుడ్డ కప్పి మీదకి తాడుని అల్లి …. కొత్త గుమ్మలని నించోబెడుతుంది.

రాయబారి నువ్వు చెప్పావని శత్రు రాజు దగ్గరకి శాంతి ఒప్పందం కోసమెల్లి ప్రాణం పోగొట్టుకున్నాడు  . అతనిని ఎలా నెగ్గాలనే యుద్ధ విద్యని తెల్సుకొని … రాజు కొడుకు తలని నరికి రాజుకి పంపారు.

ఆ రాయభారి భార్య .. శత్రు గూఢచారుల బెదిరింపులకు అలిసి పోయి … అందరి ముందు .. జనం నిండిన రోడ్డు మధ్యలో గొంతు కోసుకొని చనిపోయాడు.

వైద్య శాల లో ఓ కుష్ఠు రోగులకు పనిచేసే నర్స్ అనుసరించడం ..

అతని కళ్ళలో అప్పుడే ముగ్గుతో తుడిచి  వెలిగించిన గాజు దీపం లా వెలిగే కళ్ళు. ఆక్షణం నీ కళ్ళలో నీటి బొట్టు పగలడం ఎంత ప్రమాదమో నీకిప్పుడే తెలుస్తూఉంది .. నేను నిన్ను గర్భ సమీకరణాల పుట్టు సూత్రంగా చూడాలని ఇంకా ఆశ పడుతున్ననా ? నువ్వు ఎవరనే ఆరా తో నిన్నెందుకు నిలదీయలేదు.?

లేకపోవడంలోనే అంతా ఉంది.. ఉండటం లో ఉన్నదే ఉంది.

నువ్వొక రోగికి క్షణాల్లో కుష్ఠుని నయం చేసావని.. చేతి తొడుగులతో తప్ప ముట్టుకొని మేము .. నీవు నేరుగా ఆమె ఒళ్ళంతా తడిమామని తెల్సి.. ఇక్కడ ఎన్ని కళ్ళు కోపంతో మా మీద ఊస్తున్నాయో.. మేము క్రిమిగా చూస్తాం.. నువ్వు పాప ప్రక్షాళనగా…వృత్త్తి ధర్మoగా నేనే సరిగా ఉన్నానని నీకు తెల్సు.. కాని నీకు దానితో నిమిత్తం లేదు.

కొన్ని నెలలుగా వైద్యం చేస్తూ నయమవ్వని రోగులు కొందరు నర్స్  పై దాడి చేసి గాయాలపాలు చేశారు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు … వైదులకే వైద్యుడుగా కనిపించావు.. కాని నీకిది రోజూ దిన చర్య కాదు.. నువ్వలా రోజంతా స్పృశిస్తూ పోతే ఏం జరుగుతుందో నీకు తెల్సు..

నువ్వు చేతులు గాల్లో తిప్పి .. నీ కంటి ముందు కనిపించిన బాధని తీస్తూన్నావు.. సరే.. వాటి పునాదుల దగ్గరకి వెళ్లి నయం చేసే తెలివి తేటలు నీకున్నాయని నా అనుమానం.   నీకు నువ్వు చేసుకొనే ప్రచార దాహానికి అది అవసరం కూడా లేదు.

కన్న తల్లి తో .. మరణం గురించిన సంభాషణ..

ఇక సంధిగా సర్దిన నల్లని ఏకాంతం లో పడి .. దారీ తెన్నులు లేని విసుగుతో మరణ స్తంభాన్ని చేరినప్పుడు నువ్వు నేను చెదరగొట్టిన ఖాళీల్లో దొరకక తప్పించుకొంటూ దీర్ఘ శ్రమని కూలదోసావు. నీ  భోదనంత ఓ చావు కూడుగా మారుతుందని నేనెప్పుడూ అనుకోలేదు.

మరణం ఒక ఆది వ్యాక్య ప్రమాణం..కప్పి పెట్టుకున్న కంటి జీరలని తుడిచి  కొంచెం తిరిగిన శ్వాస పక్కగా రాలిన గుస గుసలు.. ఇంతకంటే వేరే చెప్పడానికి ఏం లేదు.. ఉండిపోయిన భయ వారసత్వాలతో నిలువెత్తు జ్ఞాన దీక్ష కంట్లో ఆరిపోయాక నాకు కొత్త మాటని అందుకోవాలని లేదు.

రేపు లేని నిన్న .. మరణపు ఎన్నో పేజీ?

పుట్టుక వెనక ఉన్న చావు.. కొత్త మాటని పొదిగి గర్భం లోకి విడిచి పెడుతుందా?

మృత్యువుని చీకట్లో ఉంచి అంత్యక్రియలు చేస్తే మనం రక్షించబడతామా?

అనివార్య సృష్టి నిద్ర లోనే మృత్యువు తిరుగుతుందా?

వడ్డించి వెళ్లిన సమయ మాత్రల గుజ్జుని ఎవరు కలిపి కలిపి తాగనిస్తారు?

శత్రు పొరలు రాలే విశ్వ నిర్దయ కంట్లోనే జ్వర దీక్షని తిప్పుతుందా.. ఇదంతా మృత్యువేనా?

విశ్వం అది దేవుని కనుసన్నల్లో ఏర్పడి ఇప్పుడిక అతని చేతులు దాటిన మనిషిని చూసి దీనమైన ముఖంతో కుదేలైన శ్వాస భ్రమణం ముక్కలై ఓర్పు చనిపోయిన సమాధులు.. తల్లిగా ఆ బిడ్డల రక్తం తో తడిచిన ఈ చీర ఇంతవరకూ ఆరా లేదు.. కంటి మీద నిద్ర వాలలేదు.. నువ్వు ఏ స్వరాగాన్నే మాట్లాడుతున్నావా .. అది వాళ్ళు అందుకున్నారని నువ్వు ప్రమాణాలతో నిరూపించగలవా?

నువ్వు నడిచిన దారి ఏ విశ్వాసాల్ని మనస్సులో నింపిందో .. అవేవి వాళ్ళకి మంచి చేయలేదు…నీ మరణాన్ని ఓ గుర్తింపు తో నింపుకొని… ఓ జాలి.. ఓ ద్రుష్టి భ్రమణ.. చరిత్రలో శాశ్వత స్థానం గురించిన విశ్వాసంతో నలిగింది.. కాని నీ వెంట వచ్చిన ఎందరో బిడ్డల శవాలు కూడా ఆ తల్లులకు దొరక లేదు. ఈ పోరాటపు అంత్యత ఏమిటో అర్ధం కాకుండానే మళ్ళీ మళ్ళీ దాడి కి గురయ్యారు .. చెప్పలేనన్నీ  పోగొట్టుకున్నారు….

 ఆఖరి విందు :

………..ఈ ఎండిన గట్టి రొట్టె .. నా శరీర భాగాలనుకొని తినండి.. మీ అమాయకత్వాలనీ.. దురాశనీ.. మీ కుటుంబాల కోసం చేసే డబ్బు ప్రయత్నాన్ని నేను అర్ధం చేసుకోగలను .. అయినా ఈ కడపటి విందులో … చేతులు  కడుక్కునే ఆ బావిలోకి చూసినపుడు మీకు జరిగిన ఈశ్వర దర్శనాన్ని అపురూపంగా చూడండీ …ఈ భూమి స్వర్గ ప్రవాహం.. సంగీత మాల .. గర్భ వెలిగించిన జ్ఞాన వీధి.. వాన పం డుగల పల్లకి.. కళ్ళు నిండిపోయిన పలకరింపు.. విశ్వగాత్రంతో కళ్ళలోకి కురిసే మంచు తెరల బొమ్మ. ఆశ్రిత ఛాయలు పర్చుకొన్న దీవెన  . కాని ఇవేవి వాళ్ళని కాపాడ లేదు..

 నీ మాటలు ఆ పైకి నడుచుకొంటూ వెళ్తున్నాయి. కథన విశ్వాసంలో పెద్ద రాక్షసి దాటించిన వంతెనల కిందుగా నడకలని మెలిపెట్టి దుఃఖ తీర్మాన రంగులు వెలిసిపోయాక .. సర్వమూ మసి పూసిన గోడల మధ్య దిగబడి రెండో రాత్రి ముట్టడిస్తోంది. సాగలించబడ్డ పాకుడు తనం ఊరేగి .. నిర్యాణ తొందరలు లేని ఉపేక్షని నాకేస్తూ.. తరుముకొస్తున్న దీక్ష కంకణ ముద్రాల్లో .. విగ్రహాలని కూల్చి … స్పర్ధ …

మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు నన్ను వెన్నులో పొడవండి…నరక ద్వారం నేనే ముందే మూసేసి …నేనక్కడ నిలబడి ఉంటాను… మీకు భయం లేదు.. భారం నా మీద వేసుకోండి.. . నీ మాటలు ఆ పైకి నడుచుకొంటూ వెళ్తున్నాయి. ఇదొక అగమ్య మాయని మింగేసే నిద్ర వారసుల ముద్దగా కలిపి.. కంటి లొసుగుల్లో పడి కనపడని .. చర్య వికారాలని కుదిపి దీక్షని లాగి పెట్టి మరో పైకి లేవదీసుకొన్న చిత్రాల మధ్య మసక కమ్మిన ఓర్పు పాడగా విప్పుతుంది.

మిమల్ని పరాయిగా మార్చే అన్ని నిరూప సత్యాలని నా లోపల వదిలేయండి.. క్షమా విరాగి తవ్వకాలతో పొడుచుకొస్తున్న విశ్వాసనీలం లో పోటుపెడుతున్న నిద్రల మధ్యనే మీ కలలని తాగే నీ ముందు నిలబడతాను. ఇది ఎప్పటికీ మరి మరకలు పడనీ జువ్వు మంటూ జ్ఞాన వాకిలి విప్పుకొన్న చలి మండలాలలో తప్పిపోయిన విసమయ ద్రోహం తోడిపోసుకున్న చీకటి.

వాళ్ళందరూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని.. పుట్టి పెరిగిన చోటుని వదిలి .. వాళ్ళందరూ దిక్కులేని వాళ్ళలా పరుగులు పెట్టారు. కొందరి వాళ్ళ  కత్తి కి దొరికి బలయ్యారు. రొట్టెలు రక్తం లో నాని.. కొన్ని చెవి ముక్కలు… నాలిక తెగిపడ్డ చోటు.. ఆఖరిగా నిన్ను పీల్చిన మాట.. ఇంకెన్నో కాళ్ళు.. వేలి ముక్కలు.. అంగీలు.. ఎంతమందికి వాళ్ళ వంటి మీద బట్టి మిగిల్చారో…

శిలువ.. పునరుత్త్సనాల మూడు రాత్రులు ; 

భయమూ.. వెలుగు .. సంపద – ఐశ్వర్యం .. స్త్రీ.. బిడ్డల గురించి..  బోధన. ఎవరు లోపలి తీసుకున్నారన్న నా ఆందోళన మోసేదిగా లేదని .. ముట్టడిగా ఉండిపోయిన శిధిలాల మధ్య కొడిగట్టిన జ్ఞాన రాశి కొద్దిగా నాకి పోయిన విశారన్తీ స్థలంలో … కొంచెం అడుగంటిన  తీరుబాటు నడకలు. అటు తిప్పి శ్వాసని అల్లి తప్పుకొంటారు…..ముడులు మరి చెందీ చెందని అనుమానాల్ని దాటి కొత్త వలసలతో ఊడిపోతాయి

మృత్యువు ధరించిన విశ్వాస ప్రమాణం వదులై .. కొన్ని పొగ గొంతులు కమ్మిన దీర్ఘ గదుల్లో .. తీర్ధ సంకల్ప శక్తులు తెలియని ఎత్తుల్లో పడి వాళ్ళు కొత్తగా మార్చి పెట్టుకొన్న శిఖర ముంపులు తలలో విరజిమ్ముకొని.. అభయ స్థావరం కనిపించని ఈ ఆమ్ల లోయల్లో పడి ముక్కలైన పోలికలతో .. మహా వినాశ దర్శన ఏకరవు పెట్టే చిత్ర జ్వరం కమ్మేసిన ఎత్తుగడలో ఊడదీకుకొన్న నిలువు నడకలా ఆయాసం పొగరుగా మెలి తిరిగింది. నులిమేసిన చూపుల వరదతో కమ్మేసిన దీపాలు…..

ఎవరు లోపలి తీసుకున్నారన్న నా ఆందోళన మోసేదిగా లేదని .. ముట్టడిగా ఉండిపోయిన శిధిలాల మధ్య కొడిగట్టిన జ్ఞాన రాశి కొద్దిగా నాకి పోయిన విశారన్తీ స్థలంలో … కొంచెం అడుగంటిన  తీరుబాటు నడకలు. అటు తిప్పి శ్వాసని అల్లి తప్పుకొంటారు. తనని మించి బరువైన శిలువ మోసుకొని… మూళ్ళ కిరీటం రాజై గుచ్చుకొంటూ… ద్రావిత మృత్యు నీలంలో ఓలలాడిన మాంస విరాగి నడక లో .. ఓ రక్త తాండవ నిస్సహాయతని చీర కొంగుతో తుడిచాక ..

దీన స్థితి మంగళాల మధ్య .. క్షమించాల్సనింది ఎన్ఱు ఎవరిని … ఎవరు ఎవరికీ శిక్ష విధించారు.  అరచేతులు .. కళ్ళు మేకులు దిగ్గుట్టుకొని అరిచేటప్పుడు … ఆ తాండ్ర జీరతో నిండిన ఆగ్రహం ఎందుకు భూమి చేరలేదు. అనుగ్రహ పాత్రుడుగా లేని విశ్వాసపు చివరని ఎవరు తెగ్గొట్టి శిలువని నించో బెట్టారు. ఎందుకా ఆ శవాన్ని దాచి ఉంచాలి… కాచి రక్షించే దేహ అనుకృతి రంజన ఇక్కడ మండుతున్నప్పుడే మన దేహాలని ఎగరేయాలి.

శవ జాగారం.. పెద్ద బండ వెనుక ఏం జరుగుతుందనే విశ్వాస నడకలు.. నిద్ర లేవదీసిన ఆందోళనలు…ఎవరు ఎవరిని పట్టుకొని మూడు రాత్రుల్ని నిర్ణయించారో.. ఏ కబురు మరో మృత్యు దండనై కమ్మేస్తుందా?  శిక్షుతుడి మూడు రాత్రుల ఆనవాళ్ళని కరిగించి పైకి చేరిన దేహ వితర్క మార్జన మొదలయ్యే తాండవ విస్కృతి.

మొదటి రాత్రి;

మరణం తో మనం పోగొట్టుకొంటున్నది.. ఇలాగే తెలియాలని లేదు..మీ  లోపల నడిచే కలలని తొక్కుకొంటూ నేను.. దీపం జార్చుకున్న పోలికలతో… హృదయ స్థావరం కొల్లగొట్టిన శత్రు సంతతిని క్షమించి .. నస ఛాయా నెలలని పోత పోసిన దిద్దుబాటుతో కవ్వించే మాటలని చిలికి .. నిద్రని వదిలేసుకొన్న మంత్ర గాలితో సాయం చెయ్యని ఓపికని నొక్కిపెట్టి.. స్నానించే విశ్వ గమనంలోకి.. నేను నా తండ్రి తోడు తెచ్చుకొని.. కాస్త ఊపిరి పోతలని ఇమ్మని వేడుకొంటాను.. అతను కరుణామూర్తి… నా మాటని ఆలకిస్తాడు.. ఆకాశం లోంచి అనేక బంగారు దారులు ఈ గుహని చేరుకొంటాయి..

మీరు నాకోసం అప్పుడే పాడండి.. నేనా పైకి నడిచివెళ్లడాన్ని మీరు చూస్తారు.. పైకి చేరి.. జన్మ చక్ర చైతన్యం కోసం నేను ఏటవాలుగా ఉండే అమృత సరసులో ఓలలాడి… తిరిగి దేహం అన్ని ఛింతన్య విశ్వాసాలతోనూ పోండి తిరిగి నేను భూమి చేరుకొంటాను.. నాకు తెల్సు.. మీరు నా నిర్జీవ శరీరాన్ని కాపాడడానికి ఎంత రక్తం చిందించాలో .. ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసి పోతాయో… కాని ఆ త్యాగాలు వృధా కావు.. మీ ప్రతి చర్యని నా తండ్రి గమనించి ప్రతిఫలం అందిస్తాడు.

నిన్ను … నీ మాటలని నమ్మి… ఆకాశం లో అమాస తాండవాన్ని చూసి…  నీ శవానికి గుహలో పరిచర్యలు చేసి.. పరిమలతో నింపి.. నూతన వస్త్రం చుట్టి.. పాటలు పాడి.. ప్రసాదాలు ఉంచి… బయటకొచ్చి .. ఇద్దరి తలలు.. ఒకరి చేతులు నుజ్జు నుజ్జు చేసుకొని గుహని మూసే బండ రాయిని సర్ది… వచ్చిన శత్రు వీరులతో యుద్ధం చేసి ముగ్గురు ప్రాణం పోగుట్టుకొని .. నీ శవాన్ని కాపాడారు.. ఈ కాపాడిన వాళ్ళ శరీరాల్ని కుక్కలు ఛిద్రం చేసాయి.. నక్కలు ఈడ్చుకెళ్లాయి.. కొందరి తలలూ దొరకలేదు.. నది ఎర్రబడి ఇంత పెద్ద రంకె వేసింది.

రెండవ రాత్రి;

ఇదంతా ఒక విజృభించిన నమ్మకం .. నువ్వు మాకు ఇచ్చింది అదే .. గుడ్డి నమ్మకం.. ఆ నమ్మకం శిలువలపై ఆవిరి అవుతున్న ఎవరూ నమ్మరు.. అనర్ధ సంకేతంగా ఉండిపోయిన నిరాశలు చుట్టేసాక వేడుకొని… ఐహిత శక్తులతో దేవా భూమి సంగతిని పాడుతూ మేము దారి తప్పిన శిక్షకులమయ్యామని… వేశ్య వాడల్లో తిరిగిన… మీరు ఆయనని మళ్ళీ చూసారని… నాలుగో అంతస్తు కిటికీలోంచి మా కాళ్ళ దగ్గరకి దూకి … మేము ఏదో చెప్పేలోపే ప్రాణం విడిచింది.. నీకేం కావాలి.. ఇలా ప్రాణాలా ? కనీసం ఈమె కైనా స్వస్థత చేకూర్చి ప్రాణం ఇమ్మని అంతమంది జనం ముందు నిన్ను వేడుకొన్నాం.. కాని నువ్వేం చెయ్యలేదు… వాళ్లంతా మా మీద దాడి చేశారు.. చెల్లా చెదురయ్యాం.. సిగ్గు పడ్డాం..

మమ్మల్ని మేము తిరిగి బట్ట తో చుట్టుకుని నీ ముందు నిలబడి.. మేమింకా మా మాటలు నీకు చేర్చే అర్హత సాధించలేదని సరిపెట్టుకొన్నాం. ప్రాణ సరస్సులో తేలియాడే నువ్వు .. ఈ సర్పయాగం నరకాలని గురించి ఏ మాత్రం తెల్సుకోగలవ్.. నాకు తెల్సు.. నీ శిలువ మోతకన్నా ఇది నరకం కాదని…. మా తలలంతా నిండిపోయింది క్షోభాల తలపోత మాత్రమే.. నువ్వు ప్రతీ క్షణం అదే ఎరుకతో మమ్మల్ని నీ దారిలోకి తెచ్చే ప్రయత్నం చేసుంటావని ఎవరో అంటే .. వాళ్ళపై మేము అరిచాం.. ఎందుకంటే ఈ రహస్యం మాకు మాత్రమే తెల్సిఉండాలని…

ఎన్నో నష్టాలు జరగడం మొదలవుతాయని .. ఇదే కాదు.. మా లోపల ఏ ఆలోచనలకి అవకాశముందో అవన్నింటికీ నువ్వే ముందే సమాధానాలు సిద్ధం చేసావని మాకు తెలియంది కాదు. కుళ్ళిన శవానికి దగ్గరగా ఉండటం వలన రోగం పాలయ్యారు.. దోషులని రాజు శిక్షలని దండోరా వేయించాడు.. ఒక వేశ్య నిన్ను నమ్ముకుని .. ఆత్మ శుద్ధికై పలవరించి నదిలోకి  దూకింది.. ప్రసాదం నువ్వు స్వీకరించక పాడైన వాసనా.. ఒక పాము చూస్తుండగానే లోపల దూరింది … అయినా మేము రాయి కదపలేదు.

మూడవ రాత్రి ;

హెచ్చరికలు .. మరణ వాంగ్మూలాలు .. తుది తీర్పులు దేశ వలసలు.. బహిష్కరణలు.. ఈసడింపులు.. చెప్పు దెబ్బలు.. గాడిద పై ఊరేగిస్తూ.. వీధుల్లో ప్రజలు మా మీద ఉమ్ము ఊయడాలు… తిరిగి తిరిగి చేరుకొనే మొదటి గది.. విశ్వాస సందర్భాలు లేని ఇరుకు కన్నులో జరిగే మహా ఘటన .. సర్రున దిగిన కత్తి.. కొంచెం కూడని కరగని.. నమ్మని.. శత్రు ధూళితో చుట్టేసిన కంటి మూటలు.. ఏ కొండని ఈ రాత్రి ఎక్కి .. సూదుల్లా పొడుచుకొచ్చే ఆ కొండలపైకి దూకాలి.. నడుస్తున్న కాళ్ళని పట్టుకొని.. అరికాళ్లలో మేకులు దిగ్గొట్టి పరుగు పెట్టమంటున్నారు. రక్త జలన మాటని కాల్చి నాలుకపై ఆడుతుంది…

మరో వైపు నువ్వు .. నిన్ను గురించిన నక్షత్ర కబురుని తీసుకెళ్లి ప్రపంచంమీద విసరమంటావు. కనీసం ఈ ఊపిరంతా నీ కోసమే ఇచ్చేస్తున్నప్పుడు… నీ స్వర్గ రాజ్యం చేరే వరకైనా మమ్మల్ని కాపాడు. అడగడానికి సిగ్గు పడటం లేదు.. అమ్మని ఇంకొక గెరిట అన్నం వడ్డించమని అడగడానికి మొహమాట పడినట్లే.. కాని ఇదేదీ సరిపోవడం లేదు.. మా నిద్ర మాది కాకుండా పోయిన అలసట .. మా ఆత్మల ఆచూకీ ఇక నీ జోలె లో క్షేమమని మరెవ్వరో చెప్పడమెందుకు? సరాసరిగా .. ఏ ఆర్భాటపు తొణికిసలు లేకుండా .. విశ్వమంతా వెలుగుతో నింపి.. నీ రాక స్పష్టం చేస్తూ రా .. మేము అదే నమ్మి .. అదే చెప్పుకొంటూ వస్తున్నాం. భయాన్ని నమ్మకం లోకి ఏ ఆధారమూ లేకుండా దట్టించి ఇది మమ్మల్ని మేము మోసం చేసుకోవడంగా మిగల్చకు.  

కొంతమంది గురువులు మమ్మల్ని కలిసి.. ఓ వేళా మీరనుకొన్నది జరగకపోతే .. జనమే .. లేదా రాజే మీ ప్రాణం తీసే అవకాశం ఉంది… మేము నిరాకరించాం.. నిన్ను గురించి మమ్మల్ని నిలదీసి అడిగినప్పుడు మాకేం తెలియదనే చెప్పాము.. దానికై ఒకరిద్దరి కాళ్ళని … కళ్ళనీ… గొంతునీ.. అందమైన చేతులనీ … ఒకరి ప్రాణాలనే రాజు అనుచరులు తీసుకు పోయారు. మేము ఆ బందని జరిపాం.. బట్ట ఉంది.. ఆ లోపల నీ దేహం లేదు.. కాని నీ పునరుత్త్స ఆచూకీని అడిగినవారికి మా దగ్గర సమాధానం లేదు. అయినా నీ సందేశం ఆకాశవాణి నుంచి .. మేము విడిపోయి ప్రపంచంలోకి వెళ్లి ఏం చెప్పాలనే లోపు.. నీ ఆత్మ రూపం.. భూమికి చేరుతుందని నమ్మబలికాం .. కాని దాని గురించిన ప్రశ్నలికి మా దగ్గర ఏ సమాధానంలేదు..

మహిమ ;

నమ్మకం గుడ్డిగా ఉండకూడదు. మహిమ ఎందరినని  మార్చగలదు ? 

కొన్ని నిర్వచనాలు ఎర్రగా పండి విచ్చుకొని .. ఒక భయాన్ని ఎందుకు ముందు నిలుపుతాయి.. భయం తర్వాత నువ్వీ అభయం ఇవ్వడం మెందుకు? దానిని లేకుండా చేయొచ్చుగా.. అన్నప్పుడల్లా .. నువ్వు మా ముందు నిలిపేది.. శిలువనేగా ? కొంచెం ఇలా వీలుకాని చావు తొడుగు ఊపిన ముఖాలతో చిందిన విశ్వాసం కిందికి లాగిన సర్పదోషం తో కదిలే నిద్ర గంటలు.

విప్పిన దేహ భ్రమణ లోని స్కలనదళం ..ఉరిమిన చీకట్లో వర్ష ముడిన వదులు చేసిన జుట్టు విరబోతతో కాలు పట్టని వీధుల్లోకి కురిసిన చేపలు ఎన్ని రోజులు ఆకలిని తీరుస్తాయి.. తప్పిపోయిన గొర్రనే కసాయివోడు తీసుకుపోయి ఓ చెట్టుకు కట్టేసాడు.. కాని అది కొమ్ములతో పొడవగానే చెట్టు కూలి… అది మాత్రం ఆత్మ లోపలి స్వేచ్చని పొంది ఆకాశంలో మాయమైంది.. మిగతా గొఱ్ఱలన్ని బిరియానీలో అరుస్తున్నాయి. అదొక మధ్యాహాన్న ద్రవమని  ఎవరో తలపడుతూ .. తలని అటు తిప్పి చెవిలో నిప్పుల ఊటని పోస్తారు.

మహిమ ఓ తాత్కాలిక ద్రుష్టి భ్రమణ .. ఉంది .. ఉండీ లేదు.. కాదు.. కాకుండానే ఉంది.. లేదు అంటే అక్కడే ఉండే ఉంటుంది ఒక్కప్పుడైనా ?  కాంక్షల రెండో గతి ముద్రని సంకల్పం చెప్పుకొని..ఇదామితం కాని జన్మ చలన మంత్రాన్ని చదివి.. బొమ్మ మార్చుకున్న నిద్ర గడపలో .. మొండిగా చేర్చి పెట్టుకొన్న ఖాళీ నిద్రలే అక్కడ దగ్గరగా మాటని చేరుస్తాయి.

రోజూ ఆకలికి ఓ రోజు పంచిన రొట్టె ,, ద్రాక్ష సారాయి దేనిని తడుపుతుంది.. భయంలోకి ముంచడం తప్ప… స్వర్గం అంటే ఓ గాలి మంట .. చలి వస్త్రం.. చల్లని పొగలు వదిలే కాష్టం.. దేహం వాదులు గదిలో వంకరవుతున్న తూఫాన్ మండలాల ఒత్తిడిని కడిగి .. బొట్టు పెట్టి .. అటు తిరిగి స్పృహ తప్పుతుంది.. అదే సరిపోయిందిగా ?

స్వర్గం లో తల్లి ;

ఆమె ని కలిసి మళ్ళీ పుట్టుక కోసం గర్భాన్ని అడగడం. ఆమె నిరాకరించడం.. వాళ్ళ భాషణ…

             విశ్వ నిరీక్షణ ప్రసాదించిన జ్ఞాన భూమిలో పగిలే అగ్ని పర్వతాలు.. భూ కంపాలు… ఏడూ తాటి చెట్ల ఎత్తు లేచే సముద్ర కెరటాలు.. విసుగు ముట్టడిలో కదిపి చుట్టుకున్న ఇసుక తోరణాలు.. ఆమె ముఖం నిండా నిండాలని మోసిన .. పుండ్లు.. సగం తెగిన కన్ను… మడత పడ్డ నాలిక .. ఒక చెవి లోపల నుంచి తొలచి.. యుద్ధారావం   బిగించి వేలాడదీసిన కత్తి.. తల్లి అలా కాక ఇంకెలా ఉంటుంది.?

తల్లి;  

తిరిగి రావడమెందుకు? ప్రతిఘటన లేకుండా నిస్సహాయంగా శిక్షని ఒప్పుకుంటే … ఏంటి నువ్వు చెప్పాలనుకున్నది.? అద్భుతం .. నీ కేవల వ్యక్తిగతం .. నీ ఉనికిని గొప్ప చేసుకోవడం..కానీ నిన్ను అనుసరించి .. ఒక బలమైన వ్యక్తి తయారవుతాడని నేను నమ్మలేక పోతున్నాను.. అలా నువ్వు ఎప్పటికీ లేవు… ఉండవని తెలియజేసే నా ఎరుకల అరుపుని నువ్వు ముందే మింగేస్తావని నాకు తెల్సిన.. ఆ పని చెయ్యకుండా నేను ఆగిపోను.. నేను అలానే నిర్ణయించబడ్డాను….

అతను;

 నాకు గతం లేదు.. భవిష్యత్తు అసలే వద్దు. ఉనికి కొందరి సంశయాలని తీరుస్తుందని… మళ్ళొక్కసారి నీ గర్భ సంచీని మాత్రమే నేను అడుగుతున్నది. ఆ పనిని యుగాలు గుర్తు పెట్టుకునేలా జనంలో .. నన్ను అనుసరించే మహా ప్రవాహం కలిపి .. శాశ్వతం చేస్తాను.. తల్లి ఈ ఒక్కటీ అనుగ్రహించు.

తల్లి;  

అలా నువ్వు ఎప్పటికీ లేవు. నీ దేవుని వ్యాక్యాల సంగతి నాకు ముఖ్యం కాదు..

 నగరమంతా నిన్ను అనుసరించ వచ్చిన వాళ్ళ సమాధులతో నిండి పోయింది.. ఎన్ని వేల గర్భ సంచీల ఉసురు ఇది.. ఎన్ని ఇంకిపోయిన కన్నీళ్లు చెప్పిన కథలివి.. నిన్నెoదుకు కలవరపెట్టడం లేదు.?

ఏదో కొంచెం ఇచ్చుకొని.. కొంచెం బతిమాలుకొని.. బతుకుతున్న వాళ్లు కాస్త .. నీ మాటలతో అవన్నీ తెంచుకొని నీ కోసమొస్తే .. నువ్వొక నిస్సహాయుడిలా శిలువని మోసావు.. రక్తం లో ఓలలాడేవు. ఇదా .. నిన్ను నమ్మి .. కుటుంబాలని.. ప్రాణాలని వదులుకొని వచ్చిన వాళ్ళకోసం నువ్వు ఇవ్వగలిగేది.?

వీరుడు దొరకని యుద్ధ క్షేత్రం లో మనుషులు కూలిపోవడానికి ఎంత సమయం కావాలి?

ఇది కేవలం నీ చేతులకి .. కాళ్ళకి … మేకులు దిగడంతో ఆగిపోతుందని నువ్వెలా అనుకొన్నావ్?

అదొక మాంస కబేళా ఇప్పుడు.. శవాలు పాతిపెట్టడానికి కూడా మనుషులు మిగలలేదు.. ఆ పుండు ఆరడానికి .. మరో పసిబిడ్డ జన్మ నివ్వడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు.. కనీసం అదైనా సవ్యంగా జరగనియ్యి… మోసిన నెలలన్నీ   పూర్తిగా  పండి వాళ్ళ ఒడి నిండనివ్వు…

కావాలంటే .. నువ్వు గాలిలానో.. ధూళిలానో.. నిప్పులానో …  నీరులానో కనిపిస్తే వచ్చే నష్టం లేదు.. నువ్వు అంతమాత్రమే ఉండి.. నీ సహాయనిరాకరణతో వాళ్ళని వాళ్ళు సర్దుకోనివ్వు.  

నా గర్భ సంచీని మాత్రమూ నీకు ప్రసాదించే ప్రసక్తి లేదు.. ఇక ముందూ ఉండదు. దీనికై నీ మరో ప్రశ్నని నేను ఆశించడం లేదు..

అయినా నువ్వు నన్నింకా చేరడం అసాధ్యం.

                                                                                           …………