
సంపూర్ణత .. సంగీత మాల
అదొక విశ్వ మాయ కమ్మిన సంపూర్ణ దేహపు త్రిగుణ పాతకం… ఒక్కసారి వేళ్ళాడుతూ … ఒక్కసారి కంటిని ధూళిగా చుట్టుకొంటూ … జన్మ సరంజామాని మార్చి పెట్టుకొన్న నిశ్వాస ముద్ర తుడిచాక .. నిలువు ఊహ లేని సంక్షోభ తమకం ఆరిపోతూ … ఒక కొత్త తీరుని చెప్పుకోలేని ఖాళీతో కదిలి … సఫలిత తురుము.. పోలిక జార్చుకున్న ముఖ రాశుల్లో పడి అదే సంగీతమని…
రాసలీల లోంచి తప్పుకు పోయిన దీక్ష శిఖరం ఒరిగి .. పదునైన గారడీ నిద్రలతో మోగే దీప సమాధిని తాగుతూ … ఓర్చుకోలేని మంద్రతల నిద్ర తీర్పుతో మోసుకొన్న తీర్ధ గాలిని కవ్వించే ముఖాలన్ని తాగి .. మూర్చన కట్టిన దిశా పగటిని కాలుస్తూ.. పోటు పెడుతున్న ఆయాస కారణాలు మెత్తని దుఃఖ సరిపోతని పోల్చుకోవడమే … సంగీతం..
అసాధ్య శీతల సత్యం పై కన్నుని చిలకరిస్తూ మోసగించే నిద్ర విపరీతం లోని శరీర సత్యం లోకి చూసి కాల్చిన ఔషధ మూర్తుల కౌగిలి .. మరో శ్వాస తీర్మాన రాశులని కూలదోస్తూ … తనకని మరో ఉనికి లేని శాశ్వత ఆ ముఖ ఒత్తిడిని కుదుపుతూ వర్షించే… సంగీతం…
అప్పటికి ఎన్నిసార్లో తనని కాపాడటం … ఏది ముందూ… వెనకలుగా చెప్పుకోదు. సిగ్గు పడి దీర్ఘ నిర్జన రాశులు పోసిన ఒత్తిడితో .. విరిగిన మురిసిపాటుతో దిగ్భ్రమ పెట్టుకొన్న ముహూర్త సవరింపు.. తీగల్లో అమరాక గొంతు అనుసరిస్తుంది. కల అనేక శిధిల దశలని దాటి … పెద్దదైన సవ్వడితో కలబడి.. నిస్సత్తుని మించి లొంగిపోతూ అక్కడ కనిపించే దృశ్య ముఖాలన్ని అందుకుని జారుతున్న ధార … మళ్ళీ సంగీతమే…
పదేళ్ళయింది .. ఎప్పుడూ అతని ప్రవర్తనకి , మాటలకి, చర్యలకి, అలవాటు పడలేదు. అతని మాటల్లోంచి కొన్ని…
ఉబికిన ఆందోళనతో చనిపోయిన చోటుని పదే పదే చేరుకోవాలంటాడు..
ఒక్కోసారి కనిపించదు.. ముందు వెళ్లిన చోటులో దొరుకుతాడనుకొంటే అది తప్పే అవుతుంది.
ఏ రోజు తిరిగి ప్రకృతిని కలిసిన… జ్ఞాన భిక్షని పొందాలంటాడు…
గురువు లేడు .. ఈ సృష్టిలో… అవకాశమే లేదు.. అలా చరిత్ర మనలని మోసం చేస్తుందంతే…
ఇంకొకరిని మనం ప్రేమించడం లేదు.. మనలోని మరొకరితో మనం దగ్గరగా ఉంటున్నామంతే..
మృత్యువు కి సమీపంగా వెళ్లగలిగితేనే మన లోపలి సంగీతానికి సరైన దారి దొరుకు తుంది…
చీకటిని కడిగి ఆరబోస్తున్న వాన సముద్రం దాచుకున్న సంగీతపు కుండలో ఉంది… ఇంకా లోతుగా గమనిస్తే ఆ కుండ నా సమాధి పైనే ఉంది
ఇలా ఉండేవి .. సత్యనివేశ్ మాటలన్నీ..
సత్యనివేశ్ మాటల్లోంచి మనం అతని ఏజ్ ని కూడా అంచనా వెయ్యలేం.. 32 ఏళ్ళని నాకు దొరికిన ఒకటి రెండు డాకుమెంట్స్ వలన మాత్రమే అనుకోవడం … ఇంకే విధంగానూ అతనిని మనం ఊహించలేం.. అతని ఈ భూమి మీద సంగీతం కోసం శతాబ్దాల ముందే వచ్చి ఇక్కడ తపస్సు చేస్తున్నాడా? అనిపిస్తుంది…అతని పాటలన్నీ … ఓ ప్రవాహ ధార,,, మనం ఏదో కొంచెం మాత్రమే అందులోంచి తాగగలుగుతాం…. అనిపిస్తుంది.. ఇక దానిని నుంచి ఏం వస్తుంది … ఏం రాదన్న నిమిత్తం లేదు. నిజానికి నేను కోట్ల రూపాయలు మోసం చేసి తీసుకెళ్లిన … ఒకటి అతనికి తెలియక పోవచ్చు… రెండు .. తెలిసినా… నవ్వుతూ .. ఇట్’స్ ఓకే… అని అనగలడు.
అతనిలో ఒక కంగారు కాని .. అలసట గాని .. ఎప్పుడూ చూడ లేదు.. ఎప్పుడు నిద్ర పోతాడు … ఎప్పుడు తింటాడనేది … ఊహించడం కష్టం.. అతనిని బతికిస్తున్నది… నడిపిస్తున్నది.. ఒక మహా శక్తి గా అతనిని నా ముందు నిలబెడుతున్నది … సంగీతమంతే … అతనొక మాంస దేహం కాదు.. సంగీతం పూనిన ఆత్మ.. కైవల్య ప్రాప్తి కి నాకు దొరికిన ఓ జన్మ సాఫల్య మంత్రం.. నా లోప్లలి సర్వ శక్తుల ఉనికి.. అజామర సంగీత సాధకుడు….
తనకి ఊహ తెలిసాక .. అది అతనంతట అతను పెట్టుకున్నదే ఆ పేరు.. ఎలా మ్యూజిక్ అతనిలోకి ప్రవేశించిందో తెలియదు.. ఓ మ్యూజిక్ డైరెక్టర్ అతనిని శరణాలయం నుంచి తీసుకెళ్లి తనింట్లో పెట్టుకొన్నాడు… అతనెన్నో సినిమాలకి మ్యూజిక్ ఇచ్చి…సడన్ గా ఆపేసి.. ఆస్తి అంత సత్యనివేశ్ కి రాసేసి మరి కనిపించలేదు. నేనెలా అతని లైఫ్ లోకి అంటే.. అది ఆ మ్యూజిక్ డైరెక్టర్ చలువే.. నేను అనాధనే.. ఆయన ఒక్కటే కోరాడు… నన్ను…. ఏం జరిగిన అతని సపోర్ట్‌ని వదలొద్దని.
ఒక సినిమా డైరెక్టర్ నాకు ఈ విషయం చెబుతున్నప్పుడు .. నేను నమ్మలేక పోయాను.
………………………………….
పూర్ణ కుంభం నుంచి ఎగిరొచ్చే నిప్పు ముద్దలు.. తలపడే దేహ రుచిని మరిగించి సాయుధ్య ఏకీకరణం లో పది ముక్కలయ్యే విశ్రాంత దీపం ఒరిగిన మాటల మధ్యనే ఉంటూ మనది కాని జ్ఞాన వాహి గరీమ ని ముద్దాడే తాండవ నిజాకృతిని మోసుకు తిరుగుతూ … సడి చెయ్యని నిర్భయ ఏకం లో వివిధాలయ్యే .. సంయోగ సమర్పణ ఎక్కీ దిగుతూ … కొంచెం మాసిపోయిన సాయంత్ర బిగిలి పట్టుతప్పిన నవ్వు… ఇది మరోసారి నాన్నునాకు దూరం చెయ్యదు.. దగ్గరకీ చేర్చి అడగదు.
ఎవరిదో cremation జరుగు తున్నప్పుడు… ఈ డైరెక్టర్ దగ్గరకి వచ్చి.. చెయ్యి పట్టి లాగి… ఓ మట్టి దిబ్బ మీద కూర్చోబెట్టి… మొత్తం పది పాటల ట్యూన్లు అతను మొబైల్ లో రికార్డు చేసుకుంటుంటే వినిపించాడట… అవి అతని మూవీ script కి పర్ఫెక్ట్ సరిపోయాయట.. సాహిత్యం రాయడం ఐపోయాక … కేవలం 10hours లో స్టూడియో లో ఫైనల్ ట్యూన్ చేసాడట… ఎంత అని అడిగితే.. ఏం మాట్లాడకుండా … నా పేరు చెప్పి పంపించాడు.. నేనన్న amount వాళ్ళు ఇచ్చేసారు. వీడిక దారిలో పడ్డాడు.. ఓ మేనేజర్‌గా ఇక నేను ఓ మ్యూజిక్ డైరెక్టర్ని ఇండస్ట్రీకి ఇచ్చేసానని గర్వపడ్డాను.
కానీ మర్నాడు నుంచి ఆరు నెలలు అసలెక్కడా అడ్రస్ లేడు.
ఎవరో అన్నారు.. ఇలాంటి వాళ్ళు ఇంతే.. మాటకి ఇంకొక మాట అందిండానికి దొరగారు. ఏదైనా పెద్ద పని వీళ్ళని కలుపుకొని అనుకొన్నామా ఇన్ అంతే… చచ్చినట్లే.. అది జరిగినట్లే.. నేను పట్టలేనంత కోపం తో వాడి చెంప పేలగొట్టాను… నీకసలు అలాంటి వారి కోసం మాట్లాడే అర్హతే లేదని…
ఓ సాధువులా కాషాయం లో ఓ తెల్లవారుజాము .. ఎవరో స్వామిజీ తీసుకొచ్చాడు.
విశ్వ నిషాదం నింపుకున్న మృత్యు ప్రేమికుడి తపనని విన్న శ్వాస శక్తులు …కనబడే సృష్టి ముహూర్తం కాదని … పై గడపలో సర్ది పోయిన చీకటి ముసురులోంచి.. భగ భగ లాడుతూ మారె లేని సంతాప కీర్తన మూర్చిల్లన జాము నుదిటిపై ఒప్పుకోలేకపోయిన అసలు సంధి తీర్ధాల గట్టు.. పెదవి ప జారిన కన్నీరు. నాభీ సమతలంలో కట్టిన గంట
మౌనంలో ఉన్నాడని… కానీ ఇంటికి తీసుకెళ్లామని అడిగితే … తెచ్చానని చెప్పాడు.
అతని కొన్ని వందల పాటల ట్యూన్ రికార్డ్స్ నాకిచ్చాడు.. జాగ్రత్తగా భద్రపర్చమని… వీలైతే ప్రపంచానికి పరిచయం చేయమని… అవన్నీ .. మృత్యు విన్నపాలు… నడక .. వీర భూమిలో కాష్టాలు… అక్కడే మృతు ధ్యానం లో ఉన్న బిస్మిల్లాహ్ ఖాన్ సహనాయి.. కొన్ని వేదం మంత్రాలకి భాష్యంగా .. సృష్టి సౌండ్స్ ని (అడివిలోంచి తీసుకుని) మిక్స్ చేసి.. దానికి సాహిత్యమిచ్చి.. అది ఏమిటో అర్ధం కాలేదు… పాటా .. పద్యమా.. పద్య నాటకమా.. సంగీత రూపకమా.. వాటికి సాధారణ సాంప్రదాయ పద్ధతి అంటూ లేదు.. అలా అని అది భారతీయ సంగీతం కాదని తోసేయలేం.. మహా గందరగోళం.. అంతే వదలని ఆకర్షణ … తనే అలాంటివాడు.
సాగలించిన నిద్ర ఊర్లు … ఉమ్మడి సాఖీల కొండపై కన్నుని కడిగి కొంచెం అవశేష నిండుతనాల్ని మోతెక్కిస్తూ అక్కడే గడిపిన ముసురు మండలం లో నూరిన కలలని మోహరిస్తూ యుద్ధ అనుసరణ.
వాళ్లే అతనిని ఇన్ని నెలలు చూసుకొన్నారు.. అందుకు ప్రతిగా వాళ్ళు అతనినించి తీసుకున్నది..
వాళ్ళు అతనినించి అంతులేనంత స్థిమిత వైరాగ్యాన్ని .. సమయ శాంతి తాండవించే ముహూర్త స్థలాన్ని.. వ్యాకుల నిద్ర తోడుతో లిపి మూర్తిని కన్న దిగులు దేహ జఠరని… ఆనవాళ్లు సాన పట్టిన మురిపించే చిత్రాల గత పోలికల మధ్య కూర్చొండిపోయిన నుదిటి రాతని…
అతనిచ్చిన విసిటింగ్ కార్డు వల్ల.. ఇక్కడకి చేర్చ గలిగారు.
నిమిత్తం లేకుండా దేనిని ఎవరు చేర్చగలరు.. నేను తన ఉన్న శ్వాసలోనే తలకిందులు నిద్ర మూర్తిని స్నానానికి తీసుకెళ్లి.. కొంచెం సమయం రుద్దిపోసినపుడు అలిసిపోతూ … కథ మందగించిన సాయువ్య సంధి దగ్గర దిక్కులేని సాఫల్యతని వదిలి మొక్కుకొంటారు.
వెళ్తూ … వెళ్తూ … ఆయన కొన్ని విలువైన వజ్రాలు ఇచ్చి … అవి ఎవరు తీసుకొంటారో.. ఎంత ఇస్తారో చెప్పాడు. అది చాలా పెద్ద మొత్తం..
ఆయన కళని ఈ భూమి మీద ఉన్న దేనితోనూ కొనలేం.. కానీ అతని ఉనికిని ఈ భూమి పై ఇంకా ఆశించి … ఇది మా చిన్న గురు సమర్పణ.. అన్నాడు.
గురు శబ్దం వినగానే .. నేను కాసేపు మాట రాకుండా ఉండిపోయాను… సుమారు 80 సంవత్చరాల వయసు దగ్గర పడుతున్న ఈశ్వరోపాసకుడు అంటున్న మాట … గురువు … అని..
నేను నవ్వి … ఆయన గురువే లేడు అంటారుగా ? అన్నా…
అతనూ నవ్వి… ఆయనే విశ్వ గురువు.. ఆయనకి గురువుగా ఉండగలవారెవ్వరూ ఈ భూమిమీద లేరు.. ఇక రారు. అని చెప్పి … నా సమాధానం కోసమూ ఆగక … మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు.
వెళ్లిపోవడం .. కాస్త దగ్గరకి జరిగినప్పుడు రెండో ఆగమనం.. ఇది ఎవరికీ అలవాటు కాని ఒక అబద్దం దగ్గర వణికి నిద్ర పొంతనాల మధ్య గాలిపోసుకొని ఓడిపోతుంది.
………………………
ఎవరమూ ఇదే లెక్క అని చెప్పుకోలేం.. నింపాదిగా దీన్నేచూసి సరిపెట్టుకోలేం.. మొవ్వు రాలిన జుట్టుతో దీర్ఘం తీసి ఏడవలేం.. అలవాటు ఎవరు ఎవరి కోసం పడాలి.
ఆ మర్నాడు … సత్యనివేశ్ నన్ను నిద్ర లేపాడు. మనమొక చోటికి వెళ్ళాలి … కారు రెడీ చెయ్యమని.. మళ్ళీ డ్రైవర్ ఎందుకు.. ఇద్దరం బయలు దేరాం. గోదావరి దగ్గరకి వెళ్ళాలన్నాడు.. రాత్రంతా ప్రయాణమే .. అనేక చోట్ల లాగుతూనే ఉన్నాం.. ఎక్కువ తానే డ్రైవ్ చేశాడు. అతనేం అసిస్టెంట్‌లా చూడడు. అదొక పెక్యూలర్ ప్రవర్తన.. అతనికి దగ్గరగా ఉన్నవాళ్ళకి తప్ప అర్ధం కాదు. డబ్బు లెక్కలు ఎప్పుడూ అడగడు.. నేను మోసం చేసి పారిపోతే .. అలా ఎందుకు.. అంతా నువ్వే తీసుకో.. నాకు ఓ గది.. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్… రెండు పూటలా తిండి అంతే.. అన్నాడు.
అలవాటు ఎవరు ఎవరి కోసం పడాలి. అతనలా చెప్పడం లో రెండో అర్ధమేమీ లేదు. కథని ముందూ వెనకలకి జరపడు.. పెద్ద జడివాన అని వణికిపోడు.. భాష్య తీర్మానం లేని చీకటి తిరుగుబాటులో కొత్త దిగులుని చేర్చి పాటని దింపేస్తాడు.
నిజానికి అతను ఏదీ పట్టుకోలేదు ఇప్పుడు వదిలేయడానికి.. ఆ డైరెక్టర్ మరో స్క్రిప్ట్ తో వస్తే … కథ విని .. అతనిని ఎదురుగా నిలబడమని .. చెంప మీద చాచి పెట్టి కొట్టాడు. చిత్రం అతనితో వచ్చిన వాళ్ళు వెళ్లిపోయారు.. అతనక్కడే ఆగి .. పదిహేను రోజులు… మరో కథ … పాటలతో వెళ్ళాడు.. కానీ ఆ కథకి నిర్మాత ఒప్పుకోలేదు.. అతను ఆత్మహత్య చేసుకొన్నాడు.
మృత్యువుకి సరిపోయే సరంజామా అవసరానికంటే చాలా ఎక్కువే ఈ భూమి మీద ఉంది… అంత కన్నా ఎక్కువ బతకడానికి ఉండాలి కాని లేదు.. ఎవరి తప్పుకి ఎవరు కారణం … ఏదీ దేనికి ప్రతిఫలం అనేది ,,, చెప్పడానికి … సమయం మన ముందు ఆగి కూర్చోదు. చర్చించడానికి ఎవరి దగ్గరా ఆ సమయమూ లేదు. తరుముతూనే ఉంటుంది.. కొందరు పట్టాలు తప్పినప్పినపుడు ఊపిరాడక ఇలా తొందర పడతారు. వెనకనుంచి మరొకరెవరో అన్ని వేళలా కాచి రక్షించలేరుగా ?
………………………………….
ఆ నివాళి సభ మన ఇంట్లో పెడదాం ఆరెంజ్ చెయ్యమన్నాడు..
అది ప్రమాదమన్న ..we will face it నా … అన్నాడు. వాళ్ళ ఫామిలీ మెంబెర్స్ కేసు పెట్టారు.. సత్యనివేశ్ని అరెస్ట్ చేసారు.. మూడు రోజులు continues హాలిడేస్ వలన బెయిల్ దొరక లేదు.. అక్కడ అతను … DCPకి తన పాటలతో favorite ఐపోయాడు..
అతను ఎక్కడుంటే అదే వేదిక .. ఓ సారి.. ఓ ప్రోగ్రాంకి .. అక్కడ అనుకోకుండా జరిగిన కొన్ని కులం గొడవల వలన … జనం పది మందే వచ్చారు.. కాని అతనొప్పుకోలేదు.. వాళ్ళని ఆనంద పరవశులని చేసి … చివరిలో వాళ్ళు అతని కాళ్లపై పడ్డారు. ఎక్కడికి చూస్తాడో.. ఏం అంచనా వేస్తాడో.. మరు క్షణం ఎలా ఉంటాడో ఏమాత్రం ఊహించలేం.
జైల్లో ఉండే .. అతని ఫామిలీ మెంబెర్స్ ని పిల్చి .. స్కూల్ చదువుతున్న పాపకి .. కొంత అమౌంట్ ఫిక్స్ చేసి.. పెద్ద అమౌంట్ mutual funds లో ఉంచి SWP ఆప్షన్ తో నెల నెలా ఇన్కమ్ వచ్చేలా చేసాడు. వాళ్ళు అతనికి థాంక్స్ చెప్పడానికి వస్తే ..కలవలేనని చెప్పమన్నాడట.. పాప పెద్దదై .. మ్యూజిక్ ఇంటరెస్ట్ చూపిస్తే తనకి చెప్పమన్నాడట.. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ..నా నెంబర్ ఇచ్చి కాంటాక్ట్ చెయ్యమన్నాడు..
మరో రెండు రోజుల process.. వాళ్ళు కేసు withdraw చేసుకొన్నారు. DCP స్వయంగా ఆయన వెహికల్తో డ్రాప్ చేసి … మాతో కలిసి డిన్నర్ చేసి .. కొన్ని పాటలు విని వెళ్ళాడు.
అతని పాట….తేనె బావిలోంచి బయటపడ్డ సీతాకోక చిలుకల గుట్ట ఒక్కసారిగా ఎగిరినట్లు… నిలువెత్తు చీకటి విచ్చుకొని.. ఏడూ రంగుల సమయ కాంతి మూర్ఛపోతూ .. గతి సంధికి దొరకని మోక్ష వీధి మరో చుక్కాని లేని దీప జ్వరాన్ని పనిగట్టుకొని ఊదుతుంది.
ఆ తర్వాత .. ఎందుకు ఈ తిక్కలోడి దగ్గరకి అనుకున్నారో ఏమో … వన్ ఇయర్ ఒక్కరూ కూడా రాలేదు… అలాని సత్యనివేశ్ .. ఎప్పుడూ ప్రాక్టీస్ చెయ్యని రోజు లేదు. మనమే పిక్టరైజ్ చేద్దాం అన్నాడు. నేను స్పాన్సర్స్ చూడాలిగా .. ముందు కొంత ఫండ్ raisingకి మ్యూజిక్ షోస్ చేద్దామా అన్నా… ….మళ్ళీ అవే పాటలు రిపీట్ చేయడమా .. వద్దులే అన్నాడు.
అతను బాధగా చూసాడు.. గుక్క పెట్టి ఏడ్చాడు.. నేను బిక్కచచ్చి పోయాను.
అది ఏదొక అవకాశమనే చిన్న కారణానికి కాదు.. నా మాట కాదన్ననందుకు కాదు.. మరి దేనికో… తానూ చెప్పలేడు.. ఎప్పుడో ఒక్కసారిగా పాటై కురుస్తాడు..
ప్రస్తుతానికి … ఫైనాన్సియల్ ఇస్సుఎస్ ఏంలేవు.. కాని ఉండవని చెప్పలేం.. ఎప్పుడు ఎవరికీ ఏం ఇచ్చేస్తాడో ఊహించలేం. ఏ మాట ఏ మాట ఎవరికి ఇచ్చేసి ఉన్నాడో అదీ తెలియదు.
………………….
వారణాశి కి వెళదాం అన్నాడు..
సంయోగ మాయా తంత్రం ఊగిసలు జోడించి .. మరలా లేని కథని ముద్దా ముద్దగా అమర్చిన కలగాపులగాపు మంతనాలతో కదిలి ఆ పక్క నూరుతున్న దేహాల చివరి చూపుని చెక్కుతూ ఘాట్లలో కలవరం వండిన ముఖాల దిగులని ఎసట్లో పోసి రాత్రి ఆకలికి అన్నాన్ని వండుతూ వారణాశి.
అక్కడొక గుడిలో … రోజూ అతని సంగీతం ఒక పెర్టిక్యూలర్ టైం అని లేకుండా మొదలుపెట్టాడు.. జనం రోజు రోజుకి పెరిగి.. పాపులర్ అయిపోయాడు.. మరో పెద్ద గుడి వాళ్ళు అక్కడకొచ్చి ప్రోగ్రాం ఇమ్మని.. ఫెసిలిటీస్ ఇంకా బాగా సెట్ చేస్తామని.. మళ్ళీ సన్మానం… చేస్తామని అడిగారు…ఒప్పుకోలేదు…
అక్కడే.. అంతే… దేవస్థానం మా ఖర్చులన్నీ భరించేది. ఓ రోజు కనిపించకుండా పోయాడు.. నేను .. దేవస్థానం వాళ్ళు ఆందోళనతో వెదుకుతూ ఉన్నాం.. ఫోటో చూపించి ఘాట్లలోనూ … పడవవాళ్ళని అడిగాం… ఇక దుకాణాలు మిగిలాయని అటు పోతుంటే …
ఎవరో చెప్పారు … పరుగున వెళ్ళాను.
బిస్మిల్లాహ్ ఖాన్ సమాధి దగ్గర సన్నాయి వాయిస్తూ.. వాళ్ళ వారసులంతా ..
ఇంత ప్రతిభ తో ఈ భూమి మీద ఇంకెవరూ ఆలా సన్నాయి వాయించలేరని… నాకు మాట లేదు.. ఎందుకంటే అదే మొదటిసారి అతను సన్నాయి పట్టుకోవడం.. ఎవరు నమ్ముతారు.
ఆయన నాన్న ఆత్మ రూపానికి ప్రతి రూపమని… కాళ్లపై పడుతున్నారు.. అదేమి అతను చూడటం లేదు.. నన్ను చూసి గుర్తు పట్టనట్లే ఉన్నాడు. ఎవరో ఛానల్ వాళ్ళు అతని ఇంటర్వ్యూ కి వచ్చారు.. ముందేమి మాట్లాడ లేదు.. ఆ తర్వాత ఏడవడం మొదలు పెట్టాడు.. నాకు అర్ధమై సన్నాయి చేతికి ఇచ్చాను.. మళ్ళీ మరో అద్భుతం.. వాళ్ళా వారసులు అక్కడే వాళ్ళ ఇంట్లో ఉండిపొమ్మన్నారు.. అలా ఎన్ని రోజులు.. నెలల.. సంవత్సారాలా .. దశాబ్దాల.. శతాబ్ధాలా.. దేనికైనా వాళ్ళు సిద్ధం.
నేనే నా ఇబ్బందులు చెప్పి ఇంటికి వెళ్తామంటే..
ఆ రోజు ఎయిర్ పోర్ట్ వరకు వేల జనం.. నన్ను గట్టిగా పట్టుకొని నడిచాడు..
ఆ క్షణం లో నా స్తనాలనుంచి స్తన్య ధార కురుస్తూ … కన్యగానే .. తల్లి నయ్యానా ? అనే … చిత్రమైన మగత .. శరీరమంతా పునః దర్శన తో పులకిస్తూ మృత్యువు చుట్టూ తిరుగుతూ … ఇక చాలు .. ఈ క్షణాలు అనిపించే ఒక అనిర్వచనీయత.
సెక్యూరిటీ చెక్ చెయ్యలేదు.. ఫ్లైట్ లోకి అడుగు పెడుతుంటే .. మొత్తం ప్రయాణికులంతా నిలబడి వెల్కమ్ చెప్పారు. ఆ చప్పట్ల వర్షం లో నాకు నేనే తప్పిపోయాన.. ఒక అనాది సంగీతం లో నా ఖనన మహోత్సావం జరిగినట్లు.. అతను మాత్రం ఘాడంగా నిద్ర పోతున్నాడు.
సోషల్ నెట్వర్క్ లో అతని వీడియోస్ కి మిలియన్స్ అఫ్ వ్యూస్ .. దాని నుంచి కొంత ఇన్కమ్ generate చేయవచ్చని.. ఓ ఫైనాన్స్ అడ్వైసర్ ని హైర్ చేసుకొని.. కొన్ని పెర్మనెంట్ ప్రాపర్టీస్ అమ్మేసి … standard ఇన్కమ్ వచ్చే ఏర్పాట్లు చేసుకొన్నాను..
………………………………
కొన్ని ధ్వనులు.. క్రియలు.. పదాలు.. విశ్వ వ్యాపితంగా తిరిగే అలసట మధ్య కంటి రాశాలని తవ్వుకొంటూ… ఎప్పుడు ఎవరిని ఎలా ఆశీర్వదిస్తుందో చెప్పలేం.. వయసు దేనికి ప్రతీక అని అంచనా వెయ్యలేం… చాలా చాలా చిన్న ఏజ్ లోనే .. సత్య నివేశ్ రాసుకున్న నోట్స్.. రాగ ప్రయోగాలు, కొన్ని పాటల సాహిత్యం.. అతను చెబితే తప్ప ఆ గే నిఊహించడం అసాధయం.. ఈ శూన్యం లోనూ శతాబ్దాల ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తూ… జన్మ ముహూర్తం సమీపించిన్నపుడు … తల్లి గర్భం లోంచి బయటపడి.. అదే ప్రాక్టీస్ ని కొనసాగిస్తారేమో..
ఓ రోజు ఆ డైరెక్టర్ Kuthuru 16 ఏళ్ళ వయసులో… నేరుగా మా ఇంటికి వచ్చి.. తననియదు . కలవాలంది… సత్యనివేశ్ ఇంట్లో లేడు.. ఎప్పటికి వస్తాడో తెలియదు అన్నా.. తాను అలానే కూర్చొంది.. ఒక గంటలోనే వచ్చి … ఆ అమ్మాయి ముందు కూర్చొని … చెప్పు అన్నాడు. నేనొక సినీమా తీయాలనుకొంటున్న … అని తన బాగ్ లోంచి ఓ స్క్రిప్ట్ తీసింది… నాకు నోటా మాట లేదు. A movie title వాళ్ళ నాన్నకి తన లోంచి ఓ రోజని … స్క్రిప్ట్ చూపించింది…
అది చదివి సత్యనివేశ్ ఆనందం తో ఎగిరి నానా హంగామా చేసాడు… నిర్మాత దొరికాడు.. కానీ ఫైనాన్సియల్ రిస్క్ మేము భరించడానికి ఒప్పుకొంటేనని… సైన్ చేసేసాడు.. నేను డబ్బు వేటలో పడ్డాను. ఎన్నో నిద్ర లేని రాత్రులు మ్యూజిక్ సిట్టింగ్స్ చెప్పలేం… స్టోరీ బోర్డు.. ప్రతి సన్నివేశానికి రఫ్ స్కెచెస్ … క్యారెక్టర్ క్యారికేచర్స్ … రాసుకున్న తర్వాత ఆమె ప్రతిభ పై అతనికి పూర్తి క్లారిటీ వచ్చింది..
చాలా చిన్న బడ్జెట్లో ఫీల్ గుడ్ మూవీగా తయారైంది… అందరికి ఒకేరకమైన surprise అంత చిన్న పాప ఎలా అని… కానీ తాను ప్రూవ్ చేసుకొంది. ఒక తన తండ్రి బిజీ షెడ్యూల్ లోని ఓ రోజుని పిక్టరైజ్ చేస్తూ… ఇప్పుడు కనిపించని ఆయనని వెదికే క్రమంలో … ఆయన ఆత్మ ని ఎలా .. ఎక్కడ పట్టుకుందనేదే మూవీ… వన్ హౌర్ duration తో.. దానికి అతను మ్యూజిక్ చేసిన విధానం .. చాలా మంది సీనియర్స్ కూడా నేర్చుకోవాలిసిన ఓ పాఠం లా ఉంది.
తీవ్ర స్వరం లోంచి … లాగి పోసుకున్న నీళ్లు.. శ్రద్ధాళువు ఏడ్చిన అంతరిక్ష వీధుల్లో మనకి కానీ కనబడని.. ఛాయా జ్ఞప్తి తడిచి .. నిద్ర సందుల్లో లాలించి పోసిన పుట్టుక లోంచి మరో చెమ్మ ఆరని సందేహం నూరుకున్న స్థిమిత రాజీల మధ్యనే ఉండిపోయిన అలసట నిద్ర మూర్తుల తాండవ సంక్షోభానికి ఒక చిన్న పుట్టుమచ్చలా.. ఆ చిన్నగుర్తు.
అతను ఆ తర్వాత చేసిన మ్యూజిక్ షోస్ కి చదువుకి ఇబ్బందిలేదనుకొన్నప్పుడు ఆ పాప వచ్చేది. అతని పాటల నుంచి పాప ఇన్స్పిరె అయ్యే కొత్త కథలు చెప్పేది.. అవన్నీ అతను రికార్డు చేసుకొంటూ వెళ్ళేవాడు.. నాకు వాళ్ళ జర్నీ దగ్గర నుంచి చూసాక అర్ధమైందే ఏంటంటే … వాళ్లిద్దరూ ఒకరికొకరు ఇన్స్పిరేషన్ అని…
………………………….
ఒక రిథమ్ లో ఏదీ జరగనివ్వడని తెల్సు.. కానీ అదెలా .. ఎప్పుడనేది మనం ఊహించలేం.. అదే ఇప్పుడు ఇలా ఈ గోదారీ ప్రయాణం.. ఎప్పుడు తనని ఎక్సైట్ చెయ్యని వర్క్ చెయ్యడు… కాని ఇప్పుడు ఎక్ససిట్మెంట్ మాత్రం … వాటిఅన్నింటికంటే డిఫరెంట్ గా ఉంది. అదే అడిగితే .. తనలో ఏ సంగీత ప్రపంచం నడుస్తుందో .. ఏమి మాట్లాడ లేదు.
సాయుజ్య మహా రావం లోంచి అడుగు తీసి అడుగు వేసుకున్న నిద్ర వికల్ప సంయోగం లోని సమయ జాతర గడువుని మించి పైకి జరుపుకున్న … శ్వాసానిగిలింపు పుప్పొడిన దేహానికంత కలిపి చుట్టుకొని.. జన్మ సాధన ఒలికిన తత్పర ప్రదక్షణలా నది. ఉబికిన కంటిలోంచి నిద్ర జాగారం గడించిన నిశాతల మైమరపు అక్కడెప్పుడూ అలాగే ఉంది.
గోదావరి పరిసరాలు… లంక భూములు .. బెస్త గూడెంలు … గుడులు.. కొండలు… రైల్వే స్టేషన్లు… కొన్ని చోట్ల స్మశానాలు… పడవ ప్రయాణం … స్వీట్స్ … రాత్రంతా గోదావరి చూస్తూ ఉండిపోవడం … అన్ని బావున్నా .. తానేదో వెదుకు తున్నాడు.. చిన్న అసంతృప్తి లో ఉన్నాడు. ఓ రోజు పాప ఫోన్ చేసింది.. ఏదో ట్యూన్ వినిపించాడు.. ఆ పాప ఏడుస్తూ కాల్ కట్ చేసింది… ఆ తర్వాత ఎప్పుడు తాను చేసిన నేను మాట్లాడాను తప్ప తను మాట్లాడలేదు.. ఆ పాప సత్యకివ్వమని అడగ లేదు….
అదే అడిగాను.. ఓ రోజు… ఎప్పుడో సడన్ నాతో మాట్లాడటం మానేస్తే నేనేం చెయ్యాలని… ? ఆ మాటలో చాలా అర్ధాలు ఉన్నాయి.. నిష్టురం ఉంది.. నేను తప్ప ఇంకో గతి లేదనడం ఉంది.. నిలదీయడమూ ఉంది.
అతను అంతే స్థిరంగా .. నా మీద దేనికీ ఆధార పడొద్దు.. నీ ప్రయాణం నువ్వు చెయ్యి… నీకు నేను అడ్డం అనుకుంటే.. నువ్వు ఎప్పుడైనా నన్ను వదిలేయడానికి సిద్ధంగా ఉండు.
అతని సమాధానం ఇలా ఉంటుందని నేను ముందే ఊహించా.. కాని నేనేం మాట్లాడలేదు.. తనేం అడగా లేదు…. అయినా ఏదో చిన్న కసి.. అలా అడిగించందంతే … తేరుకోవడమూ … నాలోదే
ఆరాత్రి మాత్రం మేమొక దీవిని చేరుకున్నాం … దీవి లోపల ఓ restaurant … చిన్న చిన్న ఇల్లుతో ఉంది… అది డే బేసిస్ లో ఇద్దరిద్దరికి రెంట్ కి ఇస్తారు..సాధారణంగా జంటలే ఐఉంటారు. మేము అలా చెప్పే తీసుకొని.. లోపలి వెళ్లి ఫ్రెఆహ్ అయ్యే … మళ్ళీ నది గట్టు దగ్గరికి రాగానే .. అతను తడి నిండిన కళ్ళతో … మనమిక్కడా మూడు రోజులు ఉందాం అన్నాడు. నేను తల ఊపి హోటల్ వాడికి చెప్పి …ఈ రాత్రి వాళ్ళ హోటల్ క్లోజ్ అయ్యేలోపు రాకపోతే … ఫుడ్ రూంలో పెట్టేయమని చెప్పాను … వాళ్ళు సరే అన్నారు.
ఆ దీవి అంతా తిరుగుతూనే ఉన్నాం … తనేం మాట్లాడాడు… కూడా వెళ్తూ ఉండటమే.. ఏవో సౌండ్స్ వింటున్నాడు.. నేను ఫొటోస్ తియ్యబోతే … ఒప్పుకోలేదు.. నేను ఆపేసాను.. ఓ రోజు ఓ చిన్న జలపాతం దగ్గరే నిద్ర పోయాడు… అర్ధ రాత్రి లేచి వెళదామా అన్నాడు. మా ముందు నుంచి ఓ పాము వెళ్ళింది… నేను వణికిపోయి అతనిని పట్టుకున్నాను. వాటి ఇంటిలోకి మనమొస్తే .. మనం వీటికి సిద్ధంగా ఉండాలిగా … అన్నాడు.
కాని మేము దారి తప్పాం .. ఆ రాత్రి హోటల్ చేరలేక పోయాం.
అక్కడొక చిన్న గుహలా ఉంటే దానిలోకి వెళ్ళాం.. బయట చిన్న వాన మొదలైంది..
అతనిలోని పురుషుడిని అదే మొదటిసారి చూడటం … నిర్జన వశీకరణంలో దాదాపు నేల విడిచి రాల్చుకొన్నా సరి అంచు నిద్ర వీధులని అంతా తుడిచి పోయాక .. విశ్వ వీధిలో మేము ఇద్దరమే.. స్త్రీ అనే అనునాద విశ్వపు చీకటి చుట్టుకొని… ఏళ్ళ తర్వాత నాలోపలి సిగ్గు కములుతూ … దీర్ఘ నిండా సరాసరిగా కదిలించే జ్ఞాన బిక్ష మోసేసుకున్న విపరీతాలలోంచి.. ముసుగు తీసిన నిచ్చెర వెసులుబాటు మరిగించిన మోతాదులని దాటి .. కొంచెం కబురు కూడా లేని శ్రద్ధలని తుడుస్తూ… అదొక పురుషుడు కవ్వపు సంతకం ఒరిగిన … నిద్ర గతి ని మాట తప్పించి కౌగలించుకున్న గాలి విస్ఫోటిస్తూ.. ఎవరు ఎవరిలోని కలయికని సంతర్ప సముదాయంలో దేహ రసాయన గది తలుపులని తీర్చి.. చిన్నాని అరుపుతో .. బిగదీసిన నిద్ర మోతాదులని తాగించి.. అలసిన పన్ను బిగువుని దట్టించిపెట్టుకున్న నుదుటి మెరుగుల్లో… పెదాలు గాజు శిలలై పగులుతూ… ఓ ఆచూకీ లేని సమయ ఓగూర్పు మసకబారి.. అతనిని గట్టిగ పట్టుకొని… ఆ అనంతం నుంచి దూకుతూ…తానూ అలాగే ఎప్పటికప్పుడు కొత్తగానే …తర్వాత అక్కడే ఆ స్టే ని అలా రోజు నుంచి రోజుకి పొడిగిస్తూనే ఉన్న.. ఆ రాత్రి దగ్గరయ్యామని.. మరో రోజు అతనేం దగ్గరకి రాలేదు.. మరేమి మాట్లాడనూ లేదు.. నాకు దానినుంచి మరో ప్రయోజనం అందాల్సిందేం లేదు.. తనవన్నీ నా దగ్గరే ఉన్నాయి.. అన్నింటికీ నేనే నామిని అని .. ఓ నోటరీ కూడా చేయించి ఉంచాడు..
………………
అతనొక స్వయంభు లాంటి వాడు… బయట నుంచి ఏమి అక్కర లేదు.. అంతా లోపలే ఉంది.. కాని ఇక్కడేదో వెతుకుతున్నాడు … అదే అర్ధం కావడం లేదు.. అది తనకి పూర్తిగా తెలుసని కాదు… తెలియదనీ కాదు… దేనిని ఓ పట్టానా ఒప్పుకోడు…విని ఉండే ఉంటాడు… నాతో ఉన్నట్లే ఉన్న.. నాతో ఉన్నదీ తాను మాత్రమే కాదు. తన లోపల జరిగే ప్రయాణం మనం అందుకోలేనిది.
ఒక రాత్రి అక్కడికి కొంచెం దూరం లో ఉన్న ఓ కొండ పై .. చిన్న సమతలంగా ఉన్న రాయి పై ధ్యాన ముద్రలో కూర్చొని ఉన్నాడు.. మధ్యాన్నం మైంది.. నేను నీళ్లు ఇవ్వడానికి ట్రై చేసాను.. కదిలిక లేదు.. సాయంత్రం .. రాత్రి…ఆ చలిలో .. దోమల్లో .. వణుకుతూ .. చలి మంట వేసుకొని కష్టం మీద గడిపాను. మళ్ళీ ఉదయం.. నేను విసిగాను.. అరిచాను..తిట్టాను … లేచి రూమ్ కొచ్చి మర్నాడు రాత్రి అతనొక్కడినే.. వాటర్ బాటిల్ అక్కడే ఉంచి వదిలేసాను.
మూడో రోజు అలాగే.. నాతో హోటల్ స్టాఫ్ వచ్చి చూసారు.. నీరసం వచ్చి ఆయనే ఈ వేళ ఆపేస్తారులెండి.. లేదంటే పోలీస్ కంప్లైంట్ రేపిద్దాం అన్నారు.కంప్లైంట్ ఎందుకో .. నాకర్ధం కాలేదు… మీరు నాకు కొంచెం హెల్ప్ చెయ్యండి.. నేను కారులో ఇంటికి తీసుకు వెళ్ళిపోతా అన్నాను. వాళ్ళు ఒప్పుకొని .. ఇద్దరు పైకి వెళ్లి లేపాలి చూసారు.. ఆ తర్వాత ముగ్గురు … నలుగురు… వల్ల కాలేదు… ఆశ్చర్యం .. సరే .. ఇంకొక రోజు చూద్దాం .. వదిలేయండి అన్నా… జనం గుమిగూడటం మొదలు పెట్టారు… ఇదే జరిగితే … అక్కడో గుడి కట్టేస్తారని నా భయం.
కాని .. నాతో పాటు ఓ పది మంది ఆ రాత్రి అక్కడే ఆగారు… ఒకరి తర్వాత ఒకరం గమనిస్తూనే ఉన్నాం.. ఎప్పుడు మేమందరం నిద్ర పోయామో తెలియదు… ఉదయం లేచేసరికి.. అతన్నక్కడ లేడు. అంతా వెదికేస్తున్నాం… కొండలు.. గుట్టలు.. జలపాతాలు.. రోడ్లు.. గూడాలు.. చాలా మంది బైకులు .. కార్లు.. ఎవరికి ఏ చిన్న ఆచూకీ దొరకలేదు. ఒక బిక్షగాడు మాత్రం తాను చూశానని.. ఒంటి నిండా బూడిద పూసుకొన్న ఓ మనిషి.. అతనిని చెయ్యి పట్టుకొని… ఆ ఎత్తైన కొండ వెనకకి తీసుకు పోయాడని… అదెలా సాధ్యం.. అది నిలువు కొండ.. ట్రెక్కిస్ కూడా ఎక్కలేనిది.. ఓ మనిషి ఇతనిని పట్టుకొని ఎక్కించడం అసాధ్యం.. అయినా కిందనుంచే అటు వేపుకి పరుగు పెట్టాం.. అక్కడ మాత్రం.. అతని ఒంటి పైనున్న టీ షర్ట్ … ప్యాంటు కిందపడి కనిపించాయి.
…………………………….

